ఎమ్మెల్సీకీ రాజీనామా? తీన్మార్ మల్లన్న ఇప్పుడు ఏం చేస్తారు..?
కేసీఆర్ పాలనలో బీఆర్ఎస్ ను తిట్టి.. పదుల సంఖ్యలో కేసులను ఎదుర్కొని.. ఆపై బీజేపీ ద్వారా బయటపడి ఆ పార్టీలో చేరిన మల్లన్న ఎంతోకాలం అక్కడ ఉండలేకపోయారు.
By: Tupaki Desk | 2 March 2025 12:30 AM GMTసాధారణ జర్నలిస్టుగా జీవితం ప్రారంభించి కెరీర్ లో మంచి దశకు చేరుకుని.. సొంతంగా మీడియాను ఏర్పాటు చేసుకుని.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సామాజిక అంశాలపై నిలదీస్తూ వచ్చిన తీన్మార్ మల్లన్న ఇప్పుడు ఏం చేస్తారు? అనేది ప్రశ్నగా మారింది.
కేసీఆర్ పాలనలో బీఆర్ఎస్ ను తిట్టి.. పదుల సంఖ్యలో కేసులను ఎదుర్కొని.. ఆపై బీజేపీ ద్వారా బయటపడి ఆ పార్టీలో చేరిన మల్లన్న ఎంతోకాలం అక్కడ ఉండలేకపోయారు. చివరకు కాంగ్రెస్ లో చేరి ఎమ్మెల్సీగా కూడా అయిన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ఏం చేస్తారు? అనేది అందరికీ ఆసక్తికరంగా మారింది.
ఎంతో పోరాటం తర్వాత గత ఏడాది తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. గతంలో సొంతంగా పోటీచేసినా గెలవలేకపోయిన ఆయన ఈసారి మాత్రం అధికార కాంగ్రెస్ పార్టీ అండతో చట్టసభలో అడుగుపెట్టారు.
ఏ ఎమ్మెల్సీ ఎన్నికయితే మల్లన్నను చట్టసభ సభ్యుడిని చేసిందో.. అదే ఎమ్మెల్సీ ఎన్నిక ఆయన కాంగ్రెస్ నుంచి సస్పెండ్ అవడానికి పరోక్షంగా కారణమైందేమో? అనిపిస్తుంది. ఇటీవల తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓ వర్గం వారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసు జారీచేసింది. ఫిబ్రవరి 12లోగా సమాధానం ఇవ్వాలని కోరగా.. మల్లన్న స్పందించలేదు. దీంతో సస్పెండ్ చేసింది.
మల్లన్న ఎమ్మెల్సీ పదవికీ రాజీనామా చేస్తారా? అంటే కాదని కూడా చెప్పలేం.. పూర్తిగా బీసీ వాదంతో ముందుకెళ్లే ఉద్దేశంలో ఉన్నందున ఎమ్మెల్సీ పదవినీ వదులకోవచ్చు. గతంలో సొంతంగా పార్టీనీ స్థాపించిన మల్లన్న ఆ తర్వాత దానిపై ముందుకెళ్లలేదు. మరిప్పుడు తన 7200 ఉద్యమాన్ని కొనసాగిస్తూ సొంత పార్టీని పునరుద్ధరిస్తారేమో చూడాలి. మల్లన్న టీడీపీలో చేరతారంటూ వార్తలు వచ్చినా అందుకు అవకాశాలు తక్కువనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.