పొత్తు రాజకీయానికి 5 నెలలు.. పార్టీల పరిస్థితేంటి...?
అయితే.. సిద్ధాంతాల పరంగా వేటికవే ఉండడంతో ఈ మూడు పార్టీలు ఎన్నాళ్లు మనగలుగుతాయన్న సందేహాలు వచ్చాయి.
By: Tupaki Desk | 16 Aug 2024 3:30 PM GMTరాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కూటమి పార్టీల దూకుడు కనిపిస్తోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. ఇదేసమయంలో కలివిడిగానూ ముందుకు సాగు తున్నారు. మూడు పార్టీలు(బీజేపీ-టీడీపీ-జనసేన) చేతులు కలిపి నాలుగు మాసాలకు పైగానే అయింది. ఎన్నికలకు ముందు మూడు పార్టీల మధ్య పొత్తులు కుదిరాయి. ఎన్నికల్లో సీట్లు పంచుకున్నాయి. ఓట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.
అయితే.. సిద్ధాంతాల పరంగా వేటికవే ఉండడంతో ఈ మూడు పార్టీలు ఎన్నాళ్లు మనగలుగుతాయన్న సందేహాలు వచ్చాయి. కానీ, ఇప్పటి వరకు గడిచిన నాలుగైదు మాసాల్లో ఎక్కడా ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా.. మూడు పార్టీలు కలిసి కట్టుగా ముందుకు సాగుతున్నాయి. కొన్ని కార్యక్రమాలకు కొందరు రాకపోయినా.. దండలో దారం మాదిరిగా.. రాజకీయాల పరంగా.. సర్కారు పరంగా మాత్రం మూడు పార్టీలు కలిసే ఉండడం గమనార్హం.
దీంతో జిల్లాల స్థాయిలో పార్టీలు కలిసి కట్టుగానే ముందుకు సాగుతున్నాయన్న సంకేతాలు వస్తున్నాయి. ఇదిలావుంటే.. ప్రతిపక్షం వైసీపీ మాత్రం ఎక్కడా దూకుడు మాత్రం ప్రదర్శించలేక పోతుండడం గమ నార్హం. అధినేత ఆచి తూచి అడుగులు వేస్తున్నారని నాయకులు కొందరు చెబుతున్నారు. మరికొందరు ఇంకా తమకు సమయం ఉందని.. ఇప్పుడే రోడ్డున పడితే ప్రయోజనం లేదని అందుకే మౌనంగా ఉంటున్నామని చెబుతున్నారు. ఎలా చూసుకున్నా..వైసీపీ మాత్రం మౌనంగానే ఉంది.
ఇక, కూటమి పార్టీల ప్రభావంతో వైసీపీ నానాటికీ సన్నగిల్లుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడికక్కడ టీడీపీ నాయకులు వైసీపీ నేతలను పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సక్సెస్ కూడా అవుతు న్నారు. ఇప్పటికే చిత్తూరు, విశాఖ(స్టాండింగ్ కమిటీ), గుంటూరు, హిందూపురం తదితర ప్రాంతాల్లో వైసీపీ నేతలు టీడీపీకి జై కొట్టారు. ఈ పరిణామాలతో జిల్లాల స్థాయిలో కూటమికి ఉన్న జోష్.. వైసీపీలో కనిపించడం లేదనే టాక్ వినిపిస్తుండడం గమనార్హం.