Begin typing your search above and press return to search.

1500 అప్లికేషన్ల సంగతేంటి...వైసీపీయే దిక్కా...!?

నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన కాంగ్రెస్ ని పైకి లేపడం అన్నది అసాధ్యం అయినా ఎంతో కొంత సాధ్యం చేయాలన్నది ఆమె ఆలోచన.

By:  Tupaki Desk   |   26 March 2024 2:30 AM GMT
1500 అప్లికేషన్ల సంగతేంటి...వైసీపీయే దిక్కా...!?
X

వైసీపీని కాంగ్రెస్ ఏపీ ప్రెసిడెంట్ షర్మిల టార్గెట్ చేశారు. ఒకే పొలిటికల్ ఫిలాసఫీ కలిగిన రెండు పార్టీలు. కాంగ్రెస్ నుంచే వైసీపీ పుట్టింది అన్నది తెలిసిందే. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంతా వైసీపీ వద్దనే ఉంది. దాంతో షర్మిల బిగ్ టాస్క్ ని ఎంచుకుని ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టారు. నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన కాంగ్రెస్ ని పైకి లేపడం అన్నది అసాధ్యం అయినా ఎంతో కొంత సాధ్యం చేయాలన్నది ఆమె ఆలోచన.

ఈ నేపధ్యంలో షర్మిల వైసీపీ మీదనే పూర్తిగా ఫోకస్ పెట్టేశారు. ఏపీలో చూస్తే దాదాపుగా అన్ని పార్టీలు అభ్యర్ధులను ప్రకటించేస్తున్నాయి. వైసీపీ మొత్తం లిస్ట్ రిలీజ్ చేసింది. టీడీపీకి కొన్ని తప్ప మొత్తం జాబితాను రిలీజ్ చేసింది. జనసేన మూడు పెండింగులో పెట్టింది. బీజేపీ ఎంపీల లిస్ట్ రిలీజ్ అయింది. ఎమ్మెల్యేల లిస్ట్ ఒకటి రెండు రోజులలో వస్తుంది.

మరి ఏపీలో మొత్తం 175 మంది అభ్యర్ధులను నిలబెడతామని ఫిబ్రవరి మూడవ వారం నుంచే దరఖాస్తులను ఆహ్వానించిన కాంగ్రెస్ పార్టీ తమకు 1500 కి పైగా అప్లికేషన్లు వచ్చాయని చెప్పుకుంది. షర్మిల విజయవాడ పార్టీ ఆఫీసులో ఇంటర్వ్యూలు కూడా చేసారు. ఢిల్లీ వెళ్ళి అభ్యర్ధుల మీద కసరత్తు కూడా చేశారు. కానీ లిస్ట్ మాత్రం రిలీజ్ కాలేదు.

దానికి కారణం అప్లికేషన్లు అయితే వచ్చాయి కానీ ఎమ్మెల్యే స్థాయిలో ఢీ కొట్టే వారు పెద్దగా ఎవరూ లేరని అంటున్నారు. దాంతోనే కాంగ్రెస్ అధినాయకత్వం కూడా తెలంగాణా మీదనే ఫోకస్ పెట్టేసింది. ఈ క్రమంలో షర్మిల ఏపీలో అధికార వైసీపీ మీద దృష్టి సారించారు.

రోజుకు ఒక ఎమ్మెల్యే లేక మాజీ ఎమ్మెల్యే వంతున తన పార్టీలో చేర్చుకుంటున్నారు. అది కూడా బడుగులు బలహీన వర్గాల నియోజకవర్గాల నుంచే వచ్చిన వారికి కండువాలు కప్పుకున్నారు అలా చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా చేరారు. దాని కంటే ముందు నందికొట్కూరు ఎమ్మెల్యే చేరారు. అలాగే చిత్తూరులోని పూతలపట్టు ఎమ్మెల్యే కూడా చేరిపోయారు.

ఇపుడు ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మాజీ ఎమ్మెల్యే దార సాంబయ్య కుమార్తె పద్మజ కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా షర్మిల ట్విట్టర్ ద్వారా వైసీపీని ఎండగట్టారు. వైసీపీ నాయకత్వం నిరంకుశ ధోరణితో విసుగు చెంది ఇవాళ కొందరు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎంతో సంతోషంతో వారికి స్వాగతం పలుకుతున్నాను. నంద్యాల జడ్పీటీసీ గోకుల్ కృష్ణారెడ్డి, సంతనూతలపాడు మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య కుమార్తె దారా పద్మజ, ఉభయ గోదావరి జిల్లాల వైసీపీ ఎస్టీ సెల్ ఇన్చార్జి సృజన నేడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి వారు కృషి చేస్తారు. ఏపీ ప్రజల సంక్షేమం కోసం వారు కాంగ్రెస్ పార్టీతో కలిశారని షర్మిల వివరించారు.

ఇవన్నీ చూస్తే ఎస్సీ నియోజకవర్గాలను మైనారిటీ సెగ్మెంట్లను షర్మిల టార్గెట్ చేసినట్లుగా ఉంది. ఏదో విధంగా కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ని ఏపీలో అభివృద్ధి చేసి చూపించాలని ఆమె చూస్తున్నారు. కాంగ్రెస్ అధినాయకత్వం కనీసంగా పది నుంచి పదిహేను శాతం ఓటు బ్యాంక్ పెరుగుతుందని భావించింది. కానీ అలాంటిది ఏదీ కనిపించడం లేదు

వైసీపీ లిస్ట్ రిలీజ్ చేసిన తరువాత అసమ్మతి నేతలు అంతా బీజేపీ జనసేన టీడీపీలలో చేరిపోయారు. కాంగ్రెస్ వైపు ఎవరూ పెద్దగా రావడం లేదు. అదే సమయంలో వైసీపీలో టికెట్లు దక్కని కొంతమంది మాత్రం ఈ వైపుగా వస్తున్నారు. దాంతో షర్మిలలో ఉత్సాహం కనిపిస్తోంది. అయితే కాంగ్రెస్ మొత్తం లిస్ట్ ఎపుడు రిలీజ్ అవుతుంది. అందులో వెరు తప్ప పోటీ చేసే సత్తా ఉన్న గట్టి అభ్యర్ధులు ఎవరైనా ఉంటారా అన్న దానిని బట్టి కాంగ్రెస్ కి వచ్చే ఓట్ల శాతం ఎంతో తెలుస్తుంది అని అంటున్నారు.