టాలీవుడ్ కి చంద్రబాబు ఏమి ఇవ్వగలరు ?
దాంతో టాలీవుడ్ షూటింగులకు టికెట్ల రేట్ల పెంపునకు ఇతరత్రా సమస్యలకు మాత్రం పరిష్కారం లభించేందుకు అవకాశం ఉంటుంది అని అంటున్నారు.
By: Tupaki Desk | 22 Jun 2024 2:30 AM GMTటీడీపీ మీద కోటి ఆశలు పెట్టుకుని టాలీవుడ్ ఉంది. ఉమ్మడి ఏపీలోనూ విభజిత ఏపీలోనూ రెవిన్యూ పరంగా చూస్తే ఏపీ అత్యంత కీలకం. అలాగే టాలీవుడ్ తెలంగాణాలో లోకేట్ అయి ఉన్నా ఏపీతోనూ వారికి అవసరాలు ఉన్నాయి.
టీడీపీ ప్లస్ జనసేన ప్లస్ బీజేపీ కూటమిగా ఏర్పడిన ప్రభుత్వం ఇది. దాంతో టీడీపీ టాలీవుడ్ కి ఫేవర్ గానే ఉంటుంది, అదే విధంగా జనసేన నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. దాంతో ఆశలు రెట్టింపు అవుతున్నాయి. మరి టాలీవుడ్ కోరికలు ఏమిటి చంద్రబాబు ఏమి ఇవ్వగలరు అన్నది చర్చనీయాంశం అవుతోంది.
విషయానికి వస్తే టీడీపీకి టాలీవుడ్ కి ఎప్పటి నుంచో అవినాభావ సంబంధం ఉంది. ఆ పార్టీ సృష్టి కర్త అయిన ఎన్టీయార్ ప్రముఖ సినీ నటుడు. అలా టాలీవుడ్ మూలాలు టీడీపీలో ఉన్నాయి. ఇపుడు చూస్తే మెగా ఫ్యామిలీ నుంచి పవన్ కళ్యాణ్ కలిశారు. దీంతో టీడీపీ కూటమి నుంచి టాలీవుడ్ భారీ ఎత్తున ఆశలు పెట్టుకుంది అని అంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలీ అంటే చాలానే ఎక్స్ పెక్ట్ చేస్తోంది అని అంటున్నారు.
అయితే టాలీవుడ్ అంతా హైదరాబాద్ లోనే స్థిరపడిన నేపధ్యం ఉంది. ఉమ్మడి ఏపీలో అది సమస్య కాదు కానీ విభజన ఏపీలో చూస్తే ప్రతీదీ లెక్కగానే ఉంటుంది. టాలీవుడ్ కి ఏమైనా చేయాలీ అంటే ఆలోచించాల్సిందే అని అంటున్నారు.
ఇక టాలీవుడ్ కి ఏమి చేయాలన్నా టికెట్లు ధరలు పెంచడం తప్పించి ఏపీ సర్కార్ పెద్దగా చేసేది ఏమీ ఉండదని అంటున్నారు. ఇక ఏపీలో షూటింగులు ఎక్కువగా చేసుకుంటే పన్ను రాయితీలు ఇవ్వడం అన్నది మరో వెసులుబాటుగా ఉంటుంది. గతంలో ఏపీలోనే ఎక్కువగా షూటింగులు జరిగేవి కూడా.
ఇపుడు కూడా అదే విధానం ఉండొచ్చు. అలాగే విద్యుత్ బిల్లుల విషయంలోనూ రాయితీలు ఇవ్వవచ్చు. అయితే ఏపీ విభజన తరువాత తొలిసారిగా ఏర్పడిన చంద్రబాబు ప్రభుత్వం టాలీవుడ్ ని ఏపీకి రావాలని కోరింది. అప్పట్లో విశాఖ రాజమండ్రి వంటి చోట్ల స్టూడియోల నిర్మాణం కోసం కూడా ప్రభుత్వం సాయం చేస్తుందని మాట వినిపించింది.
అయితే ఇపుడు చూస్తే విశాఖ వంటి చోట్ల భూములు ఇచ్చే పరిస్థితి లేదు అనే అంటున్నారు. విశాఖలో హైదరాబాద్ కంటే భూములకు విలువ ఎక్కువగా ఉంది అని అంటున్నారు. ఒకవేళ ఇవ్వాలనుకుంటే కూడా కులాలు ఇతర సమీకరణలను కూడా ముందుకు తెచ్చే ప్రమాదం ఉంది అని అంటున్నారు.
ఇక గత వైసీపీ ప్రభుత్వం అయితే విశాఖలో భూములు ఇస్తామని అన్నట్లుగా ప్రచారం సాగింది. స్టూడియోలు కట్టుకోండి అని ప్రతిపాదనలు పంపిందని దాని వల్లనే సినీ పెద్దలు అంతా వచ్చి జగన్ ని కలిసారు అని అనుకున్నారు. అయితే ఆ భేటీయే చివరికి వైసీపీకి జగన్ కి మైనస్ గా మారింది. జగన్ చిరంజీవిని అవమానించారని నమస్కారానికి ప్రతి నమస్కారం చేయలేదని ఏకంగా విమర్శలు వచ్చాయి. దాని మీద వైసీపీ నుంచి సరైన వివరణలు రాలేదు.
ఈ సంగతి ఇలా ఉంటే నాడే చిరంజీవిని మహేష్ బాబుని కాస్తా గౌరవించి వారిని విశ్వసించి వైసీపీ ముందుకు అడుగులు వేసి ఉంటే విశాఖ ఒ ఎంతో కొంత టాలీవుడ్ కళ కనిపించేది అని అంటున్నారు. ఏది ఏమైనా టాలీవుడ్ హైదరాబాద్ లో ఉంది. అక్కడే లోకేట్ అయి ఉంది. అభివృద్ధి చెందుతోంది. ఇక ఏపీకి సినీ పరిశ్రమ తరలిరావాలి అంటే అది పెద్ద వ్యవహారం. భూములు ఉదారంగా ఇవ్వాలి. ఇచ్చినా టాలీవుడ్ ఈ వైపుగా వస్తుందని అపుడే గట్టిగా చెప్పలేని పరిస్థితి ఉంది. ఇపుడు ఏపీలో అంతా భూముల మీదనే వివాదాలు గొడవలు జరుగుతున్న వేళ కూటమి ఆ దిశగా ఆలోచనలు చేయకపోవచ్చు అని అంటున్నారు.
దాంతో టాలీవుడ్ షూటింగులకు టికెట్ల రేట్ల పెంపునకు ఇతరత్రా సమస్యలకు మాత్రం పరిష్కారం లభించేందుకు అవకాశం ఉంటుంది అని అంటున్నారు. మరో వైపు చూస్తే టాలీవుడ్ నుంచి ఏపీ ఏమి ఆశించినా పూర్తిగా అక్కడ స్థిరపడిన పరిశ్రమ అయితే ఎంత కొంత అయినా తరలిరాదు అన్నది వాస్తవం అంటున్నారు. అయితే వీలైనంతవరకూ ఏపీలో షూటింగులు జరిగితే సినీ కళ కచ్చితంగా కనిపిస్తుంది. అదే ఉభయకుశలోపరిగా భావించాల్సి ఉంటుంది.