ఆలీ ఏం సాధించినట్లు?
ఐతే వైసీపీలో చేరిన ఆలీకి గత రెండు ఎన్నికల్లోనూ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు.
By: Tupaki Desk | 29 Jun 2024 4:14 AM GMTకమెడియన్ అలీ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు చేసిన ప్రకటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గత ఐదేళ్ల నుంచి ఆలీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల ముంగిట అతను జనసైనికులకు పెద్ద షాకిస్తూ వైసీపీలో చేరిపోయాడు. పవన్ కళ్యాణ్‌కు దశాబ్దాల నుంచి అత్యంత ఆప్తమిత్రుల్లో ఒకడిగా కొనసాగిన ఆలీ.. జనసేనలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడని అనుకుంటే అనూహ్యంగా వైసీపీకి జై కొట్టడం చాలామంది జీర్ణించుకోలేకపోయారు.
జనసేనలో చేరకపోయినా ఓకే కానీ.. వైసీపీలో చేరడమే వారికి రుచించలేదు. ఆ పార్టీలో చేరడానికి ముందు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు మంత్రి పదవి ఇచ్చే పార్టీలోనే చేరతానని పేర్కొనడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఐతే వైసీపీలో చేరిన ఆలీకి గత రెండు ఎన్నికల్లోనూ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. వేరే చెప్పుకోదగ్గ పదవీ ఇవ్వలేదు.
2024 ఎన్నికలకు ఏడాది ముందు ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పేరుతో ఏదో మొక్కుబడిగా ఓ పదవి ఇచ్చాడు జగన్. దాంతో ఆలీ ఏం బావుకున్నాడన్నది ఆయనకే తెలియాలి. ఒక ఏడాది పదవి అనుభవించి ఇప్పుడు వైసీపీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోగానే ఆ పార్టీకే కాక రాజకీయాలకూ టాటా చెప్పేశాడు. వైసీపీలో ఉండి ఆయన బావుకున్నది పెద్దగా ఏమీ లేదు.
దాని వల్ల సినిమా కెరీర్ దాదాపుగా ముగిసిపోయిందనే చెప్పాలి. ఆ పార్టీలో ఆయనకు దక్కిన ప్రాధాన్యం అంతంతమాత్రం. ఈ ఐదేళ్ల పొలిటికల్ స్టింట్ లేకపోయి ఉంటే ఆలీకి పవన్‌తో మంచి సంబంధాలుండేవి. ఒకవేళ జనసేనలో చేరి పార్టీ కోసం పని చేసి ఉంటే ఇప్పుడు వైభవం చూసేవాడు. ఇండస్ట్రీలో ఉన్న మంచి పేరు, జనాల్లో ఫాలోయింగ్ కూడా ఉండేది. వైసీపీలో చేరడం ద్వారా పవన్ అభిమానుల అభిమానాన్ని కోల్పోయాడు. ఇండస్ట్రీలో కూడా పేరు చెడగొట్టుకున్నాడు. మొత్తంగా చూస్తే వైసీపీలోకి రావడం ద్వారా ఆలీ ఏం సాధించాడు అంటే ఏమీ లేదని చెప్పవచ్చు.