Begin typing your search above and press return to search.

ఏపీలో అధికారంపై ఎగ్జిట్ పోల్స్ చెప్పిందేంటి ?

కొన్ని సర్వేలు వైసీపీకి మరి కొన్ని సర్వేలు టీడీపీ కూటమికి ఫేవర్ గా ఇచ్చాయి.

By:  Tupaki Desk   |   1 Jun 2024 4:11 PM GMT
ఏపీలో అధికారంపై ఎగ్జిట్ పోల్స్ చెప్పిందేంటి ?
X

ఏపీలో ఎవరిది అధికారం అన్న దాని మీద ఎగ్జిట్ పోల్స్ చెప్పిందేంటి అన్నది చూస్తే జూన్ 4 న వచ్చే అసలైన ఫలితాల కోసం వెయిట్ చేయమనే అన్నది స్థూలంగా అర్థం అవుతోంది. కొన్ని సర్వేలు వైసీపీకి మరి కొన్ని సర్వేలు టీడీపీ కూటమికి ఫేవర్ గా ఇచ్చాయి.

అదే సమయంలో హోరా హోరీ పోరు ఉంటుందని పలు సర్వే సంస్థలు వేసిన నంబర్ బట్టి తెలుస్తోంది. ఇక జాతీయ సర్వేలు అన్నీ ఏపీలో టీడీపీ కూటమి గెలుపుని ఖాయం చేస్తే లోకల్ గా ఉన్న కొన్ని సంస్థలు వైసీపీ గెలుపు అని చెబుతున్నాయి అలాగే మరి కొన్ని టీడీపీ అంటున్నాయి.

ఇక ఎగ్జిట్ పోల్ సర్వేలు కూడా ఈసారి గందరగోళానికి కారణంగానే కనిపిస్తున్నాయని అంటున్నారు. ఒక విధంగా చెప్పాలీ అంటే ఎగ్జిట్ పోల్స్ వల్ల కూడా ఏపీ ఫలితం తేలలేదు అనే అంటున్నారు. తెలంగాణా కర్నాటక ఎన్నికల్లో వచ్చినంత క్లారిటీ అయితే ఏపీ ఎన్నికల ఫలితాల విషయంలో ఇవ్వలేదని అంటున్నారు.

చాలా ఎగ్జిట్ పోల్ సంస్థలు జాగ్రత్తగా ఫలితాలు ఇచ్చినటుగా తెలుస్తోంది. రేపటి రోజున ఎటు పోయి ఏమి వచ్చినా తాను సేఫ్ జోన్ లో ఉన్నట్లుగా ఉంటుందని భావించినట్లుగా ఉంది. దాంతో ఎగ్జిట్ పోల్స్ లో ఎగ్జాక్ట్ ఫలితం ఏమిటి అన్నది పెద్దగా తేలలేదు అన్నది ఒక విశ్లేషణ.

దాంతో ఎవరి మటుకు వారు మేమే గెలుస్తున్నామని చెప్పుకోవడం జరుగుతోంది. ఇక ఎగ్జిట్ పోల్స్ మీద ఎంతో ఆసక్తి కనబరిచిన వారికి తొలి అరగంటలోనే సీన్ అర్ధం అయింది అని అంటున్నారు. ఏపీలో అసాధారణమైన రాజకీయ పరిస్థితులు ఉండడంతో ఏ వైపునకు మొగ్గితే ఏమి అవుతుందో అన్నట్లుగా సర్వే ఫలితాలు చాలా సమయస్పూర్తితో వదిలినట్లుగా కనిపిస్తోంది అని అంటున్నారు.

కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చూస్తే తమాషాగా కనిపించాయి. లోక్ సభకు ఒకరికి ఎక్కువ సీట్లు ఇచ్చి అసెంబ్లీకి వచ్చేసరికి మరో పార్టీకి పట్టం కట్టారు. ఏమిటి ఇది అంటే మోడీ ప్రభావం అని చెబుతున్నారు. మరి జాతీయ స్థాయిలో 2019లో కూడా మోడీ ప్రభావం ఇంతకంటే ఎక్కువగానే ఉంది.

అపుడు ఎందుకు ఏపీ ఫలితాల మీద అవి ప్రతిబింబించలేదు అంటే దానికి బహుశా జవాబు సెఫాలజిస్టుల వద్ద ఉండదేమో. అదే సమయంలో చాలా ఎక్కువ సమయం పోలింగ్ కి ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ కి మధ్య ఉండడం కూడా సర్వేలలో అనేక ఇతర అంశాలు కూడా చొచ్చుకుని వచ్చినట్లుగా కనిపిస్తోంది.

ఇవన్నీ చూస్తూంటే అత్యంత గందరగోళ పరిస్థితులనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా కలుగ చేశాయని అంటున్నారు అదే జాతీయ స్థాయిలో తీసుకుంటే దాదాపుగా వన్ సైడెడ్ గా ఫలితాలు చూపించాయి. మరి ఇందులో సాధ్యాసాధ్యాలు అన్నవి జూన్ 4న వచ్చే ఫలితాలే వెల్లడించాల్సి ఉంటుంది.