Begin typing your search above and press return to search.

ఎగ్జిట్ సర్వేలు ఏమి చెప్పబోతున్నాయి ?

ప్రీ పోల్ సర్వేలు ఒక ఎత్తు అయితే పోస్ట్ పోల్ సర్వేలు మరో ఎత్తు.

By:  Tupaki Desk   |   30 May 2024 12:30 AM GMT
ఎగ్జిట్ సర్వేలు ఏమి చెప్పబోతున్నాయి ?
X

సర్వేలు అంటే సర్వేశ్వరుడు చేసినవి కావు. ఎవరికి వారుగా తమ ప్రతిభా పాటవాలు చూపించి సర్వేలు చేసిన వారే. ఇందులో పెయిడ్ సర్వేలు ఉన్నాయని కూడా విమర్శలు ఉన్నాయి. ప్రీ పోల్ సర్వేలు ఒక ఎత్తు అయితే పోస్ట్ పోల్ సర్వేలు మరో ఎత్తు. సోషల్ మీడియా అంతా ఈ తరహా సర్వేలతో నింపేశారు.

ఇపుడు అసలైన ఘట్టం ఆరంభం అయింది. అందరూ ఆతృతగా ఎదురు చూసే కీలక సమయం దగ్గరకు వచ్చింది. అదే ఎగ్జిట్ పోల్ సర్వేల రిలీజ్. జూన్ 1న ఆఖరి విడత లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ సాయంత్రం ఆరు గంటలతో పూర్తి అవుతాయి. ఆ మరుక్షణం ప్రముఖ మీడియా చానళ్ళలో వరసబెట్టి ఎగ్జిట్ పోల్ సర్వేలు వచ్చేస్తాయి.

దేశంలో ఎవరు గెలుస్తారు అన్నది ఒక ఆసక్తి అయితే ఏపీలో ఎవరిది అధికారం అన్నది మరో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. ఎక్కువ మందికి ఏపీ మీదనే దృష్టి ఉంది. జగనా చంద్రబాబా ఎవరిది విజయం జనాల మూడ్ ఏ వైపు ఉంది అన్నది ఎగ్జిట్ పోల్స్ కొంతలో కొంత అయినా విషయం చెబుతాయని అంతా ఎదురుచూస్తున్నారు.

జాతీయ స్థాయి నుంచి ప్రాంతీయ స్థాయి వరకూ ప్రముఖ సర్వే సంస్థలు అన్నీ ఎగ్జిట్ పోల్స్ ని చేసి రిపోర్టులను చాలా రోజులుగా దగ్గర ఉంచుకున్నాయి. ఇందులో నుంచి కీలక సమాచారాన్ని వైసీపీ టీడీపీ అధినేతలకు కూడా పంపించారు అని కూడా ప్రచారం సాగుతోంది.

ఆ విధంగా కీలక పార్టీలకు ఎగ్జిట్ పోల్స్ లో ఏమి చెబుతారు సర్వేలు ఏ విధంగా వస్తాయన్నది ఈపాటికే తెలిసిపోయిన విషయం అని అంటున్నారు. అంటే జగన్ కి చంద్రబాబుకు జూన్ 1న వచ్చే ఎగ్జిట్ పోల్ సర్వేలలో మ్యాటర్ ఏమిటి అన్నది ఇదమిద్దంగా తెలుసు అని అంటున్నారు.

ఇదిలా ఉంటే ఎగ్జిట్ పోల్స్ ని చూసి టెన్షన్ పడవద్దని ఒక పార్టీ తన పార్టీ క్యాడర్ కి దిశా నిర్దేశం చేసినట్లుగా ప్రచారం అయితే సాగుతోంది. ఆ పార్టీ నేతలు డీలా పడకుండా అతి ముఖ్య సందేశం ఈ విధంగా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక పోతే ఎగ్జిట్ పోల్స్ ఏమి చెబుతాయన్న దాని మీద కూడా రకరకాలైన అంచనాలు ప్రచారాలు ఉన్నాయి.

ఏపీలో వార్ వన్ సైడ్ అయింది అన్నది ఎగ్జిట్ పోల్స్ లో చెప్పబోతున్నాయట. అందరూ అనుకుంటున్నట్లుగా బొటా బొటీ మెజారిటీ అంటే 90 సీట్లకు అటూ ఇటూగా రావడం జరగదని అంటున్నారు. గెలిచిన పార్టీ ఏదైనా 130కి తక్కువ లేకుండా రావచ్చు అని అంటున్నారు. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ లో అదే ఉంటుందని కూడా చెబుతున్నారు.

ఇక ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి అలాగే టీడీపీ కూటమికి కూడా అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ సర్వేలు వచ్చాయని అంటున్నారు. అయితే ఎవరికి ఎక్కువ వచ్చాయి అన్నది ఇక్కడ పాయింట్. అంతే కాదు ఎగ్జిట్ పోల్స్ సర్వేలను చేసిన ఆయా సంస్థలకి ఉన్న క్రెడిబిలిటీ కూడా ఇక్కడ మరో పాయింట్.

అలాగే వారికి ఉన్న సక్సెస్ ట్రాక్ రికార్డు ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్న మీదట జనాలు ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అన్నది జూన్ 1వ తేదీ సాయంత్రం ఆరు దాటిన తరువాత ఒక అంచనాకు అయితే రావచ్చు అని అంటున్నారు. అదే విధంగా ఎగ్జిట్ పోల్స్ సర్వేలు అన్నీ నిజం అవుతాయా అంటే ఎక్కువ శాతం అయినట్లుగా ఇటీవల జరిగిన కర్నాటక తెలంగాణా ఎన్నికలు నిరూపించాయి.

కాబట్టి జూన్ 4 కంటే జూన్ 1 మీదనే అందరికీ ఆసక్తి పెరిగిపోతోంది. మరో నలభై ఎనిమిది గంటలలో ఎగ్జిట్ పోల్ సర్వేలు ఏపీలో పార్టీల జాతకాన్ని బట్టబయలు చేయవచ్చు అని అంటున్నారు. చూడాలి మరి ఎగ్జిట్ పోల్ సర్వేలు ఎన్ని నిజం అవుతాయో. ఎగ్జాక్ట్ పోల్ రిజల్ట్స్ ని ఎన్ని మ్యాచ్ చేస్తాయో చూడాల్సి ఉంది.