Begin typing your search above and press return to search.

ఏపీలో బీజేపీ తీరు ఇలా అయ్యిందేంటి ?

అయినా ఏమీ అనలేక కిమ్మన్నాస్తిగా ఉండాల్సిన పరిస్థితి అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   4 Aug 2024 3:08 AM GMT
ఏపీలో బీజేపీ తీరు ఇలా అయ్యిందేంటి ?
X

బీజేపీ అంటే జాతీయ పార్టీ. ప్రపంచంలోనే అతి పెద్ద సభ్యత్వం ఉన్న పార్టీ అని గొప్పలు చెప్పుకునే బీజేపీకి ఏపీలో ఎన్నడూ చూడని అనుభవం ఇపుడు ఎదురవుతోంది అని అంటున్నారు. ఏపీలో బీజేపీది కూటమిలో మిత్ర పక్షం పాత్ర. అయినా ఏమీ అనలేక కిమ్మన్నాస్తిగా ఉండాల్సిన పరిస్థితి అని అంటున్నారు.

బీజేపీకి ఒక మంత్రి పదవిని చంద్రబాబు ఇచ్చారు. ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అలా చూస్తే అదే బీజేపీకి మహద్భాగ్యం కింద లెక్క అని అంటున్నారు. అలాగే ముగ్గురు ఎంపీలు నెగ్గారు. అందులో ఒకరికి బీజేపీ కేంద్ర మంత్రి పదవి ఇచ్చింది. ఇక్కడితో బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలతో పాటు ఇతర నాయకులకు పదవీ భోగం సరి అని అంటున్నారు.

ఇక మీదట ఏ పదవులు అయినా బాబు దయ బీజేపీ ప్రాప్తం అన్నట్లుగానే ఉంటుందని అంటున్నారు. ఏపీలో బీజేపీ లేకపోయినా 135 ఎమ్మెల్యేలతో టీడీపీ ప్రభుత్వం బ్రహ్మాండంగా నడపగలదు. కానీ 16 మంది టీడీపీ ఎంపీల మద్దతు లేక పోతే ఒక్క క్షణం కూడా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం నిలవదు అన్నది తెలిసిందే.

దాంతో ఏపీ బీజేపీ నేతలదే ఎక్కువ బాధ్యత అని అంటున్నారు. ఏపీలో టీడీపీని చంద్రబాబుని ఏమీ అనకుండా వీలైతే ఆయనను మరింతంగా ప్రశంసిస్తూ ముందుకు పోవాల్సిన అవసరం అయితే బీజేపీకే ఎక్కువగా ఉంది అని అంటున్నారు. ఇది రాజకీయ గణితం. లెక్కలు ఇంత పక్కాగా ఉంటే ఏపీ బీజేపీ నేతలు మాత్రం నామినేటెడ్ పదవుల మీద గంపెడాశలు పెట్టుకున్నారని అంటున్నారు.

వందకు పైగా కార్పోరేషన్లు అందులో మెంబర్లు ఇలా ఎన్నో పదవులు ఉన్నాయి. అలాగే శాసనమండలిలో ఇక మీదట ఏ ఖాళీ ఏర్పడినా కూటమికే చాన్స్ వస్తుంది. అలా అందుకో ఎమ్మెల్సీ పదవి కోసం పలువురు సీనియర్లు చూస్తున్నారు. ముందుగా చూస్తే నామినేటెడ్ పదవుల పంపకంలో తొలిదశ ఆగస్టు నెలలోనే జరుగుతుందని అంటున్నారు.

శ్రావణ మాసం మంచి ముహూర్తం చూసుకుని చంద్రబాబు పదవుల పందేరాన్ని మొదలెడతారు అని అంటున్నారు. అయితే ఈ పదవులను అందుకోవాలని కూటమిలో మిత్ర పక్షంగా బీజేపీ నేతలు చూస్తూంటే వారికి ఆ చాన్స్ దక్కుతుందా అన్నదే వేయి డాలర్ల ప్రశ్నగా ఉందిట.

ఎందుకంటే ముందే చెప్పుకున్నట్లుగా బాబు ఇస్తెనే పదవులు తీసుకోవడం తప్ప డిమాండ్ చేసే స్థితిలో బీజేపీ లేదు. అదే 2014 నుంచి 2019 టెర్మ్ లో అయితే బీజేపీ ఏపీలో డిమాండ్ చేసే స్థితిలో ఉండేది. అపుడు కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి ఫుల్ మెజారిటీ ఉండేది. ఏపీలో ఆర్ధిక అవసరాల రీత్యా బాబు కేంద్రం మీద పూర్తిగా ఆధారపడిన నేపథ్యం ఉండేది.

దాంతో నామినేటెడ్ పదవుల నుంచి ఎమ్మెల్సీ పదవుల దాకా బీజేపీ కీలక నేతలకు దక్కాయి. ఈసారి అలా కానే కాదు అని అంటున్నారు. పైగా టీడీపీకి ఎవరూ యాంటీగా నోరెత్తకూడని స్థితి ఉంది. బాబు ఇచ్చినా ఇవ్వకపోయినా సరే మౌనంగానే ఉండాలి. మరో వైపు చూస్తే చంద్రబాబు తన పార్టీకి చెందిన వారికే అత్యధిక శాతం పదవులు ఇవ్వాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. పొత్తులలో భాగంగా చాలా మంది త్యాగరాజులు అయ్యారు.

వారు తమ సొంత సీటుని సైతం త్యాగం చేసి మరీ పార్టీ విజయానికి కృషి చేశారు. అటువంటి వారికే అగ్ర తాంబూలం ఇవ్వాలని అవసరం అయితే మిత్ర పక్షాలకు సర్దిచెప్పి అయినా తొంబై శాతం పైగా నామినేటెడ్ పదవులు తమ్ముళ్లకు ఇవ్వాలని బాబు ఆలోచిస్తున్నారుట. జనసేనకు ఇస్తే కొన్ని పదవులు ఇవ్వవచ్చు కానీ పందేరం బీజేపీ దాకా వస్తుందా అన్నదే చర్చగా ఉందిట.

మొత్తం మీద చూస్తే బీజేపీలో ఫైర్ బ్రాండ్లు, అలాగే ఒంటి కాలి మీద లేచే నాయకులు ఇపుడు ఫుల్ సైలెంట్ అయిపోతున్నారు. ఈ అయిదేళ్ళూ ఇంతేనా ఏపీలో బీజేపీ తీరు ఇలా అయిందేంటి అని అనుకునే స్థితి ఉందిట. కేంద్రంలో బీజేపీకి ఆక్సిజన్ ఏపీలోని టీడీపీ కాబట్టి మెచ్చాలి తప్ప నొచ్చుకునేలా ఉండరాదు అన్నదే కమలనాధులకు కొత్తగా అర్ధమవుతున్న పాఠం అని అంటున్నారు.