Begin typing your search above and press return to search.

ఇరుగు పొరుగు పుల్లన.. భారత్ నైబర్ హుడ్ ఫస్ట్ కు ఏమైంది?

విదేశాంగ విధానంలో పొరుగు దేశాలకు చాలా ప్రాధాన్యం ఇస్తామని తొలి నుంచి మోదీ సర్కారు చెబుతోంది.

By:  Tupaki Desk   |   16 Aug 2024 7:30 PM GMT
ఇరుగు పొరుగు పుల్లన.. భారత్ నైబర్ హుడ్ ఫస్ట్ కు ఏమైంది?
X

భారత ఉప ఖండం.. మాల్దీవుల నుంచి కలుపుకొంటే భూటాన్ వరకు, మయన్మార్ నుంచి పాకిస్థాన్ దాకా.. మన ఇరుగుపొరుగు. కానీ.. రానురాను ఈ సంబంధాలు పుల్లన అవుతున్నాయి. పదేళ్ల క్రితం మోదీ తొలిసారి ప్రధాని అయినప్పుడు పొరుగు దేశాల అధినేతలను భారత్‌ లో పర్యటించాలని ఆహ్వానించారు. పాకిస్థాన్ కు నాడు ప్రధానిగా ఉన్న నవాజ్ షరీఫ్ కూడా వీరిలో ఉన్నారు. విదేశాంగ విధానంలో పొరుగు దేశాలకు చాలా ప్రాధాన్యం ఇస్తామని తొలి నుంచి మోదీ సర్కారు చెబుతోంది. దీనికే 'నైబర్‌ హుడ్ ఫస్ట్' అని 'పొరుగు దేశాలకు మొదటి ప్రాధాన్యం' అని పేరు పెట్టింది.


పదేళ్లలో పొరుగు దూరం

చైనా వంటి ప్రాంతీయ శక్తి పక్కన ఉన్నప్పుడు భారత్ కు నిత్యం సవాల్. అందులోనూ ఆర్థికంగా చాలా పేద దేశాల నడుమ బలీయమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న భారత్ పై అందరి కన్నూ ఉంటుంది. అయితే, చైనా మన పొరుగును బుట్టలో వేసుకుంటూ.. ఇరుకున పెడుతోంది. దక్షిణాసియాలోని పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, మయన్మార్, నేపాల్ లో చైనా వేలు పెట్టింది. పెట్టుబడులు పెట్టింది. భారత్ కు వ్యతిరేకంగా ఎగదోస్తోంది. అందుకే కొన్నేళ్లుగా లంక, నేపాల్ మనకు దూరం జరుగుతున్నాయి.

పాశ్చాత్యం కాదు.. పొరుగు

మోదీ ప్రభుత్వం పాశ్చాత్య దేశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ పొరుగును విస్మరిస్తోందా? అనే విమర్శలు వస్తున్నయి. నేపాల్, శ్రీలంక, బంగ్లా దేశ్‌ లలో మోదీ తొలి విడత ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే పర్యటించారు. కానీ, అప్పటికి, ఇప్పటికి పరిస్థితి చాలా తేడా వచ్చింది. అక్కడి ప్రజల్లో అప్పుడు మోదీకి ఉన్న ఆదరణ ఇప్పుడు లేదు. పాక్ తో సంబంధాలు ఎలాగూ మెరుగుపడడం క్లిష్టం.

నినాదం వచ్చాకే..

విచిత్రంగా ‘నైబర్‌ హుడ్ ఫస్ట్’ విధానం తెచ్చాకే పొరుగు దేశాలు దూరమయ్యాయి. లకం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పడి.. భారత్ నుంచి భారీ సహాయం పొందింది. కానీ, ఇప్పుడు చైనాకు దగ్గరైంది. డ్రాగన్ గూఢచారి నౌకకు తన పోర్టులో లంగరుకు అనుమతించింది. నేపాల్‌ లో మొన్నటివరకు ఉన్న దహల్ ప్రభుత్వం భారత్ కు అనుకూలం. కానీ, ఆయననున దింపేసి కేపీ శర్మ ఓలీ వచ్చారు. ఈయన గతంలోనే భారత వ్యతిరేక గళం వినిపించారు.

మాల్దీవ్.. మాట వినదు..

గత ఏడాది మాల్దీవుల వ్యవహారం అందరూ చూశారు. ఆ దేశ మంత్రలు.. మోదీపై నోరు పారేసుకున్నారు. భారత అనుకూల ప్రభుత్వం పడిపోయాక.. అధ్యక్ష పదవిని చేపట్టిన మొహమ్మద్ మయిజ్జు.. తమ దేశం నుంచి భారత సైన్యం వెళ్లిపోవాలని ఆదేశించారు. ఆయన పార్టీ అయితే 'ఇండియా ఔట్' ప్రచారం చేపట్టింది. మయిజ్జు చైనా వైపు మొగ్గుతున్నారు. కాగా, వ్యూహాత్మక, విదేశీ, ఆర్థిక అంశాలలో భారత్‌ పైనే ఆధారపడిన భూటాన్ దౌత్య సంబంధాలను నెలకొల్పాలన్న చైనా ప్రతిపాదనను నేరుగా తిరస్కరించలేదు. ఇక అఫ్గానిస్తాన్, మయన్మార్‌ ప్రభుత్వాలతో భారతదేశానికి సత్సంబంధాలు లేవు. అఫ్ఘాన్ లోని తాలిబాన్‌ తో పూర్తి దౌత్య సంబంధాలను ఏర్పరచుకోలేదు. తాజాగా వీటి జాబితాలో బంగ్లాదేశ్ చేరింది. మూడున్నరేళ్ల కిందట మోదీ బంగ్లాదేశ్ పర్యటనలో ఉండగా ఆయనకు వ్యతిరేకంగా నిరసనలు, హింస చెలరేగాయి. ఇటీవలి రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమంలోనూ భారత వ్యతిరేక భావాలు కనిపించాయి.

భారత విదేశాంగ విధానంలోని తీవ్రమైన కొన్ని లోపాల కారణంగానే ఇరుగు పొరుగు దూరమయ్యాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దక్షిణాసియా భౌగోళిక రాజకీయ నిర్మాణం కారణంగా ఈ పరిస్థితి ముందుగానే నిర్ణయమైందా? అనే ప్రశ్నలు వస్తున్నాయి.