Begin typing your search above and press return to search.

బిగ్ ఇష్యూ... గాజాలో ఆ 13,000 మంది ఏమయ్యారు?

ఇలా మరణించిన వారి విషయంపై క్లారిటీ ఉందట కానీ.. తాజాగా అదృశ్యమైన వారి సంఖ్య తీవ్ర చర్చనీయాంశం అవుతుంది.

By:  Tupaki Desk   |   30 May 2024 12:18 PM GMT
బిగ్  ఇష్యూ... గాజాలో ఆ 13,000 మంది ఏమయ్యారు?
X

హమాస్ – ఇజ్రాయేల్ మధ్య జరుగుతున్న యుద్ధం ఇప్పుడు అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధంవల్ల గాజాలో ఇప్పటికే సుమారు 36 వేల మంది పాలస్తీనియన్లు మరణించారని అంటున్నారు. ఇలా మరణించిన వారి విషయంపై క్లారిటీ ఉందట కానీ.. తాజాగా అదృశ్యమైన వారి సంఖ్య తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. వారి సంఖ్య సుమారు 13,000 ఉండొచ్చని అంటున్నారు.

అవును... అక్టోబరు 7న, ఇజ్రాయెల్‌ లోని ఒక మ్యూజిక్ ఫెస్ట్ లక్ష్యంగా హమాస్ ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఊచకోతలో సుమారు 1,200 మంది మరణించారు. మరోపక్క హమాస్ ఫైటర్లు సుమారు 252 మందిని బందీలుగా తీసుకెళ్లారు. దీంతో హమాస్‌ ను తుదముట్టించడమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ దాడి మొదలుపెట్టింది.. గాజాపై విరుచుకుపడిపోతుంది.

అయితే... గాజాపై ఇజ్రాయేల్ సైన్యం దాడులు చేస్తున్నప్పటి నుంచీ గాజాలోని సుమారు 13,000 మంది ఆచూకీ తెలియడం లేదని జెనీవాలో ఉన్న యూరో మెడ్ హ్యూమన్ రైట్స్ మానిటర్ అనే స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. దీంతో ఆ పదమూడు వేల మంది పాలస్థీనియన్లు ఏమయ్యారనే చర్చ బలంగా వినిపిస్తుంది.

ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 13,000 మంది ఆచూకి తెలియడం లేదనే విషయం ఇప్పుడు గాజాలో చర్చనీయాంశంగా మారింది. అయితే వీరిలో సుమారు 10,000 మంది వరకూ శిథిలాల కింద చిక్కుని మృతి చెంది ఉంటారని అంటున్నారు. ఈ మేరకు గాజా సివిల్ డిఫెన్స్ ఆ విధంగా అంచనా వేసింది.

ఇక్కడ మరో టెన్షన్ విషయం ఏమిటంటే... గాజాలోని శిథిలాల కింద చాలా మృతదేహాలతో పాటు సుమారు 7,500 టన్నుల పేలని ఆయుధాలు మిగిలి ఉన్నాయని ఐక్యరాజ్య సమితి భావిస్తోంది. దీంతో.. ఇది మరింత ఆందోళనకరమైన అంశం అని అంటున్నారు. ప్రస్తుతం శిథిలాల కింద నుంచి మృతదేహాలను వెలికితీసేందుకు వలంటీర్లతో కలిసి సివిల్ డిఫెన్స్ పనిచేస్తోంది.

ఈ సమయంలో గాజాలో ఎండలు పెరుగుతుండటంతో శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికితీయకపోతే.. అవి కుళ్ళిపోతాయని, ఫలితంగా ఇది ఆరోగ్య సమస్యకు దారితీస్తుందనే ఆందోళన కూడా వినిపిస్తుంది. దీంతో... మృతదేహాలను వెలికితీసేందుకు ఐక్యరాజ్యసమితితో పాటు అనుభవజ్ఞులైన సిబ్బంది ఉన్న దేశాల మద్దతును కోరింది సివిల్ డిఫెన్స్!

ఇదంతా ఒకెత్తు అయితే... అదృశ్యమైన వ్యక్తులను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) నిర్బంధించి ఉండవచ్చని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ భావిస్తోంది. ఇదే సమయంలో గాజాకు చెందిన వందలమంది పాలస్తీనియన్లు ఐడీఎఫ్ ఆధీనంలో ఉన్నారని.. ఈ విషయంపై వారి కుటుంబాలకూ సమాచారం లేదని యూరో మెడ్ హ్యూమన్ రైట్స్ మానిటర్ ఆరోపిస్తోంది. మరి ఈ మిస్సింగ్ వ్యక్తుల ఆచూకీపై హమాస్ ఆధ్వర్యంలో నడిచే ఆరోగ్య మంత్రిత్వ శాఖ అలాంటి ఆలోచనలు చేయబోతుందనేది వేచి చూడాలి!