Begin typing your search above and press return to search.

‘పరిటాల’.. కుటుంబం పరిస్థితి ఏమిటి?

దీంతో ఒకే కుటుంబం నుంచి పలు నియోజకవర్గాల్లో పోటీ చేయాలని ఆశిస్తున్నవారికి నిరాశ తప్పడం లేదని అంటున్నారు.

By:  Tupaki Desk   |   9 Feb 2024 8:20 AM GMT
‘పరిటాల’.. కుటుంబం పరిస్థితి ఏమిటి?
X

ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో సీట్ల కేటాయింపులో ఆయన పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం. ఇందులో భాగంగా ఒక కుటుంబంలో ఒకరికే టికెట్‌ ఇవ్వాలని నిర్ణయించారని అంటున్నారు. దీంతో ఒకే కుటుంబం నుంచి పలు నియోజకవర్గాల్లో పోటీ చేయాలని ఆశిస్తున్నవారికి నిరాశ తప్పడం లేదని అంటున్నారు.

ముఖ్యంగా అనంతపురం జిల్లాలో చంద్రబాబు నిర్ణయంతో మాజీ మంత్రి పరిటాల సునీత కుటుంబం నిరాశతో ఉందని చెబుతున్నారు. వాస్తవానికి పరిటాల సునీత, ఆమె కుమారుడు పరిటాల శ్రీరామ్‌.. రాఫ్తాడు, ధర్మవరం నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు.

2019 ఎన్నికల్లో పరిటాల సునీతకు బదులుగా ఆమె కుమారుడు పరిటాల శ్రీరామ్‌ రాప్తాడు నుంచి పోటీ చేశారు. అయితే వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాశ్‌ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.

మరోవైపు 2019 ఎన్నికల్లో ధర్మవరం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన వరదాపురం సూరి (గోనుగుంట్ల సూర్యనారాయణ) వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకట రామిరెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత వరదాపురం సూరి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

వరదాపురం సూరి బీజేపీ చేరికతో ధర్మవరంలో టీడీపీకి అభ్యర్థి లేకుండా పోయారు. ఇక అప్పటి నుంచి పరిటాల శ్రీరామ్‌ ధర్మవరంలో పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో పరిటాల సునీత రాప్తాడు నుంచి, పరిటాల శ్రీరామ్‌ ధర్మవరం నుంచి సీట్లను ఆశించారు. ఈ మేరకు ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు.

అయితే చంద్రబాబు ఒక కుటుంబం నుంచి ఒకరికే టికెట్‌ ఇవ్వాలని నిర్ణయించడంతో పరిటాల కుటుంబం నిరాశకు గురయిందని అంటున్నారు. కొద్ది రోజుల క్రితం పరిటాల సునీత.. చంద్రబాబును కలిశారు. తనకు, తన కుమారుడికి రెండు సీట్లు ఇవ్వాలని కోరారు. రాప్తాడు టికెట్‌ ఇస్తామని ఆమెకు చెప్పిన చంద్రబాబు ధర్మవరం సీటు విషయంలో ఏ హామీ ఇవ్వలేదని చెబుతున్నారు.

రాప్తాడు, ధర్మవరంలలో వైసీపీ అభ్యర్థులు ప్రకాశ్‌ రెడ్డి, కేతిరెడ్డి ఇద్దరూ ఆర్థికంగా బలంగా ఉన్నారని చంద్రబాబు చెప్పినట్టు తెలుస్తోంది. ఇప్పుడు మీరు రెండు చోట్ల పోటీ చేయాలనుకుంటే మీ ఆర్థిక సామర్థ్యం సరిపోదని ఆయన చెప్పినట్టు సమాచారం. అందువల్ల ఒక్కచోట నుంచే పోటీ చేయాలని సూచించినట్టు ప్రచారం జరుగుతోంది.

ఒకవేళ సునీత కోరినట్టు ఒకే కుటుంబంలో ఇద్దరికి సీట్లు ఇస్తే ఇదే రకమైన డిమాండ్‌ మరికొన్ని కుటుంబాల నుంచి కూడా రావచ్చని అంటున్నారు. ఈ పరిణామం చంద్రబాబుకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు. అందువల్లే ఆయన రెండుసీట్ల విషయంలో పరిటాల సునీతకు ఎలాంటి హామీ ఇవ్వలేదని అంటున్నారు.