Begin typing your search above and press return to search.

భగ్గుమన్న మహారాష్ట్ర... ఏమిటీ మరాఠాల డిమాండ్?

మరాఠాలకు రిజర్వేషన్ల డిమాండ్‌ తో మనోజ్‌ జరంగె అనే వ్యక్తి అక్టోబర్‌ 25 నుంచి జల్నా జిల్లాలోని అంతర్వలి సరటి గ్రామంలో నిరశన దీక్షకు సాగిస్తున్నారు.

By:  Tupaki Desk   |   31 Oct 2023 4:52 AM GMT
భగ్గుమన్న మహారాష్ట్ర... ఏమిటీ  మరాఠాల డిమాండ్?
X

విద్యాసంస్థలు, ఉద్యోగాల్లో మరాఠా వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ మహారాష్ట్రలో రెండోదఫా జరుగుతోన్న ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. ఈ సమయంలో... మరాఠా రిజర్వేషన్ల డిమాండ్‌ కు మద్దతుగా సీఎం శిండే సన్నిహితులు, శివసేనకు చెందిన ఎంపీలు హేమంత్‌ తుకారాం, హేమంత్‌ పాటిల్‌ లు సోమవారం రాజీనామా చేశారు. ఇదే క్రమంలో... బీజేఫీ ఎమ్మెల్యే లక్ష్మణ్‌ పవార్‌ కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ విషయం రాజకీయంగా మరింత హాట్ టాపిక్ గా మారింది.

అవును... మరాఠా వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని డిమాండు చేస్తూ మహారాష్ట్రలో జరుగుతోన్న ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. ఇందులో భాగంగా... బీడ్‌ జిల్లా మజల్‌ గావ్‌ లోని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ) ఎమ్మెల్యేలు ప్రకాశ్‌ సోలంకె, సందీప్‌ క్షీరసాగర్‌ ఇళ్లకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఇదే సమయంలో... మజల్‌ గావ్‌ మున్సిపల్‌ కౌన్సిల్‌ భవనంలోని మొదటి అంతస్తులో ఫర్నిచర్‌ కు నిప్పుపెట్టి, విధ్వంసం సృష్టించారు. దీంతో బీడ్‌ జిల్లాలో అధికారులు కర్ఫ్యూ విధించారు.

అదేవిధంగా... ఛత్రపతి శంభాజీ జిల్లా గంగాపూర్‌ లో బీజేపీ ఎమ్మెల్యే ప్రశాంత్‌ బంబ్‌ కార్యాలయాన్ని నిరసనకారులు ధ్వంసం చేశారు. కిటికీలు, ఫర్నిచర్‌ ధ్వంసం చేశారు. అయితే... మరాఠాలకు రిజర్వేషన్లు అక్టోబర్‌ 24 నుంచి అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ప్రభుత్వానికి 40 రోజుల డెడ్‌ లైన్‌ పెట్టిన విషయాన్ని... చిన్న పిల్లల ఆట అనుకుంటున్నారంటూ ఎమ్మెల్యే సోలంకె చేసిన వ్యాఖ్యల ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవ్వడంతో ఈ దాడులు జరిగాయని తెలుస్తుంది.

మరాఠాలకు రిజర్వేషన్ల డిమాండ్‌ తో మనోజ్‌ జరంగె అనే వ్యక్తి అక్టోబర్‌ 25 నుంచి జల్నా జిల్లాలోని అంతర్వలి సరటి గ్రామంలో నిరశన దీక్షకు సాగిస్తున్నారు. దీనిపై ఎమ్మెల్యే సోలంకె.. కనీసం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా పోటీ చేయని వ్యక్తి, ఇప్పుడు నాయకుడా? అంటూ వ్యాఖ్యానిస్తున్నట్లుగా ఆ ఆడియోలో ఉంది. దీంతో మరాఠా సంఘాలు భగ్గుమన్నాయి. ఇందులో భాగంగా... సోమవారం స్థానికంగా బంద్‌ కు పిలుపునిచ్చాయి. ఈ సమయంలో కొందరు ఆందోళనకారులు ఎమ్మెల్యే ఇంటిని చుట్టుముట్టి నిప్పుపెట్టారు.

ఇదే సమయంలో... షోలాపూర్‌ – అక్కల్‌ కోట్‌ హైవేపై మండుతున్న టైర్లను వేసి కొంతమంది ఆందోళనకారులు వాహనాలను అడ్డుకున్నారు. మరి కొందరు నిరసనకారులు కర్రలు పట్టుకుని గంగాపూర్‌ లోని ఎమ్మెల్యే ప్రశాంత్‌ కార్యాలయంపై దాడి చేశారు. రిజర్వేషన్ డిమాండ్‌ పై తమ వైఖరిని స్పష్టం చేయాలని ఆందోళనకారులు యావత్మాల్‌ హింగోలి ఎంపీ హేమంత్ పాటిల్‌ ను అడ్డగించారు. దీంతో పాటిల్ అక్కడికక్కడే తన రాజీనామా లేఖను ఆందోళనకారులకు అందజేశారు.

దీంతో ఈ వ్యవహారం పూర్తిస్థాయిలో పొలిటికల్ స్టంట్ గా మారిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో... రిజర్వేషన్‌ లపై ప్రశ్నిస్తే రాజీనామా స్టంట్స్ చేస్తున్నారని ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే వ్యాఖ్యానించారు. ఆ సంగతి అలా ఉంటే... మరాఠా రిజర్వేషన్ల కోసం జల్నాకు చెందిన మనోజ్ జరంగే చేపడుతున్న నిరవధిక నిరాహార దీక్ష సోమవారానికి ఆరో రోజుకు చేరింది. దీంతో... అతడి జరంగే ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోందని చెబుతున్నారు!

కాగా.. మహారాష్ట్రలో 33శాతం మంది మరాఠీలు ఉన్నారు. వీరిలో ఎక్కువశాతం మంది వ్యవసాయంపై ఆధారపడిన వారే. అయితే గతకొంతకాలంగా కరువు పరిస్థితుల వల్ల ఆర్ధికంగా చితికిపోవడంతో విద్య, ఉద్యోగాల్లో 16శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఈ బిల్లుకు 2018లో రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా... విద్యలో 12%, ఉద్యోగాల్లో 13% రిజర్వేషన్ కల్పించాలని ముంబై హైకోర్టు సూచించింది.

అయితే... దీని ఫలితంగా మొత్తం రిజర్వేషన్లు 65% దాటిపోతున్నాయి. దీంతో సుప్రీంకోర్టు ఈ బిల్లుపై స్టే విధించింది. ఈ నేపథ్యంలో మరోసారి రిజర్వేషన్ లపై మరాఠీలు ఆందోళనలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో తాజా ఆందోళనలు హింసాత్మకంగా మారాయి!