Begin typing your search above and press return to search.

ఏపీ అసలు అప్పులు ఎంతో ఇప్పటికైనా తేలేనా?

ఏపీ ప్రభుత్వం అప్పులు చేయకుండా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని.. అప్పులపై శ్వేత పత్రం వెలువరించాలనే డిమాండ్లు కూడా వెల్లువెత్తాయి.

By:  Tupaki Desk   |   10 Jun 2024 1:48 PM GMT
ఏపీ అసలు అప్పులు ఎంతో ఇప్పటికైనా తేలేనా?
X

ఆంధ్రప్రదేశ్‌ వైసీపీ ప్రభుత్వ హయాంలో బాగా చర్చనీయాంశమైన అంశం... ఆ రాష్ట్ర అప్పులు. ప్రతిపక్షాలతోపాటు మేధావులు, పలువురు ఆర్థిక నిపుణులు జగన్‌ ప్రభుత్వం భారీ ఎత్తున అప్పులు చేస్తోందని తీవ్ర విమర్శలు చేశారు. ఇలా అప్పులు చేసుకుంటూ పోతే ఏపీ కూడా శ్రీలంక, పాకిస్థాన్, జింబాబ్వేలా దివాళా ఎత్తడం ఖాయమనే విశ్లేషణలు చేశారు. ఏపీ ప్రభుత్వం అప్పులు చేయకుండా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని.. అప్పులపై శ్వేత పత్రం వెలువరించాలనే డిమాండ్లు కూడా వెల్లువెత్తాయి.

ఆంధ్రప్రదేశ్‌ అప్పులు ఏకంగా రూ.12 లక్షల కోట్లకు చేరిపోయాయని ఇటీవల వరకు ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తూ వచ్చాయి. రాష్ట్రంలో వివిధ కార్పొరేషన్లు, విలువైన ప్రభుత్వ భూములు, వివిధ సంస్థలను కూడా తనఖా పెట్టి వైసీపీ ప్రభుత్వం అప్పులు తెచ్చిందనే విమర్శలు ఉన్నాయి. అలాగే రాబోయే సంవత్సరాలకు సంబంధించి మద్యం ఆదాయాన్ని చూపి.. ఆ ఆదాయంపైనా అప్పులు తెచ్చిందనే అపప్రధ వైసీపీ ప్రభుత్వం మూటగట్టుకుంది.

ఈ నేపథ్యంలో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం అసలు అప్పులు లెక్కలు తేల్చాలనుకుంటోంది. అసలు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేసిన అప్పులెన్ని? కార్పొరేషన్లను, విశాఖలాంటి నగరాల్లో విలువైన ప్రభుత్వ భూములనూ తనఖా పెట్టి తెచ్చిన అప్పులెన్ని? వీటిని ఏయే వాటికి ఖర్చు పెట్టారు? వాటి లెక్కలు.. కాగ్‌ (కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌)కు సమర్పించిన వివరాలు, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) వద్ద తెచ్చిన అప్పులు ఇలా అన్ని వివరాలను కూటమి ప్రభుత్వం బయటకు తీసే పనిలో ఉందని సమాచారం.

వైసీపీ ప్రభుత్వం ఈ ఐదేళ్లలో చేసిన అప్పులపై కూటమి ప్రభుత్వం శ్వేత ప్రభుత్వం వెలువరించాలనే ఆలోచనలో ఉందని అంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు జగన్‌ ప్రభుత్వం చేసిన అప్పుల వివరాల లెక్కలు చెప్పాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వ ఉన్నతాధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయని అంటున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించడం ఇందుకు నిదర్శనం. ఈ సమీక్షకు ఆర్థిక శాఖతోపాటు ఇతర శాఖల ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు.

ఈ ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పులు, ఎక్కడి నుంచి ఎంతెంత తెచ్చారు? వాటిని ఏ పథకాలకు వినియోగించారు? వాటికి సంబంధించిన దస్త్రాలు, అప్పులకు సంబంధించిన వడ్డీలు... ఇలా అన్ని వివరాలను వీలైనంత త్వరగా చెప్పాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌.. అధికారులను ఆదేశించారు.

ముఖ్యంగా ఆర్థిక శాఖలో ఈ ఐదేళ్లు రావత్, సత్యనారాయణ అనే ఇద్దరు అధికారులు చక్రం తిప్పారు. ఆయా శాఖలకు, పథకాలకు నిధుల విడుదల, కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు, పెండింగ్‌ బకాయిల విడుదల, కొత్త అప్పులు తేవడం వంటి బాధ్యతలన్నింటినీ వీరిద్దరే చక్కబెట్టారు. దీంతో సత్యనారాయణను తాజా సమావేశానికి సీఎస్‌ పిలిచారని తెలుస్తోంది. మొత్తం అప్పులు గురించి ఆయనకే పూర్తి అవగాహన ఉండటంతో అప్పుల లెక్క తేల్చాలని సీఎస్‌ ఆయనను ఆదేశించారని సమాచారం.

జూన్‌ 12న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆ తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైనే ఆయన మొదటి సమీక్ష జరిపే అవకాశం ఉందని అంటున్నారు. ఆలోగా రాష్ట్ర అప్పుల లెక్కలతో అన్ని శాఖల అధికారులు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ ఆదేశించినట్టు ప్రచారం జరుగుతోంది. అప్పుల లెక్క పూర్తిగా ఒక కొలిక్కి వచ్చాక కూటమి ప్రభుత్వం అప్పులపైన శ్వేత పత్రం విడుదల చేయనుందని తెలుస్తోంది. ఈ అంశం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ గా మారింది.