Begin typing your search above and press return to search.

ఏపీలో బీజేపీకి హ్యాండ్ ఇచ్చేస్తారా ?

ఇప్పటికి అయిదు విడతలుగా ఎన్నికలు జరిగితే 325కి పైగా బీజేపీ ఖాతాలోకి సీట్లు వచ్చాయని ఆ పార్టీ బిగ్ షాట్స్ చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   24 May 2024 2:45 AM GMT
ఏపీలో బీజేపీకి హ్యాండ్ ఇచ్చేస్తారా ?
X

బీజేపీ గ్రాఫ్ జాతీయ స్థాయిలో తగ్గుతోంది అని వార్తలు వస్తున్నాయి. మేము గెలుస్తున్నామని ప్రతీ విడతకూ ఒకసారి నంబర్ ని పెంచుకుంటూ ఆ పార్టీ నేతలు చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పటికి అయిదు విడతలుగా ఎన్నికలు జరిగితే 325కి పైగా బీజేపీ ఖాతాలోకి సీట్లు వచ్చాయని ఆ పార్టీ బిగ్ షాట్స్ చెబుతున్నారు.

అంటే మ్యాజిక్ ఫిగర్ ని ఏనాడో దాటేసామని చెబుతున్నారు. మరో రెండు విడతల పోలింగ్ ఉంది అంటే అవన్నీ తమకు బోనస్ గా వచ్చే సీట్లు అని అంటున్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా అయితే కాంగ్రెస్ కి ఈసారి 40 సీట్లు కూడా రావు అని అంటున్నారు. 2019లో ఆ పార్టీకి 50కి పైగా సీట్లు వస్తే ఈసారి పది కట్ చేసి అమిత్ షా చెప్తున్నారు.

ఇవన్నీ ఇలా ఉంటే రాజకీయ పార్టీలు అన్నాక ఆర్భాటం చేస్తాయి. ఎక్కువగానే చెప్పుకుంటాయి. అలా బీజేపీ మేమే అధికారంలోకి వచ్చేస్తున్నామని చెప్పుకుంటోంది అని అంటున్నారు. ఏపీలో చూస్తే రాజకీయం ఎన్నికల ఫలితాల తరువాత మారుతుందా అన్న చర్చ అపుడే మొదలైంది.

బీజేపీని టీడీపీ కూటమిలోకి చేర్చుకుంది. అలాగే ఎన్డీయేకు మిత్రుడిగా మరోసారి బాబు వచ్చి చేరారు. ఆయన మోడీని విశ్వ గురు అని కూడా కీర్తిస్తున్నారు. బీజేపీయే కేంద్రంలో అధికారంలోకి వస్తుందని బాబు జోస్యం చెబుతున్నారు. అంతే కాదు మోడీ సైతం బాబుని ప్రియ మిత్రమా అని సంభోదిస్తున్నారు. ఈ పలకరింపులు అన్నీ కూడా రాజకీయ అవసరాలుగానే చూడాలని అంటున్నారు.

ఇదిలా సాగుతూండగానే మరో వైపు టీడీపీ అనుకూల మీడియాలో బీజేపీకి వ్యతిరేక కధనాలు పుంఖానుపుంఖాలుగా వస్తున్నాయి. ఏపీకి బీజేపీ పదేళ్ల కాలంలో ఏమీ చేయలేదని విభజన హామీలు నెరవేర్చలేదని ఏపీ ఇలా మారిపోవడానికి కారణం బీజేపీ అంటూ పాపాల భైరవుడిగా బీజేపీని చిత్రీకరిస్తున్నారు. ఈ రాతలు అన్నీ కూడా పోలింగ్ వేళ దాకా కనిపించలేదు.

ఇపుడు ఏపీలో ఎన్నికలు ముగిసాయి కాబట్టి మరోమారు డేరింగ్ గా కలం ఝలిపించి పెద్ద ఎత్తున రాతలు రాస్తున్నారు అని అంటున్నారు. ఈ రాతల వెనకనే అసలైన వ్యూహాలు ఉన్నాయని అంటున్నారు. బీజేపీకి గ్రాఫ్ తగ్గుతోందని జాతీయ మీడియాలో వార్తలు రావడం మరో వైపు ఇండియా కూటమి మేమే అధికారంలోకి వస్తున్నామని ప్రకటించుకోవడం వంటి పరిణామాలతో జాతీయ స్థాయిలో కౌంటింగ్ తరువాత ఏమైనా జరగవచ్చు అని ఊహిస్తున్నారు.

బీజేపీకి మెజారిటీ రాకపోతే మాత్రం ఏపీలో పెద్ద షేక్ హ్యాండ్ ఆ పార్టీకి రెడీగా ఉంటుందని అంటున్నారు. దానికి ముందస్తు ప్రిపరేషన్ గానే ఈ రాతలా అన్న చర్చ సాగుతోంది. టీడీపీ అనుకూల మీడియా రాసింది అంటే అది టీడీపీని ప్రభావితం చేయడానికే అని అంటున్నారు.

అయినా పొత్తులు ఎత్తులు విడాకులు పెడాకులు అవడం ఇటీవల కాలంలో కామన్ అయింది. ఇక ఏపీకి బీజేపీ ఏమీ చేయలేదని చెబుతూ ఇండియా కూటమికి కాస్తా మొగ్గు కనిపిస్తే ఆ వైపునకు వెళ్ళేలా ఏమైనా జరుగుతోందా అన్న చర్చ కూడా సాగుతోంది. చంద్రబాబు జాతీయ స్థాయిలో ప్రముఖ నాయకుడు. ఆయన 2019 దాకా జాతీయ స్థాయిలో ఒక వెలుగు వెలిగారు.

ఏపీలో అధికారం కోల్పోవడంతో ఆయన అలా ఉండిపోయారు. ఒకసారి కనుక ఏపీలో అధికారం దక్కితే ఎక్కువ ఎంపీ సీట్లు చేతిలో ఉంటే బాబు చక్రం మరోసారి జాతీయ స్థాయిలో గిర్రున తిరుగుతుంది అని అంటున్నారు. ఆయనకు ఇండియా కూటమితోనూ మంచి పరిచయాలు ఉన్నాయని కూడా అంటున్నారు. బీజేపీకి తగినన్ని సీట్లు రాకపోతే మాత్రం ఏపీ నుంచే సంచలన నిర్ణయాలకు ఆస్కారం ఉంటుంది అని అంటున్నారు.

ఏపీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పే వీలుంది అంటున్నారు. కాంగ్రెస్ అయితే ప్రత్యేక హోదా ఇస్తుంది, అలాగే విభజించిన కాంగ్రెస్ నుంచే నిధులు పొందే చాన్స్ ఉంటుంది అన్నది మేధావుల ఆలోచన. ఈ పరిణామాల నేపధ్యంలో ఏపీలో రాజకీయాన్ని మలుపు తిప్పే విధంగా ఒక వైపు అనుకూల మీడియాలో వార్తలు వస్తున్నాయని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.