Begin typing your search above and press return to search.

సోనియాది తప్పు కాదు...షర్మిల షాకింగ్ కామెంట్స్

వైఎస్సార్టీపీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల కాంగ్రెస్ మనిషి అయిపోయారా అంటే ఆమె మాటలు చూస్తే అలాగే అనిపిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   2 Sep 2023 4:12 PM GMT
సోనియాది తప్పు కాదు...షర్మిల షాకింగ్ కామెంట్స్
X

వైఎస్సార్టీపీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల కాంగ్రెస్ మనిషి అయిపోయారా అంటే ఆమె మాటలు చూస్తే అలాగే అనిపిస్తున్నాయి. తన తండ్రి దివంగత నేత డాక్టర్ వైఎస్సార్ 14వ వర్ధంతి సందర్భంగా ఇడుపుల పాయకు వచ్చి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా తండ్రిని తలచుకుని ఆమె భావోద్వేగానికి గురి అయ్యారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసే విషయం మీద క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ అగ్రనాయకత్వంతో చర్చలు ఫలవంతంగా సాగాయని, అవి తుది దశకు చేరుకున్నాయని ఆమె అంటున్నారు.

ఇదిలా ఉండగా వైఎస్సార్ పేరుని ఆయన చనిపోయాక ఎఫ్ ఐ ఆర్ లో చేర్చడం కాంగ్రెస్ తెలిసి చేసినది కానే కాదని వివరణ ఇచ్చారు. సోనియా గాంధీ అలా చేయలేదు. ఆమెకు తెలియకుండానే అది జరిగింది అని ఆమె వివరణ ఇచ్చారు. తన పార్టీ వారే దీని మీద ప్రశ్నిస్తున్నారు. అయితే నేను సోనియా గాంధీ రాహుల్ గాంధీ లతో మాట్లాడిన మాటలు ఇపుడు చెబుతున్నాను అన్నారు.

తాను ఇదే అంశం సోనియా గాంధీ వద్ద లేవనెత్తాను అని అన్నారు. అయితే రాజీవ్ గాంధీ చనిపోయాక ఆయన పేరు బోఫోర్స్ కేసుకు సంబంధించి ఎఫ్ ఐ ఆర్ లో పెట్టారని, తాము నాడు ఎంతో బాధపడ్డామని, తాము అనుభవించిన బాధ మరొకరు అనుభవించాలని ఎందుకు కోరుకుంటామని సోనియా రాహుల్ అన్నట్లుగా షర్మిల చెప్పారు.

తన తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డిపైన సోనియాకు అపారమైన గౌరవం ఉందని షర్మిల పేర్కొన్నారు. సిబిఐ ఎఫ్‌ఐఆర్‌లో వైఎస్ఆర్ పేరును చేర్చడం కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పు కాదని ఆమె స్పష్టం చేశారు. వైఎస్సార్ మరణించి పద్నాలుగేళ్ళు గడచినా కూడా ఆయనను తాము మరచిపోలేకపోతున్నామని వారు అన్నారని చెప్పారు. ఆయన లేని లోటు ఈ రోజుకీ తెలుస్తోంది అని అన్నారని ఆమె పేర్కొనడం విశేషం. అవతల వారు అంతలా చెప్పాక వారిలో రియలైజేషన్ వచ్చాక మనం కూడా దానికి అర్ధం చేసుకుని ముందుకు నడవడం మంచి విషయమే కదా అని ఆమె అన్నారు.

తాను అర్ధం చేసుకున్నట్లుగానే వైఎస్సార్ అభిమానులు కూడా ఈ విషయం అర్ధం చేసుకుంటారని భావిస్తున్నట్లుగా చెప్పారు. సరే వైఎస్సార్ మీద ఎఫ్ ఐ ఆర్ పెట్టిన విషయం కాంగ్రెస్ కి తెలియకుండా జరిగిపోయింది అని అనుకున్నా జగన్ పదహారు నెలల పాటు జైలు జీవితం అనుభవించడానికి ఆయన కుటుంబం మొత్తం అప్పట్లో రోడ్డున పడడానికి కాంగ్రెస్ కారణం కాదా అని వైఎస్సార్టీపీలోని నాయకులు లేవనెత్తిన మరిన్ని ప్రశ్నలు. దీనికి షర్మిల ఏ సమాధానం చేప్పలేదని అంటున్నారు.

ఏది ఏమైనా ఆమె కూడా ఆనాడు కాంగ్రెస్ ని విమర్శించిన వారే. ఈనాడు ఆమె కాంగ్రెస్ లో చేరాలని చూస్తున్నారు. దాంతో కాంగ్రెస్ మంచిగా కనిపించడంలో తప్పు లేదు అని అంటున్నారు. మొత్తానికి వైఎస్సార్ ఫ్యామిలీలో ఒక కీలక సభ్యురాలు మళ్లీ కాంగ్రెస్ లో పనిచేసేందుకు సిద్ధమవుతున్నారు. దానికి కౌంట్ డౌన్ మొదలైంది. మరి వైఎస్సార్ ని కాంగ్రెస్ ని వేరు చేసి చూస్తున్న తెలుగు రాజకీయాలలో షర్మిల ఎంట్రీ ద్వారా కాంగ్రెస్ కి ముఖ్యంగా ఏపీలో ఎంత మేరకు లాభం చేకూరుతుంది అన్నది చూడాల్సి ఉంది. కాంగ్రెస్ మంచి పార్టీ అని ఆమె అనవచ్చు.

కానీ ఏపీలో వైఎస్సార్ కి చేసిన అన్యాయం ఒక్కటే కారణం కాదు, అడ్డగోలు విభజన కూడా కాంగ్రెస్ పట్ల మరింత కోపానికి కారణం అయింది. ఆ విషయంలో కాంగ్రెస్ చేసిన చర్యలను షర్మిల ఎలా సమర్ధించి జనం మద్దతుని కాంగ్రెస్ కి చేరువ చేస్తుంది అన్నది చూడాలి. ఏది ఏమైనా కాంగ్రెస్ కి అచ్చమైన అధికార ప్రతినిధిగా ఇపుడు షర్మిల మాట్లాడుతున్నారు అని అంటున్నారు. రేపో మాపో ఆమె చేరిక అనివార్యం అయిన వేళ ఆమెకు ఏ పదవి ఇస్తారు, కాంగ్రెస్ లో ఆమె రాజకీయ ప్రయాణం ఏ విధంగా ఉండబోతోంది అన్నవి ఆసక్తిని పెంచే విషయాలు అని చెప్పకతప్పదు.