గడ్డం నెరుస్తోంది కానీ...రాహుల్ తప్పేంటి ?
రాహుల్ తొలిసారి 2004లో ఎంపీ అయినపుడు 34 ఏళ్ల వారు.
By: Tupaki Desk | 26 Nov 2024 3:38 AM GMTకాంగ్రెస్ యువ నేత అంటూ రాహుల్ గాంధీని అంతా అంటూ వచ్చారు. ఇపుడు అయన వయసు 54 ఏళ్లు నిండాయి. రాహుల్ తొలిసారి 2004లో ఎంపీ అయినపుడు 34 ఏళ్ల వారు. అంటే యువకుడు. ఇపుడు కూడా చూస్తే రాజకీయంగా యువకుడే మరి. ఆ విధంగానే జనాలు ఆయనను చూస్తున్నారు.
ఇక దేశంలో చూస్తే నరేంద్ర మోడీ అధికారంలో గత పదేళ్ళుగా కొనసాగుతున్నారు. ఆయనకు సమ ఉజ్జీగా రాహుల్ ని జనాలు ఎందుకు చూడలేకపోతున్నారు అన్నదే చర్చగా ఉంది. నరేంద్ర మోడీ వయసు డెబ్బై నాలుగు ఏళ్ళు. ఆయన గడ్డం పూర్తిగా నెరిసింది. ఆయన రాజకీయమూ బాగానే పండుతోంది.
ఇక రాహుల్ గాంధీ గడ్డమూ నెరుస్తోంది. కానీ రాజకీయం మాత్రం పండడం లేదు. ఎందువల్ల అంటే రాజకీయంగా రాహుల్ ని మోడీతో పోటీ పెట్టి పోల్చి మరీ జనాలు చూస్తున్నారు అని అంటున్నారు. రాహుల్ ని ఎంపీగానే చూస్తున్నారు. ఎంపీ టూ పీఎం అన్నది ఒక బిగ్ టాస్క్.
రాహుల్ ఆ టాస్క్ ని సాధించాలని చూస్తున్నారు. ఆయన తండ్రి అయిన రాజీవ్ గాంధీ కేవలం ఎంపీగా ఉంటే వెంటనే ప్రధాని అయిపోయారు. అయితే అది ఇందిరాగాంధీ దారుణ హత్య తరువాత వచ్చిన సానుభూతి అంతే కాకుండా అప్పట్లో కాంగ్రెస్ స్ట్రాంగా ఉండడంతో సాధ్యపడింది.
కానీ ఇపుడు ఆ రోజులు లేవు. పైగా కాంగ్రెస్ చాలా రాష్ట్రాలను కోల్పోయింది. ఇక జనాలలో సోషల్ మీడియా పుణ్యమాని చైతన్యం పెరిగింది. రాహుల్ ఎంతగా తన సొంత సత్తా చాటుకుంటున్నా ఇంకా గాంధీ వారసుడిగానే చూస్తున్నారు. ఆయనకు అధికారం అప్పగిస్తే కాంగ్రెస్ వారసత్వానికి ఓటు వేసినట్లుగా భావించే వారూ ఉన్నారు. దాంతోనే చిక్కు వస్తోంది
మరో వైపు చూస్తే రాహుల్ గాంధీకి పాలనానుభవం కూడా లేదు అన్నది మైనస్ గా మారుతొందా అన్న చర్చ సాగుతోంది. నరేంద్ర మోడీ ఈ దేశానికి ప్రధాని అయ్యేనాటికి ఆయన గుజరాత్ ని 13 ఏళ్ల పాటు సీఎం గా పాలించిన అనుభవంతో జనం ముందుకు వచ్చారు. ఆ విధంగా జనాలు ఆయనకు ఓటు వేశారు.
అదే రాహుల్ విషయానికి వస్తే మాత్రం ఆయన జస్ట్ ఎంపీగానే ఉన్నారు అన్నది ఒక భావనగా కనిపిస్తోంది అని అంటున్నారు. అయితే రాహుల్ చేసిన తప్పేంటి అంటే యూపీయే వన్ లో ఆయన తొలిసారి ఎంపీ అయ్యారు. అదే యూపీయే టూ వచ్చేనాటికి రెండు సార్లు ఎంపీగా గెలిచి కీలకంగా అటు పార్టీలో ప్రభుత్వంలో ఉన్నారు
ఆ సమయంలో ఆయన ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో మంత్రిగా చేరి ఉండి ఉంటే ఆయనకు పాలనానుభవం వచ్చేది జనాలలో కూడా ఒక ఇమేజ్ ఏర్పడేది అని అంటున్నారు. ఆ మీదట చివరి రెండేళ్ళూ ఆయన ప్రధానిగా చేయాలని ఆఫర్లు వచ్చినా ఎందుకో నో చెప్పారని కూడా ప్రచారం సాగింది. అలా ప్రధాని గా రాహుల్ అప్పట్లోనే చేసి ఉంటే ఆయనకు అటు కాంగ్రెస్ పార్టీలో కానీ ఇటు జనంలో కానీ వేరే కోణంలో ఇమేజ్ వచ్చేది అని అంటున్నారు.
అయితే రాహుల్ కొన్నాళ్ళు సీరియస్ పాలిటిక్స్ చేయలేదు అని కూడా విమర్శలు ఉన్నాయి. ఆయన గట్టిగా తలచుకున్నది రంగంలోకి దిగింది 2019 ఎన్నికల్లోనే. ఆ తరువాత భారత్ జోడో యాత్రతో ఆయన మరింతగా జనంలోకి వెళ్లారు. దాని ఫలితమే 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు సాధించింది. అయితే ఇంకా రాహుల్ నాయకత్వాన్ని జనాలు పరిశీలిస్తున్నారు. పరీక్ష పెడుతున్నారు.
ఆయన ప్రసంగాలను కూడా నిశితంగా పరిశీలిస్తున్నారు. మోడీ మీద జనాలకు నమ్మకం కూడా ఇంకా గట్టిగా ఉండడం కూడా రాహుల్ గాంధీని దూరంగా పెట్టేందుకు కారణంగా ఉంటున్నాయని అంటున్నారు. ఇక రాహుల్ గాంధీ ఎన్నికల్లో ప్రచారం బాగానే చేస్తున్నారు కానీ ఆయన రాజకీయంగా మోడీ అమిత్ షాలను తట్టుకుని వ్యూహాలను మాత్రం వేయడంలో విఫలం అవుతున్నారు అని అంటున్నారు. ఆయన పార్టీలో కూడా మరింత సీరియస్ గా ఫోకస్ పెట్టి ఎత్తులు పై ఎత్తు వేసే విధంగా వ్యవహరించాల్సి ఉందని అంటున్నారు.
అదే సమయంలో ఎంతసేపూ మోడీని విమర్శిస్తే ఓట్లు రాలేది ఉండదని తమ పార్టీని కూడా బీజేపీ వ్యూహాలకు ధీటుగా మలచి ఢీ కొడితేనే ఫలితం ఉంటుందని గ్రహించాలని అంటున్నారు. ఇక రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేశారు. డజన్ కి పైగా రాష్ట్రాలలో కలియతిరిగారు. కానీ జనం నాడిని పట్టుకోవడంలో మాత్రం ఇంకా వెనకబడి ఉన్నారని అంటున్నారు.
అందుకే ఆయనకు ఫలితాలు తేడా కొట్టేస్తున్నాయి. అందువల్లనే రాహుల్ కి ఇంకా నేర్చుకోమని జనాలు టైం ఇస్తున్నారా అన్న చర్చ సాగుతోంది. మొత్తానికి నెరవాల్సింది గడ్డం కాదని రాజకీయమని రాహుల్ తెలుసుకున్న నాడు ఈ దేశానికి ఆయనే ప్రధాని అవుతారని అంటున్నారు. సో అప్పటిదాకా కాంగ్రెస్ అభిమానులు వెయిట్ అండ్ సీ.