సైబర్ నేరాలకు అడ్డా 'వాట్సప్'..ఈ మాటన్నది కేంద్రం
పదుల సంఖ్యలో దారుణాలు.. అయితే, ఇప్పటివరకు మనకు తెలిసిన ఇలాంటివాటి జాబితాలోకి మరొక దానినీ జత చేసింది కేంద్ర ప్రభుత్వం.
By: Tupaki Desk | 1 Jan 2025 10:30 PM GMTఫేస్ బుక్.. ఇన్ స్టా గ్రామ్.. ఎక్స్ (ట్విటర్).. టెలిగ్రామ్.. సోషల్ మీడియా/మెసేజింగ్ యాప్ లలో మోసాలు సహజం అయిపోయిన రోజులివి. డబ్బులు వస్తాయంటూ చిన్న మెసేజ్ పంపడం.. ఆ ఆశ మాటున ఖాతాలోని డబ్బంతా గుంజేయడం.. గ్రామాల నుంచి నగరాల వరకు రోజూ ఇవే తరహా నేరాలు. పదుల సంఖ్యలో దారుణాలు.. అయితే, ఇప్పటివరకు మనకు తెలిసిన ఇలాంటివాటి జాబితాలోకి మరొక దానినీ జత చేసింది కేంద్ర ప్రభుత్వం.
వాటిలో కాదు.. వాట్సాప్ లోనే..
ఫేస్ బుక్, ఇన్ స్టా, ఎక్స్.. ఇవన్నీ సోషల్ మీడియాలు. సోషల్ మీడియాకు దగ్గరగా ఉన్నప్పటికీ వాట్సప్ ను మెసేజింగ్ యాప్ గానే చెప్పాలి. కాగా, వాట్సప్ లోనే సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నట్లు సంచలన నివేదిక వెలువరించింది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ. రోజుకో కొత్త పంథాలో నేరగాళ్లు రెచ్చిపోతున్న ఈ కాలంలో తాజాగా చేరినవి డిజిటల్ అరెస్టులు. ఇలాంటివి అసలు లేనే లేవని సాక్షాత్తు ప్రధాన మంత్రి మోదీనే చెప్పారు. అయితే, తమ చర్యలకు సైబర్ నేరగాళ్లు ఎక్కువగా వాట్సప్ నే వాడుతున్నారాని కేంద్రం పేర్కొంది.
స్కామర్ల గడ్డ..
వాట్సప్ లో స్కామర్లు ఎక్కువగా మోసాలకు పాల్పడుతున్నారని హోం శాఖ తెలిపింది. దీని తర్వాతి స్థానం టెలిగ్రామ్, ఇన్‌స్టా గ్రామ్ లదని వివరించింది. 2023-24 సైబర్ మోసాల జాబితా నివేదిక ప్రకారం.. 2024 జనవరి-మార్చి మధ్య సైబర్ నేరాలపై 43,797 ఫిర్యాదులు వచ్చాయి. టెలిగ్రామ్ పై 22,680, ఇన్ స్టా పై 19,800 ఫిర్యాదులు నమోదయ్యాయి.
గూగుల్ సర్వీస్ ప్లాట్ ఫామ్ లతో..
సైబర్ మోసగాళ్లు కొంతమందిని లక్ష్యంగా చేసుకుని ప్రకటనలు ఇచ్చేందుకు గూగుల్ అడ్వర్టైజ్ మెంట్ ప్లాట్ ఫామ్ ను వాడుతున్నట్లు కేంద్రం తెలపడం గమనార్హం. ఇలాంటివి కట్టడి చేస్తామని పేర్కొంది. ఆన్ లైన్ రుణ యాప్ ల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు సామాజిక మాధ్యమాలతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపింది.