'వాట్సాప్'.. ఇక ఇష్టానుసారం కుదరదు.. లక్ష్మణ రేఖలు ఇవే!
అందుకే.. లెక్కలేనన్ని గ్రూపులు, చాట్‌లు, సందేశాలు. మన దేశంలో సెకనుకు.. 4 లక్షల సందేశాలు వాట్సాప్‌లో హల్చల్ చేస్తున్నాయని సంస్థ కొన్నాళ్ల కిందట వెల్లడించింది
By: Tupaki Desk | 4 Nov 2024 7:38 AM GMTవాట్సాప్.. తెల్లారి నిద్రమంచంమీంచి లేస్తూ లేస్తూ.. రాత్రి నిద్రకు ఉపక్రమిస్తూ.. కూడా చూడడం అలవాటై పోయిన.. అతి పెద్ద సమాచార విప్లవం! దేని నుంచైనా మనిషి దూరంగా ఉంటాడేమో కానీ.. ఇప్పుడు వాట్సాప్ నుంచి దూరం కాలేని, కాబోని పరిస్థితి అల్లుకుపోయింది. అంతగా జన జీవితాలతో పెనవేసుకు పోయిన.. ఏకైక యాప్ ఇదే కావడం విశేషం. అందుకే.. లెక్కలేనన్ని గ్రూపులు, చాట్‌లు, సందేశాలు. మన దేశంలో సెకనుకు.. 4 లక్షల సందేశాలు వాట్సాప్‌లో హల్చల్ చేస్తున్నాయని సంస్థ కొన్నాళ్ల కిందట వెల్లడించింది.
దీనిని బట్టి వాట్సాప్ వినియోగం ఏ రేంజ్‌లో ఉందో.. మనిషి జీవితంతో ఎలా పెనవేసుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. అయితే.. అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్టుగా.. వాట్సాప్ వినియోగంలోనూ దొంగలు పడుతున్నారు. నకిలీ ఖాతాలు సృష్టించి.. సమాజాన్ని భయాందోళనలకు గురిచేయడమే కాదు.. నకిలీ ఖాతాల ద్వారా.. జనాల సొమ్మును వివిధ మార్గాల్లో గేమింగ్ పేరిట, పొదుపు పేరిట, అధిక ఆదాయాల పేరిట కూడా దోచేస్తున్నారు. దీంతో వాట్సాప్ ఇటీవల కాలంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వాట్సాప్‌ను అనేక మార్లు హెచ్చరించింది. అమెరికాకు చెందిన ఈ సంస్థ కొన్ని నియంత్రణలను పాటించాలని.. లక్ష్మణ రేఖలు గీసుకోవాలని కూడా సూచించింది. దీనికి 2025 మార్చి వరకు గడువు విధించింది. ఈ నేపథ్యంలో వాట్సాప్‌ను విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తున్న వారిని కట్టడి చేసేందుకు ఆ సంస్థ కొన్ని మార్పుల దిశగా అడుగులు వేసింది. ఈ క్రమంలో లక్షల సంఖ్యలో అనుమానిత ఖాతాలను నిషేధించడం గమనార్హం. అంతేకాదు.. యూజర్లకు కూడా కొన్ని లక్ష్మణ రేఖలు గీసింది. వీటిని దాటొద్దని చెబుతోంది.
ఇవీ.. వివరాలు.. !
+ ఒక్క సెప్టెంబరు మాసంలోనే అనుమానిత 85 లక్షలకుపైగా వాట్సాప్ ఖాతాను నిషేధించారు.
+ ఇలా చేయడానికి కారణం.. సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేసే సందేశాలు పంపడం, వివాదాలకు నెలవుగా వాట్సాప్‌ను మార్చడం, అవాంఛనీయ(పోర్న్) కంటెంట్, విధానపరమైన నిబంధనలను ఉల్లంఘించడమేనని పేర్కొంది.
+ ఇలా నిషేధం విధించిన ఖాతాల్లో 16,58,000 ఖాతాలకు సంబంధించి ఎవరూ స్పందించలేదు. అంటే.. ఈ ఖాతాలన్నీ.. నకిలీవే. సమాజాన్ని ప్రజలను దోచుకునేవేనని అర్థమైంది.
+ ఇక, దేశంలో నిత్యం లక్షల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని వాట్సాప్ పేర్కొంది. తమ వ్యక్తిగత గోప్యత, భద్రతకు సంబంధించి యూజర్లు ప్రశ్నిస్తున్నారు. దీంతో వీటికి ప్రాధాన్యం ఇచ్చే దిశగా వాట్సాప్ అడుగులు వేస్తోంది.
+ మరోవైపు.. యూజర్లే తమ వాట్సాప్ ఖాతాను భద్ర పరుచుకునేలా ఫీచర్లను కూడా అందుబాటులోకి తీసుకురానుంది. ఖాతాలను బ్లాక్ చేయడంతోపాటు.. కంపెనీకి నేరుగా ఫిర్యాదు చేసే విధానం కూడా త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది.