Begin typing your search above and press return to search.

ఇలా అయితే.. భారత్‌ లో సేవలు నిలిపేస్తాం: వాట్సాప్‌!

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఐటీ నిబంధనలు భావప్రకటన స్వేచ్ఛను, వినియోగదారుల గోప్యత హక్కును అడ్డుకునేలా ఉన్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు.

By:  Tupaki Desk   |   26 April 2024 9:47 AM GMT
ఇలా అయితే.. భారత్‌ లో సేవలు నిలిపేస్తాం: వాట్సాప్‌!
X

చాలా సులువుగా సందేశాలు, ఫొటోలు, వీడియోలు, ఆడియో క్లిప్పింగులు పంపుకోవడానికి అందుబాటులో ఉన్న మాధ్యమం.. వాట్సాప్‌. మనదేశంలో వాట్సాప్‌ ను వినియోగిస్తున్నవారు 815 మిలియన్ల మంది ఉన్నారు.

ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఐటీ నిబంధనలు–2021లోని 4(2) సెక్షన్‌ చట్టబద్ధతను సవాలు చేస్తూ వాట్సప్, ఫేస్‌ బుక్‌ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పిటిషన్‌ విచారణకొచ్చింది.

ఈ సందర్భంగా వాట్సాప్‌ తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఐటీ నిబంధనలు భావప్రకటన స్వేచ్ఛను, వినియోగదారుల గోప్యత హక్కును అడ్డుకునేలా ఉన్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు. ముఖ్యంగా వినియోగదారుల మెసేజుల భద్రత కోసం తెచ్చిన ఎన్‌క్రిప్షన్‌ విధానాన్ని తీసేయాలని కేంద్రం కోరితే తాము భారత్‌ లో సేవలు నిలిపేయడానికి కూడా వెనుకాడబోమని వాట్సాప్‌ బాంబుపేల్చింది. ఈ మేరకు ఆ సంస్థ తరఫు న్యాయవాదులు ఢిల్లీ హైకోర్టుకు నివేదించారు. ఫేస్‌ బుక్‌ తరఫు న్యాయవాదులు కూడా ఇదే అంశాన్ని కోర్టుకు తెలిపారు.

ముఖ్యంగా మేసేజులు పంపినవారి ఆచూకీని వెల్లడించే నిబంధనలను సవరించాలని ఫేస్‌ బుక్, వాట్సాప్‌ కోరాయి. సందేశాలు పంపినవారిని ట్రేస్‌ చేసేలా కేంద్ర ప్రభుత్వం కొత్త ఐటీ నిబంధనలను తెచ్చింది. ఈ మేరకు వాట్సాప్, ఫేస్‌ బుక్‌ తమ ఆల్గారిథమ్‌ ల్లో మార్పులు చేయాల్సి ఉంటుంది. అయితే ఇలా చేస్తే వినియోగదారుల గోప్యత హక్కుకు భంగం వాటిల్లుతుందని ఈ సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇదే అంశంపైన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాయి.

ఢిల్లీ హైకోర్టులో వాదనల సందర్భంగా వాట్సాప్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ వినియోగదారుల గోప్యత హక్కులను తాము సంరక్షిస్తున్నాం కాబట్టే వారు వాట్సాప్‌ వినియోగిస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తెచ్చిన ఐటీ నిబంధన వల్ల ఆ గోప్యత హక్కు ఉండదని.. దీంతో వినియోగదారులు సైతం వాట్సాప్‌ ను వినియోగించడానికి ముందుకు రారన్నారు.

కేంద్రం తెచ్చిన నిబంధనలతో వాట్సాప్‌ లో సందేశాల భద్రత కోసం తాము అవలంబిస్తున్న ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ విధానాన్ని ఎత్తేయాల్సి ఉంటుందన్నారు. ఇదే జరిగితే తాము భారత్‌ లో సేవలు నిలిపేస్తామని వాట్సాప్‌ తెలిపింది.

కేంద్రం తెచ్చిన ఐటీ నిబంధనల్లోని 4(2) సెక్షన్‌ రూల్‌ ను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి కొట్టేయాలని వాట్సాప్, ఫేస్‌ బుక్‌ కోరాయి. సామాజిక మాధ్యమ సంస్థలతో ఎలాంటి సంప్రదింపులు లేకుండానే కేంద్రం తెచ్చిందని ఆరోపించాయి. దీని వల్ల మేం కోట్లాది మెసేజ్‌ లను ఏళ్ల తరబడి భద్రపర్చాల్సి ఉంటుందని వాట్సాప్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇవ్వకుండా విచారణను వాయిదా వేసింది.