Begin typing your search above and press return to search.

కోల్ కతా డాక్టర్ కేసు... లై డిటెక్టర్ టెస్ట్ లో తేలిందేమిటి?

ఈ సమయంలో నిందితుడు సంజయ్ రాయ్ కి లై డిటెక్టర్ పరీక్ష చేపట్టారు.

By:  Tupaki Desk   |   26 Aug 2024 8:32 AM GMT
కోల్  కతా డాక్టర్  కేసు... లై డిటెక్టర్  టెస్ట్  లో తేలిందేమిటి?
X

కోల్ కతా జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా అత్యంత సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి జరిగిన కొన్ని ప్రచారాలతో దేశం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. హాస్పటల్ లో డ్యూటీలో ఉన్న డాక్టర్ కు భద్రత లేని అంశం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. ఈ సమయంలో నిందితుడు సంజయ్ రాయ్ కి లై డిటెక్టర్ పరీక్ష చేపట్టారు.

అవును... దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన కోల్ కతా జ్యూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనలో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ కి ఇటీవల పాలీగ్రాఫ్ పరీక్షలు నిర్వహించారు. జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా అతడు ప్రస్తుతం ఉంటున్న కోల్ కతా లోని ప్రెసిడెన్సీ జైల్లో ఈ లై డిటెక్టర్ పరీక్ష చేపట్టారు. అయితే... ఈ పరీక్షలో నిందితుడు ఏమి చెప్పాడనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

అయితే ఈ పరీక్షలో నిందితుడు ఎలాంటి సమాధానాలు చెప్పాడనేది మాత్రం అధికారికంగా బయటకు రాలేదు! ఈ నేపథ్యంలో... విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ కొన్ని నేషనల్ మీడియా వర్గాలు పలు కథనాలను వెల్లడిస్తునాయి. ఇందులో భాగంగా... ఈ పరీక్ష సమయంలో నిందితుడు సంజయ్ రాయ్ అనాలోచితంగా, ఆత్రుతగా ఉన్నట్లు సదరు కథనాలు చెబుతున్నాయి.

ఈ సమయంలో అధికారులు అడిగిన ప్రశ్నలకు నిందితుడు అవాస్తవాలు, సరిపోలని సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోందని అంటున్నారు. ఈ సమయంలో దర్యాప్తు బృందం ఆధారాలు చూపించినప్పుడు.. ఆ సమయంలో తను అక్కడ లేనని.. తాను సెమినార్ హాల్ లోకి వెళ్లేసరికే వైద్యురాలు అప్పటికే చనిపోయి ఉందని.. అది చూసి భయంతో తాను అక్కడ నుంచి పారిపోయాయని సంజయ్ చెప్పినట్లు కథనాలు వెలువడుతున్నాయి.

మరోవైపు నిందితుడిగి ఈ పాలీగ్రాఫ్ పరీక్ష నిర్వహించే సమయంలో అతడి తరుపున డిఫెన్స్ లాయర్ లేరనే విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంపై స్పందించిన న్యాయవాది... పరీక్ష ఎక్కడ, ఎప్పుడు నిర్వహిస్తున్నారనే విషయాన్ని అధికారులు తమకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని, ఇది కచ్చితంగా మానవహక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని ఆరోపించారు.

కాగా... పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతా లోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ఈ నెల 9న దారుణ ఘటన జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి అఘాయిత్యానికి పాల్పడింది తనేనంటూ అంతకముందు నిందితుడు నేరం అంగీకరించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో... ఇటీవల అతడి మానసిక తీరును విశ్లేషించింది ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ. ఈ క్రమంలో తాజాగా లై డిటెక్టర్ టెస్ట్ కూడా చేశారని తెలుస్తోంది!