Begin typing your search above and press return to search.

కేసీఆర్ వస్తారు.... కేసీఆర్ వస్తారు.... ఎప్పుడు..?

ఒక్కడిగా బయలుదేరి.. లక్షలాది ప్రజల మద్దతు చురుగొన్నారు.

By:  Tupaki Desk   |   17 Oct 2024 4:30 PM GMT
కేసీఆర్ వస్తారు.... కేసీఆర్ వస్తారు.... ఎప్పుడు..?
X

కేసీఆర్ అంటే బక్కపలుచని వ్యక్తి. ఆ బక్కపలుచని వ్యక్తితో ఏం అవుతుంది లే అని అందరూ అనుకున్నారు. అన్ని పార్టీలు.. అన్ని పార్టీల సీనియర్ లీడర్లు లైట్ తీసుకున్నారు. ఆ బక్కపలుచని వ్యక్తి కూడా ఏం సాధించవచ్చనేది చేసి నిరూపించారు కేసీఆర్. పులినోట్లో తలికాయ పెట్టి తెలంగాణ కోసం కొట్లాడారు. ఒక్కడిగా బయలుదేరి.. లక్షలాది ప్రజల మద్దతు చురుగొన్నారు. చివరకు ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారు. రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా నిలిచారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఉద్యమం వేళ కేసీఆర్ అంటే ఒక బ్రాండ్. ఆయన యాస, భాషకు అందరూ ఫిదా అయ్యేవాళ్లు. కేసీఆర్ మీడియా సమావేశం పెడుతున్నారంటే ప్రతీ మీడియా మిస్ అవ్వకుండా అక్కడికి చేరుకునేది. కేసీఆర్ మాట్లాడుతున్నారంటే ప్రతి ఒక్కరూ టీవీల ముందు కూర్చునేవారు. ఈ అభిమానం కేవలం తెలంగాణ ప్రజల్లోనే కాదు.. దేశవ్యాప్తంగానూ కనిపించింది. ఇంకా చెప్పాలంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ వారిలోనూ కనిపించింది. కేసీఆర్ స్పీచ్ కోసం ఒక్కొక్కరు అంతలా ఎదురుచూసే వాళ్లు. ఆయన విసిరే పంచ్‌లు.. చలోక్తులు.. ప్రత్యర్థులకు వేసే సవాళ్లు.. ఒక్కమాటలో చెప్పాలంటే తెలంగాణ యాస, భాషకు ఆయన ప్రతిరూపం అని చెప్పొచ్చు. స్పీచ్ మధ్యలో చెప్పే సామెతలు.. కథలను ఆసక్తిగా వినేవారు. అప్పుడప్పుడు కామెడీ.. ఇంకా మధ్యలో ఆవేశం.. ఉద్వేగం.. ఉద్యమం మాటలు ఎంతగానో ఆకట్టుకునేవి. తెలంగాణ సాధన ఆవశ్యకతను తెలుపుతూ ఆయన ఇచ్చిన స్పీచులతోనే ఉద్యమం ఆ స్థాయిలో ఉవ్వెత్తున ఎగసిందని అందరికీ తెలిసిందే. అసలు ఆయన మాట్లాడుతున్నారంటూ ప్రతీ చానళ్లలోనూ అదే లైవ్ టెలికాస్ట్ అయ్యేది. ప్రజలను ఆకట్టుకోవడంలో ఆయనకు తెలిసినంతగా ఏ నేతలకు తెలియదనేది అందరి అభిప్రాయం కూడా.

అటు రాష్ట్రం ఏర్పాటయ్యాక కూడా.. ప్రత్యర్థులకు తన మాటల ద్వారానే గట్టి సమాధానాలు ఇస్తూ వచ్చారు. ప్రతిపక్ష పార్టీ నుంచి ఎలాంటి ఆరోపణలు వచ్చినా తనదైన శైలిలో మాట్లాడి వాటికి చెక్ పెట్టేవారు. ఆయన విమర్శలతో ఆయా పార్టీలకు దిమ్మతిరిగే పరిస్థితులు ఉండేవి. ఒక్కసారి ఆయన కదనరంగంలోకి వచ్చారంటే అపోజిషన్ నేతలు విమర్శలు చేయాలంటే కాస్త భయపడేవారు. కేసీఆర్ వ్యాఖ్యలకు బదులివ్వలేక సతమతం అయ్యేవారనేది అందరికీ తెలిసిందే. ఎన్నికల సమయంలో బహిరంగ సభల్లో మాట్లాడితే ఆయా చానళ్ల రేటింగ్ కూడా ఎక్కడికో వెళ్లిపోయేవి. ఎందుకంటే ఆయన స్పీచ్ వినేందుకు ప్రజలు కూడా ఫోన్లు, టీవీలను పట్టుకునే ఉండేవారు.

అంతటి వాక్చాతూర్యం ఉన్న కేసీఆర్ గొంతు గత పది నెలలుగా మూగబోయింది. రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా బాధ్యతల్లో కొనసాగిన ఆయనకు.. గత అసెంబ్లీ ఎన్నికలు ఝలక్ ఇచ్చారు. దాంతో అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఇక అప్పటి నుంచి ఆయన నుంచి ఓ ప్రెస్‌మీట్ కానీ.. ఓ స్టేట్‌మెంట్ కానీ వినిపించలేదు. పది నెలలుగా ఆయన ఫామ్‌హౌజ్ జీవితాన్నే గడుపుతున్నారు. పది నెలలుగా ఆయన గొంతు ప్రజలు ఇంతవరకు వినలేదు. దాంతో అసలు కేసీఆర్‌కు ఏమైంది అని అటు ప్రజల్లోనూ.. ఇటు పార్టీ కేడర్‌లోనూ ఆందోళన కనిపించింది. పది నెలలుగా ప్రభుత్వ వైఫల్యాలు వెలుగుచూస్తున్నా ఇంతవరకు ఆయన వాటిపై నిలదీసింది లేదు. అలాగే.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చవిచూసినా పెద్దగా మాట్లాడలేదు. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో అయితే ఊహించని ఫలితాలు వచ్చినా ఎక్కడా కనీసం రివ్యూలు చేయలేదు. కనీసం ఆయన ఒక్కసారిగా కూడా మీడియా ముందుకు వచ్చింది లేదు. దీంతో మీడియాలోనూ ఆయనపై పెద్దగా కథనాలు రావడంలేదు. మీడియాతో ఇంటరాక్షన్ కూడా లేకుండా పోయింది. పది నెలలుగా బయటకు రాకపోవడంతో చివరకు జనాలు కూడా ఆయన్ను మరిచిపోయే పరిస్థితులు వచ్చాయని క్యాడర్ చెబుతున్నది.

కట్ చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి పది నెలలు గడిచింది. ఈ క్రమంలో ప్రభుత్వం చేస్తున్న పనులపై ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్, మాజీమంత్రి హరీశ్ రావు మాత్రమే విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తున్నారు. నిత్యం ట్విట్టర్‌లోనూ ఏదో ఒక పోస్టింగ్ పెడుతూనే ఉన్నారు. ఏదో ఒక రూపంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నారు. కానీ.. అవేవీ ప్రజలను పెద్దగా ఆకట్టుకోవడం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఎన్ని విధాల నిరసనలు తెలిపినా.. ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా.. ఎన్ని ప్రకటనలు ఇచ్చినా.. కనీసం ఆ పార్టీ కార్యకర్తల్లోనూ భరోసా నింపలేకపోతున్నాయని పార్టీలోనే గుసగుసలు నడుస్తున్నాయి. కేసీఆర్ లాంటి మాస్ ఫీలింగ్ ప్రజల్లో తీసుకురావడంలో ఫెయిల్ అవుతున్నారన్న అపవాదు ఉంది. మరోవైపు.. కేటీఆర్, హరీశ్ వ్యాఖ్యలకు కూడా రేవంత్ రెడ్డి ఎక్కడికక్కడ రివర్స్ అటాకింగ్‌ చేస్తున్నారు. వారి మాటలకు దీటుగా బదులిస్తూ వస్తున్నారు. చివరగా ప్రజల్లో బీఆర్ఎస్‌పై వ్యతిరేకతను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. దీంతో పార్టీ శ్రేణుల్లో తీవ్ర నిరాశ కనిపిస్తోంది.

అయితే.. పది నెలలుగా ఫామ్‌హౌజ్‌లోనే ఉండిపోయిన కేసీఆర్ ప్రజల్లోకి అప్పుడు వస్తారు.. ఇప్పుడు వస్తారు అంటూ లీకులు ఇస్తున్నారు తప్పితే ఇంతవరకు ఆయన వచ్చింది లేదు. కానీ ప్రజలు మాత్రం ఆయన రాకకోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. ఆయన స్పీచులు కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. మరోవైపు రోజురోజుకూ పార్టీ పరిస్థితి ఇబ్బందికరంగా మారుతున్నదని.. ఇప్పటికైనా రావాలని ఆయన అభిమానులు కోరుతున్నారు. పార్టీకి మునుపటి ఊపు రావాలంటే తప్పనిసరిగా కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి రావాలని ముక్తకంఠంతో కోరుతున్నారు. కేసీఆర్ వస్తేనే పూర్వవైభవం చూస్తామని అంటున్నారు. మరోవైపు.. రేవంత్‌ను తట్టుకోవాలంటే కూడా అది కేసీఆర్ వల్లే అవుతుందని అంటున్నారు. కేసీఆర్ వస్తేనే రేవంత్‌ను సైలెంట్ చేయొచ్చని అభిప్రాయమూ వ్యక్తం అవుతోంది. రేవంత్ రెడ్డిని ఎదుర్కోవాలంటే కేసీఆరే ఉండాలి.. కేసీఆర్‌ను ఎదుర్కోవాలంటే రేవంత్ రెడ్డి ఉండాలని అంటున్నారు. అందుకే కేసీఆర్ బయటకు రావాలని క్యాడర్ మొత్తం కోరుకుంటోంది. లేదంటే పార్టీ ఉనికి కష్టం అయ్యే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. తాజాగా కేసీఆర్ ప్రజల్లోకి రావడంపై మరో ప్రచారం మొదలైంది. డిసెంబర్‌తో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి సంవత్సరం పూర్తవుతుంది. దాంతో ఆ సంవత్సరం కాలంలో కాంగ్రెస్ చేసిన పనులు.. చేసిన అప్పులు.. చేపట్టిన ప్రయోజనాలపై స్టడీ చేసి నిలదీసేందుకు వస్తున్నారని ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ రాకకు డిసెంబర్ ముహూర్తం ఖరారు అయినట్లుగా బీఆర్ఎస్ వర్గాలు సైతం వెల్లడిస్తున్నాయి. మరోవైపు.. డిసెంబర్ లేదంటే జనవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండడంతో ఇదే సరైన సమయం అని కేసీఆర్ కూడా నిర్ణయానికి వచ్చారని చెబుతున్నారు. రైతుల సమస్యలపై, హైడ్రా అంశంతోప్రతి అంశంపై ఆయన మాట్లాడుతారన్న టాక్ నడుస్తోంది. కేవలం ప్రెస్‌మీట్లకే పరిమితం కాకుండా ప్రత్యక్ష ఆందోళనల్లోనూ పాల్గొంటారని తెలుస్తున్నది. అందులో భాగంగానే జిల్లా యాత్రలకు కూడా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేలోపే పార్టీ బలోపేతం పైనా ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు సమాచారం. జిల్లా, మండల, గ్రామస్థాయిల్లోనూ కొత్త కమిటీలు వేసి పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తారని తెలుస్తోంది.