Begin typing your search above and press return to search.

జగన్ ఉంటే రాజధాని ఉండదు...చంద్రబాబు వస్తే రాష్ట్ర అవతరణ ఉండదా ?

అప్పట్లో ఉమ్మడి మద్రాస్ నుంచి 11 జిల్లాల ఆంధ్ర రాష్ట్ర విడిపోయింది 1953 అక్టోబర్ 1వ తేదీన. దానినే ఏపీ ఫార్మేషన్ డేగా చూస్తారు

By:  Tupaki Desk   |   1 Nov 2024 1:30 PM GMT
జగన్ ఉంటే రాజధాని ఉండదు...చంద్రబాబు వస్తే రాష్ట్ర అవతరణ ఉండదా ?
X

ఏపీకి అదేమి కర్మ పట్టిందో తెలియదు కానీ మొదటి నుంచి అన్నీ ఇబ్బందులే. ఉమ్మడి మద్రాస్ స్టేట్ నుంచి విడిపోయినప్పటి నుంచి ప్రాంతీయ వాదంతో పాటు సామాజిక వర్గాల మధ్య ఆధిపత్య పోరుతో రాజకీయం మిళాయించి దానిని రాష్ట్ర భవిష్యత్తు ని ఫణంగా పెట్టే కార్యక్రమమే సాగుతూ వస్తోంది.

అప్పట్లో ఉమ్మడి మద్రాస్ నుంచి 11 జిల్లాల ఆంధ్ర రాష్ట్ర విడిపోయింది 1953 అక్టోబర్ 1వ తేదీన. దానినే ఏపీ ఫార్మేషన్ డేగా చూస్తారు. ఏపీ పుట్టిన రోజు అన్న మాట. దేశంలో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం కూడా ఏపీయే. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఏపీని నాటి హైదరాబాద్ స్టేట్ లో విలీనం చేశారు. అది 1956 నవంబర్ ఒకటో తేదీన జరిగింది.

దాంతో ఆ రోజుని ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం అన్నారు. ఆ విధంగా చూస్తే గత 58 ఏళ్ల పాటు ఉమ్మడి ఏపీ ఈ డేట్ ని గుర్తుంచుకుని జరుపుకుంది. 2014లో జూన్ 2న అపాయింట్ డే అని చెబుతూ తెలంగాణా రాష్ట్రాన్ని విడదీసారు. అలా తెలంగాణాకు అది ఫార్మేషన్ డే అయింది.

ఏపీకి ఫార్మేషన్ డే ఏది అంటే 58 ఏళ్ల పాటు ఆనవాయితీగా వచ్చిన నవంబర్ 1నే జరుపుకోవాలి. లేదా అక్టోబర్ 1న అయినా జరుపుకోవాలి. కానీ 2014 నుంచి 2019 దాకా అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ఈ రెండు డేట్లను పూర్తిగా పక్కన పెట్టింది.

జూన్ 2 నుంచి జూన్ 9 దాకా నవ నిర్మాణ దినోత్సవం అని జరిపింది. విభజన తేదీనే ఏపీకి ఉత్సవ తేదీగా అలా ఖరారు చేసింది. దాని మీద ఎన్నో విమర్శలు కూడా వచ్చాయి. వైసీపీ అధికారంలోకి వస్తూనే నవంబర్ 1ని అవతరణ దినోత్సవంగా జరుపుతూ వచ్చింది.

అయితే మళ్లీ ఇపుడు టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నవంబర్ 1 ఫార్మేషన్ డే ఎగిరిపోయింది. అంటే జూన్ 2నే నవ నిర్మాణ దినోత్సవం జరుపుతారు అన్న మాట. విభజనతో తెలంగాణా రాష్ట్రం ఏర్పడింది. విభజన వద్దు అనుకున్న ఏపీకి జూన్ 2 అన్నది ఒక విధంగా బాధాకరమైన రోజుగా ఉంటుంది.

ఆ రోజును గుర్తు పెట్టుకుని నవ నిర్మాణ దినోత్సవం అనడం సబబు కాదని కూడా వాదన ఉంది. కానీ అక్టోబర్ 1, నవంబర్ 1 ని తప్పించిన ఏపీ కూటమి ప్రభుత్వం అదే చేసేలా ఉందని అంటున్నారు. దాంతో వైసీపీ నేతలు మండిపడుతున్నారు. మాజీ మంత్రి ఆర్కే రోజా అయితే చంద్రబాబు సీఎం కావడం వల్లనే ఏపీకి అవతరణ దినోత్సవం లేకుండా పోయిందని విమర్శించారు.

వైసీపీ పాలనలో నవంబర్ 1న అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించామని ఆమె గుర్తు చేశారు. పొట్టి శ్రీరాములు త్యాగాన్ని అవహేళన చేస్తున్నారు అని ఆమె మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమేనా అని ఆమె ప్రశ్నించారు.భావి తరాలకు ఏమి చేస్తారు అని ఆమె నిలదీశారు.

ఆరు కోట్ల ఆంధ్రులను అవమానించినందుకు చంద్రబాబు పవన్ క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేసారు. వైసీపీ నేత మల్లాది విష్ణు కూడా అవతరణ దినోత్సవాన్ని చేయకపోవడాన్ని తప్పు పట్టారు. కనీసం పొట్టి శ్రీరాములను కూడా కూటమి పెద్దలు ఈ సమయంలో తలవకపోవడమేంటి అన్న ప్రశ్నలు కూడా వేస్తున్నారు.

దీనిని చూసిన వారు అంటున్న మాటేంటి అంటే జగన్ ఉంటే రాజధాని ఉండదు, అదే చంద్రబాబు సీఎం అయితే రాష్ట్రం పుట్టిన రోజే ఉండదని. ఏ వ్యక్తికి అయినా సంస్థకు అయినా వ్యవస్థకు అయినా ఒక పుట్టిన రోజు ఉంటుంది. దానిని గుర్తు చేసుకుంటారు. ప్రతీ ఏటా సాధించిన ప్రగతిని వల్లె వేస్తారు. అలాంటిది ఏపీ ఫార్మేషన్ డే వెనక కూడా రాజకీయమేనా అన్న చర్చ వస్తోంది. పైగా విభజన డేట్ ని ముందు పెట్టి ఏపీకి ఉన్న అసలు డేట్ ని పక్కకు జరపడం అంటే ఏపీ చరిత్ర విషయంలో భావి తరాలకు ఏమి చెబుతారు అన్న ప్రశ్నలు వస్తున్నాయి.

ఏపీ ఆవిర్భవించింది తెలంగాణా నుంచి కాదని కూటమి పెద్దలు గుర్తు చేసుకోవాలని అంటున్నారు. ఉమ్మడి ఏపీ నుంచి తెలంగాణా విడిపోయింది. వారు పోరాడి తెలంగాణా సాధించుకున్నారు కాబట్టి జూన్ 2 వారికి అవతరణ దినోత్సవం అని అంటున్నారు. మద్రాస్ నుంచి ఏపీ స్టేట్ ని కోరుకుని తన ప్రాణాలను బలి పెట్టిన అమర జీవి పొట్టి శ్రీరాములు బలిదానానికి గుర్తుగా అక్టోబర్ 1 కానీ నవంబర్ 1 కానీ ఏపీ ఫార్మేషన్ డే గా జరపాలని అంటున్నారు. ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ అయితే ఉంది.