జగన్ జిల్లా టూర్లకు ఆదిలోనే బ్రేకులు ?
తాను వచ్చి క్యాడర్ కి ధైర్యం చెబుతాను భరోసా కల్పిస్తామని వారితోనే ఉంటానని ఆయన ప్రకటించారు.
By: Tupaki Desk | 5 Jan 2025 4:20 AM GMTవైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జిల్లాల యాత్రకు శ్రీకారం చుడతానని దాదాపు నెల రోజుల క్రితం పార్టీ సమావేశాలలో చెప్పడం జరిగింది. తాను వచ్చి క్యాడర్ కి ధైర్యం చెబుతాను భరోసా కల్పిస్తామని వారితోనే ఉంటానని ఆయన ప్రకటించారు.
అంతే కాదు ప్రతీ బుధ గురువారం రెండు రోజుల పాటు జిల్లా కేంద్రంలో ఉండి క్యాడర్ ని పూర్తి స్థాయిలో కలుస్తాను అని వారి నుండి అభిప్రాయాలు సేకరించడం ద్వారా పార్టీని గ్రౌండ్ లెవెల్ నుంచి పునరుత్తేజం కల్పించేలా చూస్తాను అని జగన్ ప్రకటించారు.
దీంతో జగన్ జిల్లాల టూర్ మీద వైసీపీలో కొంత ఉత్సాహం కనిపించింది. మొదట సంక్రాంతి పండుగ తరువాత అన్నారు, ఆ తరువాత జనవరి నెలాఖరు అన్నారు. అయితే ఇపుడు చూస్తే ఆదిలోనే బ్రేకులు పడేట్టుగా ఉన్నాయని అంటున్నారు.
జగన్ ఈ నెల 11 నుంచి రెండు వారాల పాటు లండన్ ట్రిప్ పెట్టుకున్నారు. ఈ మేరకు ఆయన సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి విదితమే. తన విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వాలని ఆయన కోరారు. దాని మీద విచారణ ఈ నెల 8కి వాయిదా పడింది. ఆ రోజున కోర్టు ఇచ్చే తీర్పు బట్టి జగన్ పర్యటన ఉండొచ్చు.
అయితే జగన్ కి అనుమతి లభిస్తే ఆయన ఈ నెలాఖరు వరకూ విదేశాలలోనే ఉండే చాన్స్ ఉంది. ఆయన నెల చివరికి వచ్చినా అప్పటి నుంచి జిల్లా పర్యటనకు ఏర్పాట్లు చేయడం అంటే కుదిరేది కాదు, కాబట్టి అన్నీ చూసుకుని మాఘమాసం లో మంచి ముహూర్తాన జగన్ జిల్లాల పర్యటనలకు సిద్ధపడతారు అని అంటున్నారు
అంటే ఫిబ్రవరి రెండో వారంలో కానీ మూడవ వారంలో కానీ జగన్ జిల్లాల టూర్ ఉండే చాన్స్ ఉందని అంటున్నారు. అయితే వైసీపీకి మొత్తం దిక్కు అయిన జగన్ జిల్లాల టూర్ పేరుతో జనంలోకి వస్తేనే పార్టీ యాక్టివ్ అవుతుందని నాయకులు అంటున్నారు. గతంలో విపక్షంలో ఉన్నపుడు జగన్ పెద్దగా ఆలస్యం చేయకుండానే ప్రజలలోకి వచ్చారు.
అయితే ఈసారి అయిదేళ్ల పాటు అధికారంలో ఉన్న పార్టీగా వైసీపీ జనంలోకి వెళ్తోంది. కాబట్టి తమ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వ పాలంకు మధ్య జనాలు తేడా తెలుసుకోవడానికి కొంత వ్యవధి ఇవ్వాలన్న ఆలోచనతొనే జగన్ ఈ విధంగా ఆరేడు నెలల సమయం తీసుకున్నారు అని అంటున్నారు. మొత్తం మీద జగన్ ఎంత వేగంగా జనంలోకి వస్తే అంత పార్టీకి మేలు అన్న మాట ఉంది. అయితే జనవరి నెలలో జగన్ విదేశీ పర్యటన ఉండడంతో ఫిబ్రవరికి ఆయన టూర్లు వాయిదా పడవచ్చు అన్నది వినిపిస్తున్న మాట. చూడాలి మరి ఏమి జరుగుతుందో.