Begin typing your search above and press return to search.

చర్లపల్లి టెర్మినల్ రెఢీ.. ప్రారంభం ఎప్పుడు?

ఈ టెర్మినల్ అందుబాటులోకి వస్తే.. నగర ట్రాఫిక్ భారం తగ్గే వీలుందన్న మాట వినిపిస్తోంది.

By:  Tupaki Desk   |   21 Oct 2024 4:39 AM GMT
చర్లపల్లి టెర్మినల్ రెఢీ.. ప్రారంభం ఎప్పుడు?
X

హైదరాబాద్ మహానగర శివారు చర్లపల్లిలో నాలుగో రైల్వే టెర్మినల్ షురూ కానుంది. దీనికి సంబంధించిన పనులు 98 శాతం పూర్తయ్యాయి. కొన్నిచిన్న పనులు మినహా మిగిలినవన్నీ దాదాపు పూర్తైనట్లే. ఈ టెర్మినల్ అందుబాటులోకి వస్తే.. నగర ట్రాఫిక్ భారం తగ్గే వీలుందన్న మాట వినిపిస్తోంది. రూ.430 కోట్ల ఖర్చుతో అత్యాధునిక సాంకేతికతతో ఈ టెర్మినల్ ను సిద్ధం చేశారు.

నిజానికి ఈ టెర్మినల్ ప్రారంభం కోసం కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్నదే. అయితే.. ఈ టెర్మినల్ తో హైదరాబాద్ మహానగర ప్రజలకు మేలు జరుగుతుందా? అన్నది అసలు ప్రశ్న. ఎందుకంటే.. నగరం పెద్ద ఎత్తున విస్తరించటం తెలిసిందే. గడిచిన పదేళ్లలో నగర స్వరూపం పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు నగర శివారు అన్న ప్రాంతాలు సైతం ఇప్పుడు విస్తరించాయి.ఒకప్పుడు ఔటర్ రింగు రోడ్డుకు సమీపంలో ఉండటం అంటే.. చాలా దూరంగా ఉన్నట్లుగా భావించేవారు. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డును దాటేసిన పరిస్థితి. ఔటర్ అవతల కూడా పెద్ద ఎత్తున నివాస ప్రాంతాలు డెవలప్ అయ్యాయి.

ఇలాంటి పరిస్థితుల్లో చర్లపల్లిలో ట్రైన్ దిగి.. తమ ఇళ్లకు చేరుకోవటం.. అదే సమయంలో ఇళ్ల నుంచి చర్లపల్లిని చేరుకోవటం అంత సులువైన పని కాదన్న మాట వినిపిస్తోంది. ఉదాహరణకు నల్లగండ్లకు చెందిన ఒక కుటుంబం చర్లపల్లి వెళ్లి ట్రైన ఎక్కాలంటే అయ్యే ఖర్చు టికెట్ ధరకు మించి ఉంటుంది. అలా అని ప్రజారవాణా బస్సు.. ఎంఎంటీఎస్ లాంటి వాటిల్లో ప్రయాణించి చేరుకోవటం అందరికి సాధ్యం కాకపోవచ్చు. ఉదాహరణకు బాచుపల్లికి చెందిన ఒక కుటుంబం చర్లపల్లికి వెళ్లి ట్రైన్ ఎక్కాలన్నా.. అక్కడి నుంచి ట్రైన్ దిగి ఇంటికి చేరుకోవాలన్నా టైంతో పాటు.. ఖర్చు కూడా ఎక్కువ కావటం ఖాయం. అన్నింటికి మించి దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులకు లగేజ్ ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు చర్ల పల్లి నుంచి బాచుపల్లి.. చర్లపల్లి నుంచి నల్లగండ్ల.. చర్లపల్లి నుంచి గచ్చిబౌలి.. ఇలా చెప్పుకుంటూ పోతే కొత్తగా విస్తరించిన నగరంలోని పలు ప్రాంతాలకు కనెక్టివిటీ మాటేమిటి? అన్నది ప్రశ్న.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. కొన్ని రైళ్లు రాత్రి వేళ ఆలస్యంగా చేరుకునేవి.. రాత్రి పదిన్నర తర్వాత చేరుకునే వాటితో మరింత ఇబ్బందికర పరిస్థితి. అదే టైంలో తెల్లవారుజామున ఐదారుగంటల వేళలో చర్లపల్లికి చేరుకోవాలంటే మామూలు విషయం కాదు. ఇలాంటి సమస్యలకు సరైన పరిష్కారం చూపకుండా చర్లపల్లిని నాలుగో టెర్మినల్ గా మార్చటం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. ఇప్పటివరకు చర్లపల్లి నుంచి ప్రజారవాణాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమీ లేదు. గత ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకొని ఫోకస్ చేసి ఉంటే.. ఇప్పటికి ఏదో ఒక పని జరిగి ఉండేది. కానీ.. ఇప్పుడు ఆ సవాళ్లకు సమాధానాల్ని వెతకాల్సిన పరిస్థితి. దీంతో.. చర్లపల్లి టెర్మినల్ అందుబాటులోకి రావటంవల్ల హైదరాబాద్ ప్రజలకు మరింత ఇబ్బందికరంగా ఉంటుందన్న విషయాన్ని పాలకులు గుర్తించి.. తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.