ఫ్రీ బస్సు : కర్ణాటక పిల్లిమొగ్గలు... ఏపీ సంగతేంటి ?
దక్షిణాదిన కాంగ్రెస్ కర్ణాటక నుంచి తన విజయయాత్రను ప్రారంభించింది.
By: Tupaki Desk | 31 Oct 2024 2:24 PM GMTమహిళలకు ఉచిత బస్సు సదుపాయం అన్నది అందమైన నినాదం. ఎన్నికల్లో ఓట్లు రాల్చే బ్రహ్మాండమైన పథకం. అయితే అది ఆచరణలోకి వచ్చేసరికి సర్కార్ బండికి ఎన్ని బ్రేకులు వేయాలో అన్నీ వేస్తోంది. ఖజానాకు భారంగా మారుతోంది.
కర్ణాటకలో మొదట ఈ పధకాన్ని ప్రారంభించారు. దక్షిణాదిన కాంగ్రెస్ కర్ణాటక నుంచి తన విజయయాత్రను ప్రారంభించింది. ఈ క్రమంలో బీజేపీ చేతులలో ఉన్న కర్ణాటకను గెలుచుకోవడానికి ఉచిత బస్సు పధకాన్ని కాంగ్రెస్ బ్రహ్మాస్త్రంగా ప్రయోగించింది.
అది సూపర్ హిట్ అయి రాష్ట్రం స్టీరింగ్ నే కాంగ్రెస్ కి అప్పగించింది. ఆ తరువాత తెలంగాణాలో కూడా కాంగ్రెస్ ఉచిత బస్సు అంటూ అవే పధకాన్ని ప్రయోగిస్తే అక్కడ కూడా బంపర్ హిట్ అయింది. ఇక ఆ రెండింటినీ చూసి ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు ఉచిత బస్సు హామీని ప్రకటించారు.
చిత్రంగా కూటమికి కూడా ఈ హామీ ఓట్లూ సీట్లు అధికారం తెచ్చిపెట్టింది. ఇపుడు చూస్తే మొదట హామీ ఇచ్చిన కర్ణాటక ఫ్రీ బస్సు స్కీం విషయంలో కిందా మీద అవుతోంది. దీని మీద గతంలోనే ఎన్నో సార్లు చర్చలు జరిగాయని ప్రచారం ఉంది. ఉచిత బస్సుని కూని రూటలే పరిమితం చేయాలని ప్రతిపాదించారు అని అన్నారు. అంతే కాదు కొన్ని బస్సులలో మాత్రమే ఫ్రీ బస్సు స్కీం ని వర్తింపచేయాలని చూస్తున్నారు అని ప్రచారం సాగింది.
ఇపుడు చూస్తే డిప్యూటీ సీఎం శివకుమార్ అయితే ఫ్రీ బస్సు స్కీం నే ఎత్తివేయాలని ఆలోచిస్తున్నారని ప్రచారం సాగింది. దీని మీద పునరాలోచన చేయాలను చూస్తున్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి. మహిళలు డబ్బులు ఇచ్చి బస్సులలో ప్రయాణం చేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు అని ఆయన అన్నట్లుగా చెప్పుకున్నారు. ఈ మెయిల్స్ ద్వారా సోషల్ మీడియా ద్వారా మహిళలు ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలియచేస్తున్నారు అని అన్నారు.
అయితే లేటెస్ట్ గా డీకే శివకుమార్ అలాంటిది ఏదీ లేదని అంటున్నారు. ఫ్రీ బస్సు స్కీం ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అయితే అసలు విషయం ఏంటి అంటే అక్కడ ఖజానాకు ఇబ్బందులు వస్తున్నాయి. సూపర్ ఫైవ్ పేరుతో కాంగ్రెస్ ఇచ్చిన పధకాలను అమలు చేయలేక సతమతం అవుతున్న నేపధ్యం ఉంది.
అందుకే కర్ణాటక కాంగ్రెస్ ఫ్రీ బస్సు విషయంలో పిల్లి మొగ్గలు వేస్తోంది అని అంటున్నారు. మరి తెలంగాణాలో కూడా ఈ పధకం భారంగానే ఉంది అని అంటున్నారు. ఏపీలో అయితే ఆ రెండు స్టేట్స్ తో పోలిస్తే ఖజానా కుదేల్ అయిన నేపధ్యం ఉంది. లక్షల కోట్ల అప్పులతో ఉంది. ఈ క్రమంలో చూస్తే కనుక ఏపీలో ఇంకా ఈ పధకం ప్రారంభం అవనేలేదు. దాని మీద తర్జన భర్జన పడుతున్నారు. ఫ్రీ బస్సు పధకాన్ని స్టడీ చేసేందుకు కూటమి ప్రభుత్వం కర్ణాటకను తెలంగాణాను ఎంచుకుంది.
మరి అక్కడే ఫ్రీ బస్సు స్కీం మీద అనేక రకాలుగా ఆలోచనలు సాగుతున్న వేళ కూటమి ప్రభుత్వం దీని మీద ఏ రకంగా నిర్ణయం తీసుకుంటుంది అన్నది చూడాలి. ఈ పధకానికి నెలకు రెండు వందల యాభై కోట్లు ఆర్టీసీకి భారం అవుతుంది. అంటే ఏడాదికి మూడు వేల కోట్లు అన్న మాట. ఆర్టీసీ ప్రభుత్వంలోనే ఉంది. ఈ భారం అంతా సర్కార్ దే అవుతుంది. ఈ నెల 6న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఉచిత బస్సు మీద కూటమి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది అని అంటున్నారు