Begin typing your search above and press return to search.

ప్రోగాం రాస్తాం.. లిక్కర్ అమ్ముతాం.. ఏపీ బిజినెస్ లోకి సాఫ్ట్ వేర్లు

కాగా, ఏపీలో 2019లో జగన్ ప్రభుత్వం వచ్చాక మద్యం విధానాన్ని మార్చేసిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   6 Oct 2024 3:30 PM GMT
ప్రోగాం రాస్తాం.. లిక్కర్ అమ్ముతాం.. ఏపీ బిజినెస్ లోకి సాఫ్ట్ వేర్లు
X

అందుబాటులో కోరుకున్న మద్యం బ్రాండ్లు.. నేషనల్, మల్టీ నేషనల్‌.. 10 రకాల పన్నులు ఆరుకు కుదింపు.. ఐదేళ్లుగా సరైన మద్యం (నాణ్యమైనది) దొరకని రాష్ట్రంలో సరికొత్త విధానాలతో ప్రైవేటుగా ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం.. ఇంకేం..? మేమంటే మేమంటూ వాటిని దక్కించుకోవడానికి పోటాపోటీ. అయితే, మద్యం వ్యాపారంలో అనుభవం ఉన్నవారైతే ఏదోలే అని సరిపెట్టుకోవచ్చు. కానీ అనుభవం లేనివారు కూడా దరఖాస్తు చేస్తున్నారు. వీరిలో సాఫ్ట్ వేర్‌ ఇంజనీర్లు, వైద్యులు, ఆడిటర్లు, కాంట్రాక్టర్లు కూడా ఉండడం గమనార్హం.

వైద్యులు, ఆడిటర్లు, కాంట్రాక్టర్లు..

మద్యం దుకాణాల కోసం స్వయంగా కార్యాలయాలకు వచ్చి దరఖాస్తు చేశారు వైద్యులు, ఆడిటర్లు, కాంట్రాక్టర్లు. పైగా సందేహాలనూ నివృత్తి చేసుకుంటున్నారు. కాగా, ఏపీలో 2019లో జగన్ ప్రభుత్వం వచ్చాక మద్యం విధానాన్ని మార్చేసిన సంగతి తెలిసిందే. అప్పటివరకు ఉన్న బ్రాండర్లను తీసివేసి కొత్త బ్రాండ్లను తీసుకొచ్చింది. కానీ, ఆ మద్యం నాణ్యతపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. ఏపీలో జగన్ సర్కారు ఓటమికి మద్యం విధానమూ ఓ కారణమనే అభిప్రాయం నెలకొంది. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి సైతం జగన్ ప్రభుత్వ మద్యం విధానాన్ని తమ ప్రచారంలో ఓ ఆయుధంగా చేసుకున్నాయి. ఇప్పడు కొత్త సర్కారు రావడం.. పాత సరుకుకు మళ్లడంతో మద్యం దుకాణాలకు డిమాండ్ బాగా పెరిగింది. అంచనాలను మించి దరఖాస్తులు వస్తాయని అధికారులు భావిస్తున్నారు.

రాజధాని ప్రాంతంలో..

ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం వచ్చాక రాజధాని అమరావతి ప్రాంతానికి పూర్వ వైభవం సిద్ధించింది. ఇదే ప్రాంతంలోని మద్యం దుకాణాలకూ గుంటూరు, మంగళగిరి-తాడేపల్లి, పొన్నూరు తదితరచోట్ల డిమాండ్ నెలకొంది. సగటున ఒక్కో దుకాణానికి 10కి పైగా దరఖాస్తులు వస్తున్నాయట. గతంలో దుకాణాలు, రెస్టారెంట్లు నడిపినవారు దరఖాస్తు చేసుకుంటారని ఎక్సైజ్ అధికారులు భావిస్తే అందుకు భిన్నంగా డాక్టర్లు, సాఫ్ట్ వేర్లు, ఆడిటర్లు దరఖాస్తు చేస్తున్నారు.

కొత్త పాలసీ.. కొత్త మందు..

వైసీపీ ప్రభుత్వం హయాంలో నిర్దేశించిన బ్రాండ్లు మాత్రమే దొరికేవి. అవీ నాణ్యత లేనివే. ఇది పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణాకు దారితీసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొత్త పాలసీ తెచ్చింది. అన్ని రకాల బ్రాండ్లు, తక్కువ ధరలకే దొరికేలా చేయనుంది. ఎవరైనా సరే.. లాటరీలో దుకాణం దక్కించుకునేలా పారదర్శక విధానం తెచ్చింది. దరఖాస్తు రుసుము రూ.2 లక్షలు చేసింది. కానీ, ఈ మొత్తం తిరిగివ్వరు. గతంలో రుసుము రూ.10 వేలు ఉండగా.. ఎవరుపడితే వాళ్లు దరఖాస్తు చేసుకున్నారు. దుకాణం దక్కాక.. లైసెన్సు ఫీజు కట్టలేదు. అప్పుడు మళ్లీ దరఖాస్తులు పిలిచారు. ఇప్పుడు లైసైన్సు ఫీజు భారీగా పెంచడంతో దానిని చెల్లించే ఆదాయ స్థోమత ఉన్నవారే దరఖాస్తులు చేస్తున్నారు.

ఏపీలో మొత్తం 3,396 మద్యం దుకాణాలకు లైసెన్సుల జారీకి ఎక్సైజ్‌ శాఖ సోమవారం అర్ధరాత్రి తర్వాత నోటిఫికేషన్‌ ఇచ్చింది. మరుసటి రోజు మంగళవారం అమావాస్య కావడంతో వ్యాపారులు పెద్దగా ఆసక్తి చూపలేదు. మొత్తంగా లక్షకు పైగా దరఖాస్తులు రావొచ్చని అంచనా. తిరిగి చెల్లించని దరఖాస్తు రుసుము కిందనే రూ.2 వేల కోట్ల ఆదాయం వస్తుందని లెక్కేస్తున్నారు. దరఖాస్తులకు ఈ నెల 9 వరకు గడువుంది. చివరి మూడు రోజుల్లో ఎక్కువ దరఖాస్తులు పడే అవకాశముంది.