Begin typing your search above and press return to search.

జగన్ రేవంత్ భేటీ ఎపుడు...

ఆయన రాజకీయ నాయకుడిగా తన బాటను రాచ బాట చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు.

By:  Tupaki Desk   |   9 Dec 2023 2:26 AM GMT
జగన్ రేవంత్ భేటీ ఎపుడు...
X

తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డిలో మెచ్యూరిటీ హుందాతనం ఇపుడు అందరికీ తెలిసి వస్తోంది. ఆయన రాజకీయ నాయకుడిగా తన బాటను రాచ బాట చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. అందుకే చిల్లర రాజకీయాలు చేసేందుకు సిద్ధంగా లేరు అని అంటున్నారు.

రేవంత్ రెడ్డి తన పొలిటికల్ కెరీర్ ని మలచుకున్న క్రమం చూసిన వారికి . ఆయన అంటే ఏమిటి అని అర్ధం అవుతుంది. ఆయన టీడీపీకి చంద్రబాబుకు సన్నిహితుడు అని ఒక భావన ఉంది. కానీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కి అతి ముఖ్య నాయకుడు ఇపుడు. అంతే కాదు సౌత్ లో కీలకమైన స్టేట్ కి సీఎం గా ఉన్నారు. దాంతో వ్యక్తిగతాలు వేరు వ్యవహారాలు వేరు అన్న పంధాను ఆయన తప్పకుండా అనుసరిస్తున్నారు అని అంటున్నారు.

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆ పార్టీ కోసమే ఉన్నారు. ఆయన పీసీసీ చీఫ్ గా ఉన్న టైం లో ఒక డిబేట్ లో మాట్లాడుతూ మా పార్టీ ఆదేశిస్తే ఏపీలో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేస్తాను ప్రత్యర్ధిగా ఉన్న టీడీపీ సహా అన్ని పార్టీలను విమర్శిస్తాను అని చెప్పారు. దటీజ్ రేవంత్ రెడ్డి అని చెప్పాలి.

ఎందుకంటే ఆయనకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యం. తనను ఇంతవాడిని చేసిన పార్టీ కోసం ఆయన ఎంతైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని పదవి అందుకున్న రేవంత్ కి దాని విలువ అందరి కంటే బాగా తెలుసు. పైగా తన బాధ్యతలు ఇంకా బాగా తెలుసు. అందుకే ఆయన కాంగ్రెస్ మనిషిగానే నూరు శాతం ఉంటారు

సరే ఆయన్ని అభిమానించే వారు అన్ని పార్టీలలో ఉన్నారు. తెలుగుదేశంలో ఇంకా ఎక్కువగా ఉన్నారు. ఆయన కూడా ఎవరినీ చెడ్డ చేసుకోరు. ఊరకే వివాదంలోకి వెళ్లరు. సో టీడీపీ వారు మావాడు అనుకుంటే రేవంత్ కి ఏంటి సంబంధం అని కూడా అనుకోవాల్సి ఉంటుంది.

ఇక ఉమ్మడి ఏపీ రెండుగా మారింది. ఏపీ తెలంగాణాగా ఉంది. రెండూ తెలుగు రాష్ట్రాలే. రెండింటి మధ్యన సహకారం సోదరభావం కచ్చితంగా అవసరం. ఎందుకంటే రెండింటి అవసరాలు అలాంటివి కాబట్టి. అందువల్లనే జగన్ రేవంత్ రెడ్డిని గ్రీట్ చేస్తూ చేసిన ట్వీట్ కి రీట్వీట్ చేశారు. చాలా హుందాగా జవాబు ఇచ్చారు.

జగన్ కోరింది రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం. దానికి బదులుగా రేవంత్ రెడ్డి కూడా తాను కూడా స్నేహం సహకారం కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చారు. అభివృద్ధిలో పరస్పరం సహకరించుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

మరి ఇద్దరూ యువ నేతలే. ఇద్దరూ సహకారం కోరుకుంటున్న వారే. అందువల్ల ఏపీ తెలంగాణాల మధ్యన విభజన సమస్యలు చాలా ఉన్నాయి. మరి వాటిని పరిష్కరించుకునందుకు ఇద్దరూ భేటీ వేయడం అవసరం. దానికి ఇదే ముహూర్తం కూడా. ఎందుకంటే కొత్త ఉత్సాహంలో తాజాదనంతో తెలంగాణా సర్కార్ కొలువు తీరింది.

కాంగ్రెస్ జాతీయ పార్టీ. అందువల్ల సంకుచితంగా ఆలోచన చేయదు. అలా కనుక చూసుకుంటే చాలా సమస్యలకు ఈ ఇద్దరు యువ ముఖ్యమంత్రులు పరిష్కారం చూపగలరు అని అంతా భావిస్తున్నారు. మరి జగన్ రేవంత్ రెడ్డిల భేటీ ఎపుడు అన్నదే ప్రశ్నగా ఉంది.