సోమవారం - శుక్రవారం.. రిపీట్ కాబోతున్నాయా?
ఈ నేపథ్యంలో కూటమి సాధించిన ఘనవిజయంతో చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు.. వైఎస్ జగన్ ప్రతిపక్షానికి పరిమితం అయ్యారు.
By: Tupaki Desk | 16 Jun 2024 5:44 PM GMTఆంధ్రప్రదేశ్ లోని సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కూటమి సాధించిన ఘనవిజయంతో చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు.. వైఎస్ జగన్ ప్రతిపక్షానికి పరిమితం అయ్యారు. ఈ సమయంలో అనూహ్యంగా ఒక కీలక చర్చ తెరపైకి వచ్చింది. అది కూడా రెండు వారాలకు సంబంధించింది కావడం గమనార్హం.
అవును... ఏపీలో ఇప్పుడు రెండు "వారాలు" ఆసక్తిగా మారాయి. వాస్తవంగా 2014-19లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో... పోలవరం ప్రాజెక్ట్ సందర్శనార్థం ప్రతీ సోమవారం కొంతమంది ప్రజానికాన్ని బస్సులు పెట్టి పంపించేవారు. దానికి ఎంత ఖర్చు అయ్యిందనే విషయాన్ని తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ అసెంబ్లీలో వివరాలు వెల్లడించింది.
చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో సోమవరం అంటే పోలవరం అనే స్థాయిలో ముద్రపడిపోయింది. ఇదే సమయంలో... "జయము జయము చంద్రన్న" పాట ఎంతో ఫేమస్ అయ్యింది. దీన్ని వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీలోనూ ప్రదర్శించింది. ఇదే సమయంలో... శుక్రవారం కూడా ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్కే. ఇందులో భాగంగా.. జగన్ ప్రతిపక్షమంలో ఉన్నప్పుడు శుక్రవారం శుక్రవారం సీబీఐ కోర్టుకు వెళ్లేవారు.
పాదయాత్ర మొదలుపెట్టిన సమయంలో కూడా ప్రతీ శుక్రవారం ఆయన కోర్టుకు హాజరయ్యేవారు. దీనిపై టీడీపీ నేతలు ఎద్దేవా చేసేవారు. ఈ క్రమంలో 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ కోర్టుకు హాజరయ్యేవారు కాదు. కట్ చేస్తే.. ఇప్పుడు చంద్రబాబు మరోసారి సీఎం అయ్యారు.. జగన్ ప్రతిపక్ష నేత అయ్యారు. దీంతో... మరోసారి ఈ రెండు వారాలూ తెరపైకి వచ్చాయి.
ఇందులో భాగంగా... ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న జగన్ ఇకపై ప్రతీ శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇదే క్రమంలో... ప్రతీ సోమవారం పోలవరం అనే విషయాన్ని ఇప్పటికే చంద్రబాబు కన్ఫాం చేసేశారు. దీనికి తోడు జగన్ పై కొత్త ప్రభుత్వం అదనపు కేసులు ఏమైనా పెడుతుందా అనేది ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో... ఇప్పుడు ఏపీలో సోమవారం - శుక్రవారం హాట్ టాపిక్ గా మారాయనే చెప్పాలి.