వైసీపీలో అనిల్ కుమార్ యాదవ్ కనిపించడం లేదు ఎందుకు ?
ఆయనను నెల్లూరు జిల్లాలో మూడేళ్ళ పాటు మంత్రిగా చేసి తన మార్క్ అలా చాటారు.
By: Tupaki Desk | 20 Oct 2024 3:00 AM GMTనెల్లూరుకు చెందిన వైసీపీ యువ నేత మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేరు చెబితేనే ఫైర్ బ్రాండ్ గుర్తుకు వస్తారు. ఆయన రాజకీయ దూకుడు చూసి జగన్ ఆయనకు వైసీపీలో ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. ఆయనను నెల్లూరు జిల్లాలో మూడేళ్ళ పాటు మంత్రిగా చేసి తన మార్క్ అలా చాటారు.
ఇక జగన్ అంటే అత్యంత విధేయత కనబరచే అనిల్ కుమార్ యాదవ్ మంత్రిగా ఉన్న కాలంలో జగన్ మీద ఈగ వాలకుండా చూసుకున్నారు. జగన్ ని విపక్షాలు ఏమైనా నాడు విమర్శిస్తే చాలు మంత్రి మీడియా ముందుకు వచ్చి తనదైన పదునైన మాటల జోరుతో అగ్గి రవ్వలే కురిపించేవారు.
అనిల్ కుమార్ నెల్లూరు జిల్లాలో పూర్తి ఆధిపత్యం కూడా ఆనాడు చూపించారు. ఆయన మీద సొంత పార్టీ నేతల నుంచి విమర్శలు వచ్చినా ఫిర్యాదులు వెళ్ళినా కూడా అధినాయకత్వం పట్టించుకునేది కాదు. అలా అనిల్ కుమార్ యాదవ్ హవా ఒకనాడు వైసీపీలో పెద్ద ఎత్తున సాగింది.
ఇక నెల్లూరు అర్బన్ సీటుకు అనిల్ కుమార్ కి ఇవ్వవద్దు అని పార్టీలో ఒత్తిడి వచ్చినపుడు కూడా వైసీపీ హై కమాండ్ ఆయనకే ఫేవర్ చేసింది. ఆయన మనిషికి నెల్లూరు అసెంబ్లీ టికెట్ ఇచ్చి ఆయనను నర్సారావుపేటకు షిఫ్ట్ చేసింది. అలా ఎంపీగా ఆయన పోటీ చేశారు. అఫ్ కోర్స్ కూటమి ప్రభంజనంలో ఓటమి చూసారనుకోండి.
ఇక ఓడిన తరువాత అనిల్ కుమార్ యాదవ్ పార్టీ వేదికల మీద కానీ మీడియా ముందు కానీ కనిపించింది అయితే లేదు అనే అంటున్నారు. ఆయన ఎందుకో ఫుల్ సైలెంట్ అయ్యారు. తమకు ఇది రాజకీయంగా కాని కాలం అనుకున్నారో ఏమో తెలియదు కానీ ఆయన మాత్రం పాలిటిక్స్ నుంచి కాస్తా పక్కకే వచ్చారని ప్రచారం సాగుతోంది.
అంతే కాదు చెన్నై వేదికగా ఆయన బిజినెస్ పనులను చూసుకుంటున్నారు అని కూడా అంటున్నారు. ఆయన నెల్లూరు అర్బన్ జిల్లాలోని పార్టీని క్యాడర్ ని కూడా పూర్తిగా పట్టించుకోవడం లేదు అని అంటున్నారు. ఆయన ఎవరికీ అందుబాటులో ఉండడం లేదు అని కూడా అంటున్నారు.
ఒక విధంగా పడి లేచిన కెరటంగా లేచి పడిన కెరటంలో నెల్లూరు జిల్లాలో యువ నేతా అనిల్ కుమార్ ని చెప్పుకుంటున్నారు. అన్నీ బాగున్నపుడు రాజకీయాలు చేయడం కాదు, ప్రతికూల పరిస్థితుల్లో కూడా చేయాలి. మరీ ముఖ్యంగా వైసీపీ ఎన్నడూ ఊహించని విధంగా కష్టకాలంలో ఉంది. పైగా దారుణమైన ఓటమిని చవి చూసింది.
దాంతో పార్టీని ఒడ్డుకు చేర్చాలి. ఆ విషయంలో పార్టీ అధికారంలో ఉన్నపుడు హవా చలాయించిన వారే కీలక బాధ్యతలు తీసుకోవాలి. కానీ వైసీపీ రెండు విడతలుగా భర్తీ చేసిన మంత్రి వర్గంలో దాదాపుగా నలభైకి పైగా నేతలు మంత్రి పదవులు అనుభవించారు. వారిలో ఇపుడు దాదాపుగా ఎనభై నుంచి తొంబై శాతం కనిపించడం లేదు అని అంటున్నారు.
అందులో అనిల్ కుమార్ యాదవ్ కూడా ఉన్నారని అంటున్నారు. ఇక నెల్లూరు జిల్లాలో టాక్ ఏంటి అంటే జగన్ వీరాభిమాని ఆయన కోసం గొంతు చించుకుని మరీ మీడియా ముందుకు వచ్చే అనిల్ కుమార్ యాదవ్ అసలు కనిపించడం లేదని. అందుకే వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్లను నియమించినా కూడా అందులో ఎక్కడా అనిల్ కుమార్ యాదవ్ పేరు లేదని అంటున్నారు.
ఆయన రాజకీయాలకు స్వల్ప విరామం ప్రకటించారా లేక దూరంగా ఉంటున్నారా లేక సమయం చూసుకుని మళ్లీ వస్తారా అనేది ఎవరికీ తెలియడం లేదు. అంతే కాదు ఆయన తనకు కొంత కాలం టైం కావాలని ఏకంగా అధినాయకత్వానికే చెప్పుకున్నారా అన్నది కూడా చర్చగా ఉంది.
ఏది ఏమైనా అనిల్ కుమార్ యాదవ్ వంటి ఫైర్ బ్రాండ్ కనిపించడం లేదు అలాగే పార్టీలో ఆయన పేరు పెద్దగా వినిపించడం లేదు అంటే ఇది షరా మామూలే పాలిటిక్స్ లో అని భావించాలా లేక అనిల్ కుమార్ సైలెంట్ వెనక ఏదైనా బ్రహ్మాండమైన వ్యూహం ఏదైనా ఉందా అని ఆలోచించాలా అంటే అన్నింటికీ కాలమే జవాబు చెప్పల్సి ఉంది.