కొత్త సీఎం ప్రమాణం...విశాఖా అమరావతా ?
మరి కొత్త సీఎం ఎక్కడ నుంచి ప్రమాణం చేస్తారు అన్న చర్చ ఇపుడు సాగుతోంది.
By: Tupaki Desk | 3 Jun 2024 1:34 PM GMTఏపీ కొత్త సీఎం ఎవరో మరి కొద్ది గంటలలో తేలబోతోంది. మంగళవారం మధ్యాహానికి పూర్తి క్లారిటీ వస్తుంది. ఆ మీదట కొత్త సీఎం ప్రమాణమే ఇక మిగిలి ఉంటుంది. మరి కొత్త సీఎం ఎక్కడ నుంచి ప్రమాణం చేస్తారు అన్న చర్చ ఇపుడు సాగుతోంది.
కొత్త సీఎం గా ఎవరు ఉంటారు అన్నది క్లారిటీ వస్తే ఈ చర్చకు ముగింపు ఉంటుంది అని అంటున్నారు. ఏపీకి ఎవరు న్యూ చీఫ్ మినిస్టర్ అన్నది చూస్తే కనుక అటు ముఖ్యమంత్రిగా ప్రస్తుతం ఉన్న జగన్ మరోసారి గెలిచి సీఎం అవుతారా అన్నది ఒక డిస్కషన్ పాయింట్.
అలాగే చంద్రబాబు అయిదేళ్ల సుదీర్ఘ విరామం తరువాత గెలిచి మరోసారి ఏపీకి సీఎం అవుతారా అన్నది కూడా చర్చగా ఉంది. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ఖాయం. అలాగే జగన్ సీఎం అయితే ఆ పార్టీ ముందే చెప్పినట్లుగా విశాఖ నుంచే ప్రమాణం జరుగుతుంది.
అది కళావాణి వేదికగానో లేక ఏయూ నుంచో లేక మరో విశాలమైన ప్రాంతం నుంచే సీఎం ప్రమాణం ఉంటుంది అని అంటున్నారు. దీని మీద వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, ముఖ్యమంత్రిగా జగన్ విశాఖ నుంచి రెండవసారి ప్రమాణం చేస్తారు అని చెప్పారు.
జగన్ ప్రమాణ స్వీకారం కోసం ఇప్పటికే విశాఖలోని హొటళ్ళ రూములను వైసీపీ నేతలు బుక్ చేశారు. దేశం నలుమూలల నుంచి కూడా ప్రముఖులు వస్తారు అని వైసీపీ నేతలు చెబుతున్నారు వైసీపీ డేట్ కూడా అనౌన్స్ చేసింది. దాని ప్రకారం చూస్తే జూన్ 9 గా అది ఉంది. చరిత్రలో మరచిపోలేని విధంగా వైసీపీ ప్రమాణ స్వీకారాన్ని చేసి చూపిస్తామని వైసీపీ నేతలు అంటున్నారు.
మరో వైపు చూస్తే మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ చంద్రబాబు ఆరు నూరు అయినా ఏపీకి సీఎం అవుతారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు సీఎం గా అమరావతి నుంచి ప్రమాణం చేస్తారు అని ఆయన అంటున్నారు. ఏపీకి రాజధాని అన్నది ఒక్కటే ఉంటుందని టీడీపీ అదే మాటకు కట్టుబడి ఉందని చెబుతున్నారు.
ఆ విధంగా చూస్తే కనుక అయిదేళ్ళ క్రితం జగన్ ప్రభుత్వం కూల్చేసిన ప్రజా వేదిక ప్రాంతంలోనే చంద్రబాబు ప్రమాణం ఉండొచ్చు అని ఆయన అంటున్నారు. అదే విధంగా ప్రజా వేదికను టీడీపీ ప్రభుత్వం నిర్మిస్తుందని కూడా ఆయన అంటున్నారు. ఇలా వైసీపీ టీడీపీ నేతలు అతి ఉత్సాహం మీద ప్రకటనలు అయితే చేస్తున్నారు.
అయితే జూన్ 4న తేదీన ఫలితాలు వచ్చి ప్రమాణానికి చూస్తే టైం తక్కువగా ఉంటుందని అంటున్నారు. దాంతో అధికారులకు ఇది ఇబ్బందికరం అని అంటున్నారు. ఈ రోజుకి చూస్తే సాధారణ పరిపాలన విభాగం అధికారులు దీని మీద ఒత్తిడికి గురి అవుతున్నారు అని అంటున్నారు. ఎవరు సీఎం అవుతారు అన్నది క్లారిటీ వస్తే ఆ తరువాత కధ వేరుగా ఉంటుంది.
కానీ ఇపుడు చూస్తే చాలా రోజుల ముందు నుంచి వేదికలను సిద్ధం చేయాలని అధికారంలో ఉన్న పార్టీతో పాటు విపక్షం నుంచి కూడా సూచనలు వస్తూండడంతో అటు విశాఖనా లేక అమరావతినా అన్నది వారు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు అని అంటున్నారు. చూడాలి మరి కొద్ది గంటలలో వచ్చే ఫలితం ఏ విధంగా డిసైడ్ చేస్తుందో.