Begin typing your search above and press return to search.

పార్లమెంట్ ఎన్నికల్లో సోనియా ఎక్కడ నుంచి పోటీకి దిగుతారో?

ఈమేరకు ఏ నియోజకవర్గం అయితే బాగుంటుందనే విషయంలో ఆరాలు తీస్తోంది.

By:  Tupaki Desk   |   25 Dec 2023 5:08 PM IST
పార్లమెంట్ ఎన్నికల్లో సోనియా ఎక్కడ నుంచి పోటీకి దిగుతారో?
X

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. పార్టీకి దక్కిన విజయంతో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. 17 నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను ఎంపీలుగా నిలబెట్టాలని యోచిస్తోంది. ఇందులో భాగంగానే పార్టీ అధినేత్రి సోనియాగాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయించాలని కసరత్తులు చేస్తోంది. ఈమేరకు ఏ నియోజకవర్గం అయితే బాగుంటుందనే విషయంలో ఆరాలు తీస్తోంది.

అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయంతో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని యోచిస్తోంది. 17 లోక్ సభ నియోజకవర్గాల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని భావిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలని అనుకుంటున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు కూడా కసరత్తు చేస్తున్నారు. సంక్రాంతి తరువాత అభ్యర్థుల ఎంపిక ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తెలంగాణ నుంచి సోనియా గాంధీని పోటీ చేయించాలనే యోచనలో ఉండటంతో ఎక్కడ నుంచి బరిలో దిగితే బాగుంటుందనే చర్చలు వస్తున్నాయి. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన మల్కాజిగిరి నుంచి పోటీ చేయించాలని చూస్తున్నట్లు సమాచారం. ఖమ్మం, నల్లగొండ, భువనగిరి, మహబూబ్ నగర్ స్థానాల నుంచి కూడా పోటీ చేయించాలనే ఆలోచనలో రాష్ట్ర నాయకత్వం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. సోనియా ఎక్కడ నుంచి పోటీకి సమ్మతిస్తారో తెలియడం లేదని అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ పార్టీని గాడిలో పడేయాలని చూస్తున్నారని చెబుతున్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అధ్వానంగా మారింది. చంద్రబాబు నాయుడు కూడా ఇండియా కూటమిలో చేరేందుకు సమ్మతి తెలియజేస్తుండటంతో అక్కడ పార్టీకి జవసత్వాలు నింపాలని ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. దీంతో ఈ నెల 27న జరగనున్న ఏఐసీసీ కీలక సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ, పీసీసీ చీఫ్ రుద్ర రాజు, కొత్త ఇన్ చార్జి ఠాగూర్ తదితర నేతల సమక్షంలో ఏ నిర్ణయం తీసుకుంటారోననే ఆసక్తి అందరిలో నెలకొంది.

కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయంతో ముందుకు వెళ్లాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ నుంచి ఎన్ని సీట్లు దక్కితే అంత ప్రాధాన్యం దక్కుతుందని అంటున్నారు. దీంతోనే పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించాలని శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే నేతల నుంచి పూర్తి సమాచారం తీసుకుంటోంది. గెలుపు గుర్రాల కోసం వేట ప్రారంభమైంది.