Begin typing your search above and press return to search.

2024 లో గెలిచిన పార్టీనే 2029 లో కూడా గెలుస్తుంది !?

అందుకే ఈసారి ఎలాగైనా గెలుపు సాధించాలని ప్రాణాలకు సైతం తెగింది పోరాడారు అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   25 May 2024 3:30 AM GMT
2024 లో గెలిచిన పార్టీనే 2029 లో కూడా గెలుస్తుంది !?
X

ఇది జోస్యమా అంటే కాదు, విశ్లేషణ మాత్రమే. అయితే ఇది లాజిక్ కి అందే విశ్లేషణగానే చూడవచ్చు. అసలు ఈసారి విజయం ఏ పార్టీకి అయినా ఎందుకు అంత అవసరం అంటే వారికి కూడా 2024, 2029 రెండు ఎన్నికల ప్రాధాన్యత తెలుసు. అందుకే ఈసారి ఎలాగైనా గెలుపు సాధించాలని ప్రాణాలకు సైతం తెగింది పోరాడారు అని అంటున్నారు.

ఇక ఈసారి ఎన్నికల్లో వైసీపీ కానీ టీడీపీ కానీ గెలుస్తుంది. ఈ రెండు పార్టీలే ఏపీలో ఉన్నాయి కాబట్టి వేరే చర్చ అవసరం లేదు. ఇక గెలిచిన పార్టీకి 2024 2029 మధ్యలో అన్నీ సానుకూల అంశాలే ఉంటాయని అంటున్నారు. ఎందుకంటే తొలి పదేళ్ళ బాలారిష్టాలు తొలగి ఒక స్పష్టమైన లక్ష్యం దిశగా ఏపీ సాగే కీలక కాలం ఇది.

ఈ సమయంలో ఎవరు అధికారంలో ఉన్నా తప్పకుండా అభివృద్ధి జరిగి తీరుతుంది. అలాగే సంపద పెరుగుతుంది. అలాగే అన్ని రకాలైన వనరులూ అందుబాటులోకి వస్తాయి. దాంతో సీఎం గా ఉన్న వారికి చాలా కష్టాలు తప్పి గతంలో ఎన్నడూ లేని విధంగా పేరు ప్రఖ్యాతులు వస్తాయని విశ్లేషణలు ఉన్నాయి. ఈ అయిదేళ్లలో జరిగేది ఏంటి అన్నది తీసుకుంటే ఆరు నూరు అయినా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి గ్యారంటీగా అవుతుంది.

ఆ క్రెడిట్ అధికారంలో ఉన్న పార్టీకి సీఎంకే నేరుగా వస్తుంది. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అయితే ఆ రాజకీయ ప్రభావం అయిదారు జిల్లాల మీద ఉంటుంది. అది ఒక పెద్ద ఓటు బ్యాంక్ గా ఆ పార్టీకి 2029 ఎన్నికల్లో మారుతుంది. ఇక రాజధాని సమస్య కూడా ఒక కొలిక్కి వస్తుంది. వైసీపీ గెలిస్తే విశాఖను పాలనా రాజధానిగా చేసుకుని పాలిస్తుంది. గ్రోత్ ఇంజన్ గా మార్చేందుకు చూస్తుంది.

ఇక టీడీపీ అధికారంలోకి వస్తే అమరావతినే రాజధానిగా ప్రకటించి తన వంతుగా అభివృద్ధి చేయడానికి వీలు ఉంటుంది. ఇక విభజన హామీలు పదేళ్ళలో పెద్దగా అమలు కాలేదు. రానున్న అయిదేళ్ల కాలంలో అవి పూర్తి స్థాయిలో అయ్యే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. అలాగే ఉమ్మడి ఆస్తుల విభజన అదే విధంగా ఏపీకి రావాల్సిన నిధులు అన్నింటికీ పరిష్కారం దొరుకుతుంది అని అంటున్నారు.

ఇక పారిశ్రామికంగా కూడా రానున్న అయిదేళ్లలో ఏపీ ముందడుగు వేసే చాన్స్ ఉంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తి అయితే కచ్చితంగా ఏపీ ప్రతిష్ట పెరుగుతుంది. దానిని ఆనుకుని కూడా ప్రగతి సాగుతుంది. అలాగే పోర్టులు ఫిషింగ్ హార్బర్ల పూర్తితో పాటు పదిహేడు మెడికల్ కాలేజీలు కూడా ప్రారంభానికి నోచుకుంటాయి.

సంపద సృష్టి కూడా జరిగే అవకాశం ఉంది. ఏపీ రాజధాని ఎక్కడ అన్న దానిని బట్టి దానిని అల్లుకుని అభివృద్ధి ఉంటుంది. అలగే దాంతో పాటే ఆదాయాలు పెరుగుతాయి. ఇవన్నీ రానున్న అయిదేళ్లలో జరిగేవే అని చెప్పవచ్చు. ఇది పాలనాపరంగా ఏ ప్రభుత్వం ఉన్నా జరిగే కార్యక్రమాలు ఆ విధంగా పాలకులకు వచ్చే ఘనతలుగా చెప్పుకోవాలి.

ఇక రాజకీయ లాభాలు చూస్తే 2026 నాటికి అసెంబ్లీ లోక్ సభ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరగనుంది. దాంతో ఏపీలో ఉన్న 175 అసెంబ్లీ సీట్లు కాస్తా 225గా మారుతాయి. అంటే మరో యాభై దాకా సీట్లు పెరుగుతాయి అన్న మాట.

ఇది అధికారంలో ఉన్న పార్టీకే ఎక్కువగా లాభించే అంశం. తమకు అనుకూలంగా ఈ విభజనను చేసుకునే చాన్స్ ఉంది. దాంతో పాటు మరో యాభై మంది దాకా కొత్త వారికి ఎమ్మెల్యేలుగా అవకాశాలు ఇస్తూ 2029 ఎన్నికలకు వెళ్ళే వీలుంది. ఇలా రాజకీయంగా పట్టు సాధిస్తూ పాలనా పరంగా మెప్పు పొందుతూ ఉంటే కచ్చితంగా 2029 నాటికి మరోసారి ఆ ప్రభుత్వాన్నే ప్రజలు ఎన్నుకునే వీలు ఉంటుంది. అంటే ఈసారి గెలిస్తే కనుక పదేళ్ళ పాటు అధికారం అందుకోవడానికి పరమ పద సోపానం లాంటి అవకాశాలు వేచి ఉన్నాయన్న మాట. మరి ఆ సువర్ణ అవకాశం ఎవరికి దక్కుతుంది ఏమిటి అన్నది జూన్ 4న ఫలితాలే చెప్పాల్సి ఉంటుంది.