Begin typing your search above and press return to search.

ప్రెసిడెంట్స్ ప్యాలెస్.. ప్రెసిడెంట్స్ హౌస్.. వైట్ హౌస్.. ప్రత్యేకతలెన్నో?

తాజాగా జరిగిన ఎన్నికల్లో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన నేపథ్యంలో వైట్ హౌస్ కు కొత్త అధ్యక్షుడు రానున్నట్లయింది.

By:  Tupaki Desk   |   10 Nov 2024 1:30 PM GMT
ప్రెసిడెంట్స్ ప్యాలెస్.. ప్రెసిడెంట్స్ హౌస్.. వైట్ హౌస్.. ప్రత్యేకతలెన్నో?
X

అమెరికా అంటే అగ్ర రాజ్యం.. మరి అలాంటి దేశానికి అధ్యక్షుడిగా ఉన్న నాయకుడి నివాసం ఎలా ఉండాలి..? ఎన్ని ప్రత్యేకతలుండాలి..? ఇంకెన్ని వసతులుండాలి..? అందుకనే, అమెరికా స్థాయికి తగ్గట్లే ఉంటుంది ఆ భవనం.. దాని పేరే వైట్ హౌస్. అయితే, చిత్రం ఏమంటే వైట్ హౌస్‌ ను కట్టించిన అధ్యక్షుడు అందులో ఉండలేదు.. తాజాగా జరిగిన ఎన్నికల్లో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన నేపథ్యంలో వైట్ హౌస్ కు కొత్త అధ్యక్షుడు రానున్నట్లయింది.

225 ఏళ్లుగా నివాసం ఇదే.

అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్ హౌస్. ఇది 1800 సంవత్సరం నుంచి అధ్యక్షుడి అధికారిక నివాసంగా ఉంటోంది. అంటే.. దాదాపు 225 ఏళ్లుగా అన్నమాట. కాగా, వైట్‌ హౌస్‌ లో నివసించిన మొదటి అమెరికన్ అధ్యక్షుడు జాన్ ఆడమ్స్. ఇక వైట్ హౌస్ ఉన్నది అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో. అమెరికా చరిత్రలో మొదటి అధ్యక్షుడైన జార్జి వాషింగ్టన్ పేరిట ఏర్పడింది ఈ నగరం. అయితే, ఆయన వైట్‌ హౌస్‌ లో నివసించలేదు.

కట్టించారు కానీ..

అమెరికా అధ్యక్షుడి స్థాయికి తగిన నివాస భవనం ఉండాలని జార్జి వాషింగ్టన్‌ 1792లో అధ్యక్ష భవనం నిర్మాణానికి సంకల్పించారు. అయితే, అప్పటికి వాషింగ్టన్‌ డీసీ ఇంకా అభివృద్ధి చెందలేదు. అధ్యక్ష భవన నిర్మాణం డిజైన్లు పంపాలని వాషింగ్టన్ పోటీ పెట్టగా.. నిపుణులైన వాస్తు శిల్పులు, ఔత్సాహికులు స్పందించారు. వీటిలో అమెరికా చరిత్ర, సంస్కృతిని చాటేలా అనేక డిజైన్లున్నాయి. అయితే, చివరగా ఐర్లాండ్‌ ఆర్కిటెక్ట్‌ జేమ్స్‌ హోబన్‌ రూపొందించిన డిజైన్‌ ను ఎంపిక చేశారు. ఈ ఆర్కిటెక్ట్ డిజైన్ కు ఐర్లాండ్ రాజధాని డబ్లిన్‌ లోని లెన్ట్సర్‌ హౌస్‌ ను స్ఫూర్తిగా తీసుకున్నారు. కాగా వైట్‌ హౌస్‌ లో నివసించిన మొదటి అమెరికన్ అధ్యక్షుడు జాన్ ఆడమ్స్. వాషింగ్టన్ హయాంలో మొదలైనా ఆయన మాత్రం నివసించలేకపోయారు.

డిజైన్ మారింది..

ఇప్పుడు చూస్తున్న డిజైన్ వైట్‌ హౌస్ పూర్తిగా తొలి డిజైన్‌ కాదు. పలువురు అధ్యక్షులు నివాసం ఉంటూ ఒక్కో మార్పు చేస్తూ వచ్చారు. జేమ్స్‌ మన్రో కాలంలో సౌత్ పోర్టికో, ఆండ్రూ జాక్సన్‌ హయాంలో నార్త్‌ పోర్టికో నిర్మించారు. 1901లో అధ్యక్షుడిగా ఉన్న థియోడర్‌ రూజ్‌ వెల్డ్‌ ‘వైట్‌ హౌస్‌’ అని పేరు పెట్టాడు. పేరు ప్రాచుర్యం పొందడంతో అలాగే ఉంచారు. వైట్‌ హౌస్‌ లో ఎన్నో మార్పులు చేసినా పేరు మాత్రం మారలేదు. 132 గదులు, 35 బాత్ రూమ్ లు, సినిమా హాలు, టెన్నిస్ కోర్టు, న్యూక్లియర్ బంకర్, బుల్లెట్ ప్రూఫ్ కిటికీలు.. ఇలా అనేక ప్రత్యేకతలు వైట్ హౌస్ సొంతం. అంతేకాదు.. వైట్ హౌస్ ఏరియా నో ఫ్లై జోన్. అంటే.. ఈ ప్రాంతం మీదుగా ఏ విహంగమూ ఎగిరేందుకు అవకాశం లేదు.