జాన్ లో అలా, జూన్ లో ఇలా... ఏలియన్స్ గురించి ఎందుకిలా?
అసలు గ్రహాంతర వాసులు ఉన్నారా లేరా అనే విషయం నిత్యం నెట్టింట చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 15 Jun 2024 2:30 AM GMTఅసలు గ్రహాంతర వాసులు ఉన్నారా లేరా అనే విషయం నిత్యం నెట్టింట చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. వీరి విషయంలో ప్రపంచంలోని ఇతర దేశాలకంటే అత్యధికంగా అమెరికలోనే చర్చ జరుగుతుంటుంది. ఏలీయన్స్ విషయంలో అగ్రరాజ్యానికే ఆతృత, ఆందోళన ఎక్కువనే మాటలు వినిపిస్తుంటాయి. ఈ క్రమంలో తాజాగా హార్వర్డ్ యూనివర్శిటీ మరోసారి స్పందించింది.
ఈ సృష్టిలో కేవలం భూమిపై మాత్రమే జీవి ఉంటుందని చాలా మంది నమ్ముతుంటారు. అయితే కొన్ని సినిమాల ప్రభావమో.. లేక, మరికొన్ని ఆలోచనల కారణమో.. అదీగాక, ఇంకొన్ని ఆందోళన ఎఫెక్టో తెలియదు కానీ.. ఏలియన్స్ గురించి చర్చను అమెరికా నిత్యం లైవ్ లో ఉంచే ప్రయత్నాలు చేస్తుంటుందని అంటారు. ఇదే సమయంలో ఆ రాజ్యం నుంచే విభిన్నమైన ప్రకటనలు వస్తుంటాయి!
ఇందులో భాగంగా... తాజాగా అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు ఏలియన్స్ గురించి మరో ఆసక్తికర విషయం వెల్లడించారు. గ్రహాంతరవాసులు భూమిపైనే మనుష్యుల మధ్యే జీవించి ఉండోచ్చని తెలిపారు! రూపం మార్చుకుని మానవుల మధ్యే అవి రహస్యంగా జీవిస్తున్నాయనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు. భూగర్భంలోనూ, చంద్రుడిపైనా ఏలియన్స్ ఉండొచ్చని అన్నారు.
తాజాగా గ్రహాంతర జీవులకు సంబంధించినవిగా భావించే యూ.ఎఫ్.వో లపై అధ్యయనం కోసం ఈ యూనివర్సిటీ ఏర్పాటుచేసిన "హ్యూమన్ ఫ్లరిషింగ్ ప్రోగ్రాం" లోని పరిశోధకులు ఈ మేరకు తమ పరిశోధనను ప్రచురించారు. ఇందులో భాగంగా... యూ.ఎఫ్.వోలు లేదా గుర్తించబడని వైమానిక దృగ్విషయాలు భూమిపై నివసించే గ్రహాంతర వాసుల కోసం వచ్చిన స్నేహితుల అంతరిక్ష నౌకలు కావొచ్చనే కోణంలో అన్వేషిస్తున్నట్లు తెలిపారు.
ఈ విధంగా అంచనా అయితే వేసిందే కానీ.. వీటిని నిర్ధారించే ఎటువంటి ఆధారాలు బయట పెట్టలేదు! ఏది ఏమైనా... ఏలియన్స్ పై ఆసక్తిరేపే సరికొత్త అంశాన్ని మాత్రం లేవనెత్తారనే చెప్పాలి. అయితే... ఇటీవల ఇంగ్లాండ్ లో ఓ మహిళ అచ్చం ఏలియన్ మాదిరిగానే ఉందంటూ ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో అటుగా వెళ్తున్న వారు ఆమెను విచిత్రంగా చూడటం ఆ వీడియోలో కనిపించింది.
ఆ వీడియోలో కనిపించిన మహిళ తెల్లటి చర్మం కలిగి, సన్నగా, చాలా పొడవుగా కనిపించింది. ఆ సమయంలో ఆకాశం వైపు చూస్తూ ఫోటోలు తీయడం కనిపించింది. ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. కాగా... ఏలియన్స్ భూమిపైకి రావడం అసాధ్యమని జనవరిలో ఇదే యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు చెప్పిన సంగతి తెలిసిందే!