తిరువూరు తెరవెనుక.. కొలికపూడిని కెలుకుతున్నది ఎవరు..?
ఒకప్పుడు టీడీపీకి పెట్టని కోట అయిన తిరువూరు నుంచి తొలిసారి బరిలో దిగుతూనే భారీ విజయం సాధించారు.
By: Tupaki Desk | 14 Oct 2024 1:30 AM GMTఆంధ్రప్రదేశ్ లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల నుంచే తిరువూరు రాజకీయం రంజుగా మారింది. ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గమైన ఇక్కడ టీడీపీ నుంచి కొలికపూడి శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా గెలిచారు. అమరావతి ఉద్యమకారుడిగా మీడియాలో విశేష ప్రాచుర్యం పొందిన కొలికపూడి.. ఉన్నత విద్యావంతులు. వైసీపీ ప్రభుత్వంలో రాజధాని అమరావతిని తరలించడాన్ని విమర్శిస్తూ తనదైన వాగ్ధాటితో ఆకట్టుకున్నారు శ్రీనివాసరావు. దీంతోనే టీడీపీకి దగ్గరై ఎన్నికల్లో టికెట్ కూడా పొందారు. ఒకప్పుడు టీడీపీకి పెట్టని కోట అయిన తిరువూరు నుంచి తొలిసారి బరిలో దిగుతూనే భారీ విజయం సాధించారు.
మొదటినుంచే.. ఫైర్ బ్రాండ్
ప్రభుత్వాల అపసవ్య విధానాలను, ప్రజలకు జరిగే అన్యాయాలను సహించని ధోరణి కొలికపూడిది. విద్యావంతుడు కావడంతో ఆయన చేసే విశ్లేషణ కూడా అంతే అర్థవంతంగా ఉండేది. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడేందుకు కారకులైన ప్రథముల్లో కొలికపూడి ఒకరు. అమరావతి అనే కాక వైసీపీ సర్కారు విధానాలను ఆయన టీవీ డిబేట్లలో ఎండగట్టిన తీరు సోషల్ మీడియాలోనూ హోరెత్తింది. ఇలా ఫైర్ బ్రాండ్ ధోరణితో ఏపీ ప్రజలందరికీ సుపరిచితులైన శ్రీనివాసరావు రాజకీయాల్లోకి వస్తూనే అదే తీరు కనబర్చారు. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఓ విషయంలో నేరుగా రంగంలోకి దిగడం తీవ్ర చర్చనీయాంశం అయింది.
ఒక్కోటిగా విమర్శలు
పార్టీ క్యాడర్ నుంచే తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడిపై వరుసగా ఫిర్యాదులు రావడం టీడీపీ అధిష్ఠానాన్నీ ఇబ్బందిపెట్టింది. ఎమ్మెల్యే దూకుడుతో పాటు ఆయన మాట తీరునూ తప్పుబడుతూ ఆరోపణలు వచ్చాయి. కొందరైతే మహిళలతో ఎమ్మెల్యే సంభాషణలనూ బయటపెట్టి వ్యక్తిగతంగానూ ఇబ్బంది పెట్టాలని చూశారు. దీంతోనే సీఎం చంద్రబాబు జోక్యం చేసుకుని విషయం తెలుసుకున్నారు. రాజకీయాల్లో సమన్వయం అవసరాన్ని ఆయన వివరించారు.
తెరవెనుక ఉన్నదెవరు?
తిరువూరు టీడీపీకి పెట్టని కోట. ఇక్కడినుంచి పలుసార్లు ఆ పార్టీ గెలిచింది. క్యాడర్ పరంగానూ ఏపీలో అత్యంత బలంగా ఉన్న నియోజకవర్గం. ఇలాంటిచోట కొలికపూడి కొత్తవారు అయ్యారు. ఆయనను అడ్డుకోవాలని పార్టీలో ఎప్పటినుంచో ఉన్న నాయకులు ఎత్తులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన అదుపులో పెట్టుకోవాలని చూసిన వర్గం.. అది సాధ్యం కాకపోవడంతో రివర్స్ గేర్ లో వెళ్తోందని.. కొలికపూడి గనుక తిరువూరులో సెటిల్ అయితే తమకు ఇక కష్టాలే అనేది వారి భావనగా చెబుతున్నారు. మరోవైపు దీనికి ఎమ్మెల్యే దూకుడు మరింత కారం పూసినట్లు అవుతోంది. కాగా, సీఎం జోక్యంతో తిరువూరు రగడ కొంత సద్దుమణిగింది. మరోవైపు మంత్రి నారా లోకేశ్ కూడా ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాల సమీక్ష చేపట్టారు. మిగతా వర్గాలకు చెందిన నాయకుల నుంచి స్థానిక ఎమ్మెల్యేలకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చేసే ఉద్దేశంలో ఉన్నారు.