Begin typing your search above and press return to search.

బీజేపీ మహా రాజకీయం స్టార్ట్!

ఈ దెబ్బకు కాంగ్రెస్ నాయకత్వంలో మహా వికాస్ ఆఘాడీ చావు దెబ్బ తినేలా ఉంది అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   23 Nov 2024 7:28 AM GMT
బీజేపీ మహా రాజకీయం స్టార్ట్!
X

మహారాష్ట్రలో బీజేపీ కూటమికి అద్భుతమైన విజయం దక్కుతోంది. ఫలితాల సరళి ఆ విధంగా ఉంది. ఈ దెబ్బకు కాంగ్రెస్ నాయకత్వంలో మహా వికాస్ ఆఘాడీ చావు దెబ్బ తినేలా ఉంది అని అంటున్నారు. ఏకంగా 222 సీట్ల దాకా ఎన్డీయే కూటమి మొగ్గు చూపిస్తోంది.

టోటల్ గా చూస్తే బీజేపీ నాయకత్వంలోని కూటమికి ఇవి అద్భుతమైన అవవకాశంగా చెప్పాలి. దీంతో ఈ మొత్తం సీట్లలో బీజేపీ వాటా 125 సీట్లుగా ఉంటోంది. అంటే సొంతంగా బీజేపీ సాధించుకున్న సీట్లు అన్న మాట. మ్యాజిక్ ఫిగర్ కి 20 సీట్లు మాత్రమే తక్కువ అవుతాయి అని అంటున్నారు.

దాంతో ఇన్ని సీట్లు సాధించిన తమకు సీఎం పదవి రావాల్సిందే అని మహా బీజేపీ నేతలు పట్టుబడుతున్నారు. వారంతా కలసి మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నివాసంలో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. బెజేపీకి సొంతంగా బ్రహ్మాండమైన సీట్లు వస్తే తాము సీఎం పదవిని వదులుకునే చాన్స్ ఎలా ఉంటుందని ఆ పార్టీ సీనియర్లు ప్రశ్నిస్తున్నారు.

మహా రాష్ట్రకు కాబోయే సీఎం ఫడ్నవీస్ అని బీజేపీ సీనియర్ నేత ప్రవీణ్ దారేకర్ బల్లగుద్ది చెబుతున్నారు. ఎక్కువ సీట్లు వచ్చిన పార్టీకే సీఎం పదవి దక్కుతుందని కూడా లాజిక్ పాయింట్ ని ముందు పెడుతున్నారు. మాకు 125 సీట్ల దాకా వస్తాయి, మా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అని ఆయన అంటున్నారు.

ఇక ప్రస్తుతానికి వస్తున్న ఫలితాలు చూస్తే బీజేపీ ఒంటరిగానే 110 సీట్లు గెలుచుకుంది. మరో ఇరవై దాకా సీట్లలో ఆధిక్యతలో ఉంది. సో కమలానిదే మహా పీఠం అని బీజేపీ నేతలు అంటున్నారు. ఇక కాస్త వెనక్కి వెళ్తే బీజేపీకి 2019లో మహా ఎన్నికల్లో 105 సీట్లు వచ్చాయి. అలాగే పొత్తులో ముందుకు వెళ్ళిన శివసేనకు 56 సీట్లు వచ్చాయి. దాంతో బీజేపీ అనాడు సీఎం పదవిని తీసుకుంటామని చెప్పింది. అక్కడ రాజీ కుదరక శివసేన పొత్తు నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ ఎన్సీపీలతో చేతులు కలిపింది సీఎం పదవిని దక్కించుకుంది.

ఇపుడు చూస్తే మళ్లీ బీజేపీ సీఎం పీఠం వైపు చూస్తోంది. అయితే ఇపుడు అక్కడ ఉన్నది శివసేన చీల్చి బీజేపీతో పొత్తు కలిపి రెండేళ్ళకు పైగా సీఎంగా ఉన్న ఏక్ నాధ్ షిండే. ఆయన వర్గం అయితే షిండేనే సీఎంగా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమ నాయకుడికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే ఒప్పుకునేది లేదని కూడా స్పష్టం చేస్తున్నాయి.

దీంతో 2019 నాటి పరిణామాలు మళ్లీ పునరావృత్తం అవుతాయా అన్న చర్చకు తెర లేస్తోంది. మరో వైపు చూస్తే అజిత్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ కూడా ఆయనను సీఎంగా చూడాలని అనుకుంటోంది. మరి ఈ విధంగా మిత్రులు ఇద్దరూ అడ్డం తిరిగితే బీజేపీకి సీఎం పదవి వచ్చేనా అన్నది చర్చగా ఉంది. ఏది ఏమైనా బీజేపీకి ఇంతటి విజయం దక్కడానికి మిత్రులుగా ఏక్ నాధ్ షిండే అలాగే అజిత్ పవార్ లు కారణం అని అంటున్నారు. మరి మిత్రులతో కలసి సామరస్యంగా నిర్ణయం తీసుకుంటేనే బీజేపీకి మేలు అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.