'జమిలి' జేపీసీ ఛైర్మన్ ఎవరు? సభ్యులు ఎవరు?
మోడీ నేత్రత్వంలోని ఎన్డీయే సర్కారు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ బిల్లును విపక్షాలు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 19 Dec 2024 4:43 AM GMTదేశ ఎన్నికల వ్యవస్థను పూర్తిస్థాయిలో మార్చేందుకు ఉద్దేశించిన జమిలి (ఒక దేశం ఒకే ఎన్నికలు) ఎన్నికలకు సంబంధించి ఉద్దేశించిన బిల్లు పార్లమెంటులో ప్రవేశ పెట్టిన వైనం తెలిసిందే. మోడీ నేత్రత్వంలోని ఎన్డీయే సర్కారు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ బిల్లును విపక్షాలు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బిల్లును లోక్ సభలో ప్రవేశ పెట్టాలా? వద్దా? అన్న అంశంపై జరిగిన ఓటింగ్ సానుకూల ఫలితాన్ని ఇవ్వటంతో బిల్లు ప్రవేశ పెట్టేందుకు అనుమతి లభించింది.
అయితే.. విపక్షాల అభ్యంతరం నేపథ్యంలో జాయింట్ పార్లమెంట్ కమిటీ (జేపీసీ)కి పంపాలని నిర్ణయించారు. తాజాగా ఈ కమిటీకి ఛైర్మన్.. సభ్యుల్ని డిసైడ్ చేశారు. జేపీసీకి గరిష్ఠంగా 31 మంది సభ్యుల్ని ఎంపిక చేసే వీలుంది. అందుకు తగ్గట్లే.. జమిలి ఎన్నికల జేపీసీకి ఛైర్మన్ తో సహా ముప్ఫై ఒక్క మందిని ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఈ జాబితాను విడుదల చేశారు.
పీపీ చౌధిరిని జమిలి జేపీసీ కమిటీ ఛైర్మన్ గా నియమించారు. ఇందులో సభ్యులుగా ఎంపికైన వారిని చూస్తే..
అనురాగ్ ఠాకూర్
అనిల్ బలూనీ
సంబిత్ పాత్రా
శ్రీకాంత్ ఏక్ నాథ్ షిండే
సుప్రియా సూలే
ప్రియాంక గాంధీ
మనీష్ తివారీ
సెల్వ గణపతి తదితరులు ఉన్నారు. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారికి చోటు లభించింది. జనసేన ఎంపీ బాలశౌరికి.. టీడీపీకి చెందిన హరీష్ బాలయోగితో పాటు రాజ్యసభ్య సభ్యుడిగా వ్యవహరిస్తున్న సీఎం రమేశ్ కు ఈ జేపీసీలో చోటు దక్కింది.
ఇక.. జేపీసీకి ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న పీపీ చౌధరి విషయానికి వస్తే ఆయన రాజస్థాన్ పాలి లోక్ సభా స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలోనూ కేంద్ర మంత్రిగా పని చేసిన అనుభవం ఉంది. జమిలి ఎన్నికలపై ఏర్పాటు చేసిన ఈ జేపీసీ సంప్రదింపులు.. అధ్యయనం చేసి తదుపరి సమావేశాల్లోగా నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. అవసరమైతే గడువును పెంచుకునే వీలుంది. అయితే.. ఇందుకు లోక్ సభ స్పీకర్ కు మాత్రమే చేయగలుగుతారు. జమిలిపై ఏర్పాటు చేసిన ప్రతిపాదనలను ఈ రోజు (గురువారం) కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ లోక్ సభకు తెలియజేస్తారు.