ఇద్దరిపైనా కేసులు? అటు యాంకర్ సుమ ఇటు బిత్తిరి సత్తి
ఏపీలోని ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన రాకీ ఎవెన్యూస్ ప్రైవేటు లిమిటెడ్.. రాజమండ్రిలో చంద్రిక అవంతిక ఫేజ్ 2 వెంచర్ వేసింది.
By: Tupaki Desk | 8 Aug 2024 5:24 AM GMTఎప్పుడూ లేని విధంగా ఒకేరోజు..కొద్ది గంటల తేడాతో యాంకర్లుగా తెలుగు ప్రజలకు సుపరిచితులైన ఇద్దరు సెలబ్రిటీలకు వారి మాటలే ఇప్పుడు శాపాలయ్యాయి. కేసుల చిక్కుముడిలో చిక్కుకున్న వైనం ఆసక్తికరంగా మారింది. ఇంతకూ ఆ ఇద్దరు ఫేమస్ యాంకర్లు ఎవరంటే.. ఒకరు సుమ కనకాల.. మరొకరు బిత్తిరి సత్తి. ఈ ఇద్దరి మాట తీరు భిన్నమైనప్పటికి.. వారి మాటలే వారిని ప్రత్యేకంగా నిలపటమే కాదు.. ప్రముఖుల్ని చేశాయి. తాజాగా వేర్వేరు రాష్ట్రాల్లో వీరి మీద వచ్చిన ఫిర్యాదులు ఇప్పుడు కేసుల రూపంలో ఎదుర్కొంటున్నారు.
ఏపీలోని ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన రాకీ ఎవెన్యూస్ ప్రైవేటు లిమిటెడ్.. రాజమండ్రిలో చంద్రిక అవంతిక ఫేజ్ 2 వెంచర్ వేసింది. ఇందులో అతి తక్కువ ధరకే డబుల్ బెడ్రూం.. ట్రిపుల్ బెడ్రూం ఫ్లాట్లను కట్టిస్తామని ప్రచారం చేసింది. ఈ సంస్థకు ప్రచారకర్తగా యాంకర్ సుమ వ్యవహరించారు. తన ప్రచారంలో భాగంగా నమ్మకంతో కూడిన కంపెనీగా పేర్కొంది. దీంతో.. చాలా మంది లక్షలాది రూపాయిల్ని సంస్థలో పెట్టుబడులుగా పెట్టారు. మొత్తంగా రూ.15 కోట్లు జనం నుంచి వసూలు చేసిన సదరు సంస్థ ఇప్పుడు కుచ్చుటోపీ పెట్టటంతో బాధితులు లబోదిబోమంటున్నారు.
ఇప్పటివరకు సదరు సంస్థ చెప్పిన ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదని.. అసలు వారు ఎక్కడికి వెళ్లారో తెలియట్లేదంటూ బాధితులు వాపోతున్నారు. దీంతో.. పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసి ప్లకార్డులతో రోడ్డెక్కారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఇదిలా ఉంటే.. కొందరు మాత్రం యాంకర్ సుమ ప్రచారానికి ప్రభావితమై..ఆమె మాటల్ని నమ్మి కొన్నామని.. తమకు న్యాయం చేయాలని కోరారు. మరికొందరు ఆమెకు లీగల్ నోటీసులు పంపారు. కేసులు కట్టించారు. తాము సుమను తప్పు పట్టటం లేదు కానీ.. ఆమె ప్రచారం వల్లే తాము డబ్బులు చెల్లించామని.. తమకు న్యాయం చేయాలని కోరారు.
ఈ అంశం మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున ప్రచారం అవుతున్న వేళ.. సుమ స్పందించారు. తాను సదరు సంస్థతో 2016- 2018 వరకు మాత్రమే ఒప్పందం చేసుకన్నానని.. ఇప్పుడు తనకు ఆ సంస్థతో ఎలాంటి సంబంధం లేదన్నారు. తనకు కొందరు లీగల్ నోటీసులు పంపారని.. వాటికి తానుసమాధానం ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. అదే సమయంలో రాకీ సంస్థకు నోటీసులు పంపించి.. ఏదైనా ప్రకటన చేయాలని వారిని కోరినట్లుగా పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే.. ప్రముఖ యాంకర్ బిత్తిరి సత్తి వివాదంలో చిక్కుకున్నారు.విలక్షమైన హావభావాలు.. తనదైన మాటలతో తెలుగు వారికి సుపరిచితులుగా మారిన అతను..తాజాగా చేసిన పనికి వివాదంలో చిక్కుకున్నారు. ప్రతిది కామెడీ చేయటం బాగానే ఉన్నా.. కోట్లాది మంది మనోభావాలను ప్రభావితం చేసే భగవద్గీతపైచేసిన వీడియోతో అడ్డంగా బుక్ అయ్యారు. వైరల్ గా మారిన ఈ వీడియోపై మండిపాటు వ్యక్తమవుతోంది.
యూట్యూబ్ లో వైరల్ గా మారిన ఈ వీడియోలో భగవద్గీతను అనుకరిస్తూ.. తనదైన శైలిలో వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తూ బిత్తిరి సత్తి స్కిట్ చేశారు. దీనిపై హిందూ సంఘాలు మండిపడుతూ.. సదరు వీడియోతో హిందువుల మనోభావాల్ని దెబ్బ తీసేలావీడియో ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోను వెంటనే తొలగించాలని.. హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలన్న డిమాండ్ ను తెర మీదకు తీసుకొచ్చింది రాష్ట్రీయ వానరసేన.
ఇదిలా ఉంటే.. తాను చేసిన వీడియోపై వచ్చిన విమర్శలపై బిత్తిరి సత్తి స్పందిస్తూ.. తనను తాను సమర్థించుకోవటం పలువురిని మరింత చిర్రెత్తుకునేలా చేసింది. తనను ఇన్ సల్ట్ చేయొద్దని.. కావాలంటే కసులు నమోదు చేసుకోవాలని చెప్పటం గమనార్హం. తన వీడియో కొన్ని వేల మందికి నచ్చిందని.. కొందరికి నచ్చకుంటే తానేం చేయలేన్న బిత్తిరిసత్తి మాటలతో మండిపడుతున్న వానరసేన తాజాగా సైబర్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. మొత్తంగా చూస్తే.. ఇద్దరు ఫేమస్ యాంకర్లు తమకు సెలబ్రిటీ స్టేటస్ తెచ్చి పెట్టిన మాటలతోనే తాజాగా వివాదంలో చిక్కుకోవటం.. కేసులకు దగ్గరగా వెళ్లటం గమనార్హం.