Begin typing your search above and press return to search.

అమెరికాకు బ్యాడ్ న్యూస్ చెప్పిన పెరిగ్రిన్‌... చంద్రుడిపైకి ప్రయోగం విఫలం!

ఇందులో భాగంగా... పెరిగ్రిన్‌ ను చంద్రుడిపై దింపాలని నిర్దేశించుకున్న లక్ష్యాన్ని విరమించుకుంటున్నట్లు వెల్లడించింది.

By:  Tupaki Desk   |   9 Jan 2024 11:29 AM GMT
అమెరికాకు బ్యాడ్  న్యూస్  చెప్పిన  పెరిగ్రిన్‌...  చంద్రుడిపైకి ప్రయోగం విఫలం!
X

సుమారు 50 ఏళ్ల తర్వాత అమెరికా నుంచి చంద్రుడిపైకి ఒక ల్యాండర్‌ ను పంపాలని చేసిన ప్రయోగం దాదాపు విఫలమైందని తెలుస్తుంది. ఈ సందర్భంగా పెరిగ్రిన్‌ వ్యోమనౌకను అభివృద్ధి చేసిన ప్రైవేటు కంపెనీ ఆస్ట్రోబోటిక్‌ టెక్నాలజీ కీలక ప్రకటన చేసింది. ఇందులో భాగంగా... పెరిగ్రిన్‌ ను చంద్రుడిపై దింపాలని నిర్దేశించుకున్న లక్ష్యాన్ని విరమించుకుంటున్నట్లు వెల్లడించింది. దీంతో ఇది అమెరికాకు బ్యాడ్ న్యూస్ అని అంటున్నారు పరిశీలకులు!

అవును... ఫ్లోరిడాలోని కేప్‌ కెనావెరాల్‌ స్పేస్‌ ఫోర్స్‌ స్టేషన్‌ నుంచి వుల్కన్‌ రాకెట్‌ ద్వారా నింగిలోకి ప్రయోగించిన పెరిగ్రిన్‌ వ్యోమనౌక ప్రయోగం దాదాపు విఫలమైందని తెలుస్తుంది. ఈ ప్రయోగం మొదలైన సుమారు 7 గంటల తర్వాత ఇబ్బంది తలెత్తిందని అంటున్నారు. ఇందులో భాగంగా... ల్యాండర్‌ కు సంబంధించిన సౌర ఫలకం.. సూర్యుడికి అభిముఖంగా లేదని ఇంజినీర్లు గుర్తించారు.

దీనివల్ల పెరిగ్రిన్‌ బ్యాటరీల ఛార్జింగ్‌ కోసం కావాల్సిన విద్యుదుత్పత్తి జరగడం లేదని తెలిపారు. అయితే ఎట్టకేలకు శాస్త్రవేత్తలు బ్యాటరీల సమస్యను పరిష్కరించినప్పటికీ... ప్రొపెల్లెంట్‌ కోల్పోవడం వల్ల తలెత్తిన అసలు సమస్యను మాత్రం సరి చేయలేకపోయినట్లు వెల్లడించారు. ఇదే సమయంలో యాటిట్యూడ్‌ కంట్రోల్‌ సిస్టం లోని సమస్యలు వెల్లడించింది.

ఇందులో భాగంగా... పెరిగ్రిన్‌ దిశను సమయానుకూలంగా మార్చే "యాటిట్యూడ్‌ కంట్రోల్‌ సిస్టం"లోని థ్రస్టర్లు ఇంధన లీక్‌ కారణంగా నిర్దేశిత క్రమంలో పనిచేయడం లేదని ఆస్ట్రోబోటిక్‌ టెక్నాలజీ సంస్థ ప్రకటించింది. అవి మాగ్జిమం మరో 40 గంటలు మాత్రమే పనిచేసే అవకాశం ఉందని.. ఆ తర్వాత సూర్యుడికి అభిముఖంగా వ్యోమనౌక దిశను మార్చడం కుదరదని.. ఫలితంగా విద్యుదుత్పత్తి పూర్తిగా నిలిచిపోతుందని వివరించింది.

అందువల్ల ఈ మిగిలి ఉన్న సమయంలోనే చంద్రుడికి వీలైనంత దగ్గరగా పెరిగ్రిన్‌ ను తీసుకెళ్లడమే తమ ప్రస్తుత లక్ష్యమని వెల్లడించింది. దీంతో... చంద్రుడిపైకి చేరుకోవాలన్న లక్ష్యం దాదాపు విఫలమైనట్లే అని అంటున్నారు.

కాగా... అమెరికా నుంచి సుమారు 50 ఏళ్ల తర్వాత చంద్రుడిపైకి ఒక ల్యాండర్‌ పంపాలని లక్ష్యంలో భాగంగా ప్లాన్ చేసుకున్న పెరిగ్రిన్‌ ల్యాండర్‌ కోసం ఆస్ట్రోబోటిక్‌ టెక్నాలజీస్ తో అమెరికా అంతరిక్ష సంస్థ - నాసా సుమారు 108 మిలియన్‌ డాలర్లకు ఒప్పందం కుదుర్చుకుంది.

ఇందులో... చంద్రుడిపై నీటి తీరుతెన్నులను శోధించే "పెరిగ్రిన్‌ అయాన్‌ మాస్‌ స్పెక్ట్రోమీటర్‌" సహా పలు సైన్స్‌ పరికరాలు ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా ప్రొపెల్లెంట్‌ కోల్పోవడం వల్ల చంద్రుడికి వీలైనంత దగ్గరకు వెళ్లాలనే ప్రయత్నంలో ఉంది తప్ప... చంద్రుడిపైకి చేరుకునే ఆశలు ఆల్మోస్ట్ లేవని తేలినట్లయ్యింది!