Begin typing your search above and press return to search.

ఒడిశా సీఎం రేసులో ఎవరున్నారు? ఎవరికి ఛాన్స్ లు ఎక్కువ?

ఒడిశాలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల మీద ఫోకస్ చేసిన కమలనాథులు.. ఎట్టకేలకు నవీన్ కంచుకోటను బద్దలు కొట్టేసి.. కాషాయ జెండాను ఎగురవేయటంలో సక్సెస్ అయ్యారు.

By:  Tupaki Desk   |   7 Jun 2024 12:31 PM GMT
ఒడిశా సీఎం రేసులో ఎవరున్నారు? ఎవరికి ఛాన్స్ లు ఎక్కువ?
X

ఒడిశా అన్నంతనే నవీన్ పట్నాయక్ గుర్తుకు వస్తారు. ఇంకెవరూ గుర్తుకు రారు. అంతలా ఆయన ఆ రాష్ట్రాన్ని తన వశం చేసుకున్నారు. ఒడిశాలో రాజకీయ పార్టీలు ఉన్నప్పటికి నవీన్ పట్నాయ్ ఛరిష్మా ముందు వెలవెలబోయే పరిస్థితి. ఇది ఏ ఐదేళ్లో.. పదేళ్లో కాదు దశాబ్దాల తరబడి (24 ఏళ్లుగా) సాగుతోంది. మరో ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ఇంతకాలం ఒడిశా ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ఆయనకు ఆ రాష్ట్ర అధికారిక భాష అయిన ఒడియాలో మాట్లాడటం సరిగా రాదు. అయినప్పటికీ ఒక ప్రాంతీయ పార్టీగా ఉండి.. అనేళ్లు ఆ రాష్ట్రాన్ని పాలించటం ఆయనకే చెల్లుతుంది. ఒడిశాలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల మీద ఫోకస్ చేసిన కమలనాథులు.. ఎట్టకేలకు నవీన్ కంచుకోటను బద్దలు కొట్టేసి.. కాషాయ జెండాను ఎగురవేయటంలో సక్సెస్ అయ్యారు.

తాజాగా వెల్లడైన ఫలితాల్లో నవీన్ పట్నాయక్ పార్టీ (బిజూ జనతాదళ్) ఓటమి పాలై.. బీజేపీ అధికారంలోకి వచ్చింది. దీంతో.. రెండున్నర దశాబ్దాల అనంతరం ఒడిశా ప్రజలు కొత్త ముఖ్యమంత్రిని చూడనున్నారు. తాజాగా వెల్లడైన ఫలితాల్లో బీజేపీ 78 స్థానాల్లో విజయం సాధించగా.. బిజూ జనతాదళ్ 51 స్థానాల్లో.. కాంగ్రెస్ పద్నాలుగు స్థానాల్లో.. ఇతరులు నాలుగు స్థానాల్లో విజయం సాధించారు. దీంతో.. ఒడిశా కోట బీజేపీ వశమైంది. ఇప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరిని ఎంపిక చేయనున్నారన్నది ఆసక్తికరంగా మారింది. పలువురు సీఎం కుర్చీ కోసం ప్రయత్నిస్తున్నా.. వారిలో నలుగురు ముఖ్యులుగా చెబుతున్నారు. వారికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని చెబుతున్నారు. వారెవరంటే..

1. ధర్మేంద్ర ప్రధాన్

2. కాగ్ గిరీశ్ చంద్ర

3. ప్రతాప్ సారంగీ

4. జైజయంత్ పండా

మరి.. ఈ నలుగురిలో ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి? బీజేపీ అధినాయకత్వం ఎవరిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేస్తుందన్న విషయాన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా వారి బలాలు.. బలహీనతల మీద అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆ లెక్కల్లోకి వెళితే..

ధర్మేంద్ర ప్రధాన్

ఒడిశా బీజేపీ అగ్రనేతల్లో ఒకరు. ముఖ్యమంత్రి రేసులో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. సంబల్ పుర్ ఎంపీ స్థానం నుంచి గెలిచిన ఆయన బిజూ జనతాదళ్ అగ్రనేత ప్రణబ్ ప్రకాశ్ దాస్ మీద 1.19 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కేంద్ర మంత్రిగా పని చేసిన అనుభవం ఉంది. కేంద్ర విద్యా శాఖ.. నైపుణ్య అభివృద్ధి శాఖల్ని నిర్వహించారు. గతంలో పెట్రోలియం, సహజవాయువు శాఖను నిర్వహించిన అనుభవం ఉంది.

మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎంపికైన ఆయన తొలిసారి 2017లో కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు ఎంపీగా ఎన్నికయ్యారు. వీరి కుటుంబానికి మొదట్నించి బీజేపీతో అనుబంధం ఉంది. ఆయన తండ్రి దేబేంద్ర ప్రధాన్ వాజ్ పేయ్ ప్రధానిగా ఉన్న వేళలో కేంద్ర మంత్రిగా పని చేశారు. విద్యార్థి దశలోనే ఏబీవీపీలో కీలక పాత్రను పోషించిన ఆయన.. కాలేజీ జీవితంలో ఏబీవీపీ సెక్రటరీగా ఎన్నికయ్యారు. రెండు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు (ఒకసారి మధ్యప్రదేశ్, మరోసారి బిహార్ నుంచి) వీటికి తోడు మోడీషాలతో మంచి సంబంధాలతో పాటు.. కేంద్రంలో కూడా పని చేసిన అనుభవం ఆయనకు లాభిస్తుందని చెబుతున్నారు.

కాగ్ గిరీశ్ చంద్ర

ఒడిశా సీఎం రేసులో ఉన్న మరో ముఖ్య బీజేపీ నేత. ఆర్టికల్ 370 తర్వాత కేంద్ర పాలిత ప్రాంతంగా మారిన జమ్మూకశ్మీర్ కు తొలి లెఫ్టినెంట్ జనరల్ గా బాధ్యతలు చేపట్టారు. బీజేపీ అధినాయకత్వానికి ముఖ్యంగా మోడీషాలకు అత్యంత నమ్మకస్తుడు. వీర విధేయుడు. దేశ పద్నాలుగో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) వ్యవహరించారు. ఆర్థిక రంగ నిపుణుడు. జాతీయ అంతర్జాతీయ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గుజరాత్ కేడర్ కు చెందిన ఆయన 1985 ఐఏఎస్ బ్యాచ్. ఆయన రిటైర్ అయ్యే నాటికి గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీనే ఉన్నారు.

అప్పట్లో ఆయనకు ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. ఆ పరిచయం ఆయనకు ప్రయోజనం కలిగించే వీలుంది. 1959 నవంబరులో ఒడిశాలోని మయూర్ భంజ్ జిల్లాలో ఆయన జన్మించారు. ఉన్నత విద్యాభాస్యం అనంతరం బర్మింగ్ హామ్ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పట్టా పొందారు. ఆయన కుటుంబ విషయానికి వస్తే ఎనిమిది మంది సిస్టర్స్.. ఆరుగురు బ్రదర్స్ ఉన్నారు. వీరిది పెద్ద కుటుంబం. కాకుంటే.. అందరు బాగా చదువుకున్న వారు. అతని సోదరుల్లో ఒకరైన శిరీష్ చంద్ర ముర్ము 2022 నాటికి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పని చేశారు.

కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఎంపికైన ఆయన నవంబరు 2024 వరకు ఆ పదవిలో ఉన్నారు. నరేంద్ర మోడీ, అమిత్ షాలకు ఆయన అత్యంత సన్నిహితుడు.. ప్రీతిపాత్రుడు. ఈ కారణంతోనే జమ్మూకశ్మీర్ కు మొదటి లెఫ్టినెంట్ గవర్నర్ గా కీలక బాధ్యతలు అప్పజెప్పారు. కాకుంటే.. బ్యూరో క్రాట్ గా ఉన్న ఆయన రాజకీయ నేతగా పనికి వస్తారా? అన్నది ప్రశ్న.

ప్రతాప్ సారంగీ

ఒడిశా మోడీగా ఆయనకు పేరుంది. 2019లో బాలేశ్వర్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసిన ఆయన.. గెలుపొందటం ద్వారా అందరి చూపు తన మీద పడేలా చేసుకున్నారు. మోడీ కేబినెట్ లో మంత్రిగా పని చేశారు. తాజాగా ఒడిశా ముఖ్యమంత్రి రేసులో ఉన్న ఆయన.. బీజేపీ అధినాయకత్వానికి అత్యంత విధేయుడు. ఒక నిరుపేద కుటుంబంలో పుట్టిన ఆయన కుర్తా ఫైజమాలో కనిపిస్తారు. గుబురు గడ్డంతో చిన్న ఇంట్లో ఉండే ఆయన.. సైకిల్ మీదనే ఎక్కువగా తిరుగుతారు.

ఇప్పుడున్న కాలంలో ఇలాంటి ఒక నాయకుడు.. అందునా ఒక ఎంపీ ఉంటారంటే ఎవరు నమ్మలేరు. కానీ.. ఆయన వ్యవహారశైలి మిగిలిన వారికి భిన్నం. బోరింగ్ పంపుల వద్ద స్నానం చేస్తూ సామాన్యుడిలా కనిపించే ఆయన.. పేదలకు.. అనాథ పిల్లలకు సేవ చేస్తూ ఉంటాడు. ఆయనకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా చెబుతారు. పెళ్లి కూడా చేసుకోలేదు. నిజానికి బెంగాల్ లోని రామక్రిష్ణ మఠంలో సన్యాసిగా చేరాలనుకున్నా.. తల్లిని చూసుకోవాల్సిన బాధ్యత ఉండటంతో సామాజిక కార్యక్రమాల మీద ఫోకస్ చేశారు. బీజేపీలో క్రియాశీలకంగా వ్యవహరించే ఆయన విద్యాభాస్యం విషయానికి వస్తే.. డిగ్రీ వరకు బాలాసోర్ లోనే చదివారు.

బీజేపీ ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచిన ఆయన.. ఎంపీగా 2014లో పోటీ చేసి ఓడారు. అయితే.. 2019లో మరోసారి పోటీ చేసి గెలిచిన ఆయన సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు.. పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, మత్స్య శాఖ మంత్రిగా వ్యవహరించారు. రాజకీయ నాయకుడిగా సెట్ అయ్యే ఆయన సీఎం రేసులో ఉన్నారు.

జైజయంత్ పండా

ముఖ్యమంత్రి రేసులో ఉన్న మరో ముఖ్య నేత. ఒడిశాకు చెందిన ఆయన ఇప్పటివరకు మూడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. బిజూ పట్నాయక్ పార్టీలో ఉండి.. ఆ పార్టీలో సస్పెండ్ అయిన ఆయన.. బీజేపీలో చేరారు. మిచిగాన్ టెక్నలాజికల్ వర్సిటీలో కమ్యునికేషన్స్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్ మెంట్ డిగ్రీని చేశారు. మాజీ మోడల్ కం పారిశ్రామికవేత్త అయిన జగి మంగత్ పాండాను వివాహం చేసుకున్నారు. పలు జాతీయ మీడియా సంస్థలకు కాలమ్స్ రాస్తుంటారు. సామాజిక కార్యక్రమాల్ని నిర్వహిస్తుంటారు.

పోషకాహార లోపం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్ని సందర్శించటం.. ఆ సందర్భంగా అక్కడ వారు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిశీలించి.. పరిష్కారాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తుంటారు. అంతేకాదు.. దేశంలో పోగాకు ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించాలనే ప్రచారాన్ని ఎక్కువగా చేస్తుంటారు. మనం చూసే సిగిరెట్ ప్యాకెట్ల మీద 60 శాతం వరకు పోగాకు ఉత్పత్తుల్ని వినియోగిస్తే కలిగే నష్టాన్ని తెలిపేలా ప్యాకెట్లు ఉండేలా చేయటంలో కీలక భూమిక పోషించారు. వలస కార్మికుల శ్రమదోపిడీకి వ్యతిరేకంగా గళం విప్పిన బ్యాక్ గ్రౌండ్ ఉంది. 2019లో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా.. పార్టీ అధికార ప్రతినిధిగా వ్యవహరించారు. చాలా కీలక సమస్యలపై పార్లమెంటులో అనేక ప్రైవేటు బిల్లుల్ని ప్రవేశ పెట్టిన ఘన చరిత్ర ఆయన సొంతం.

ఈ నలుగురిని చూస్తే.. ఎవరు ఎవరికి తక్కువ కాదన్నట్లుగా ఉంటుంది. అయితే.. బీజేపీలో ఉన్న సంప్రదాయం గురించి తెలిసిందే. సీఎం రేసులో ఉన్నట్లు ప్రచారం సాగిన వారిని కాకుండా కొత్త ముఖాన్ని.. అప్పటివరకు ఎవరూ ఊహించని వారిని తీసుకొచ్చి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టటం చూశాం. మరేం చేస్తారన్నది మరో రెండు మూడు రోజుల్లో తేలనుంది.