Begin typing your search above and press return to search.

మాణిక్యం.. మాణిక్ రావ్ పోయి.. మున్షీ వచ్చె..? ఎవరీ దీపా దాస్?

సహజంగా అధికారంలోకి వచ్చాక 15 రోజుల్లోపే ఇంచార్జిని మార్చడం చర్చనీయాంశమైంది.

By:  Tupaki Desk   |   25 Dec 2023 6:23 PM GMT
మాణిక్యం.. మాణిక్ రావ్ పోయి.. మున్షీ వచ్చె..? ఎవరీ దీపా దాస్?
X

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జిగా రెండేళ్లలోనే మూడో వ్యక్తి వచ్చారు. సహజంగా అధికారంలోకి వచ్చాక 15 రోజుల్లోపే ఇంచార్జిని మార్చడం చర్చనీయాంశమైంది. అందులోనూ కీలకమైన పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఓ మహిళను తెలంగాణ బాధ్యతల్లో నియమించడం అంటే.. కీలక పరిణామంగానే చెప్పాలి. దీనివెనుక వ్యూహం ఏమిటనేది అంతుబట్టాల్సి ఉంది.

బెంగాల్ నుంచి జాతీయ రాజకీయాల్లోకి..

తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జిగా నియమితురాలైన దీపా దాస్ మున్షీ పశ్చిమ బెంగాల్ కు చెందినవారు. ఇటీవలి ఎన్నికలకు దీపాదాస్ పరిశీలకురాలిగా పనిచేశారు. కాగా, దీపాదాస్ భర్త ఎవరో కాదు. కాంగ్రెస్ జాతీయ రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించిన ప్రియరంజన్ దాస్ మున్షీ భార్య. చాలా తక్కువకాలంలోనే జాతీయస్థాయి నాయకురాలిగా ఎదిగారు. 2014లో తొలిసారి ఎంపీగా ఎన్నికైన వెంటనే దీపాదాస్ మున్షీకి.. మన్మోహన్ సింగ్ కేబినెట్ లో చోటుదక్కింది. 1960 జూలై 15 బినోయ్-దుర్గా ఘోష్ దంపతులకు జన్మించిన దీపాదాస్.. ప్రాథమిక, ఉన్నత విద్యాబ్యాసం కోల్ కతాలో చేశారు. నటన అంటే ఇష్టంతో రవీంద్రనాథ్ ఠాగూర్ యూనివర్సిటీలో ఎంఏ డ్రామెటిక్స్ చేసారు. యూనివర్సిటీ టాపర్ గా గోల్డ్ మెడల్ సాధించారు. టీవీ ఆర్టిస్ట్ గా, కాస్ట్యూమ్ డిజైనర్, ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేశారు.

ప్రియరంజన్ దాస్ మున్షీతో పెళ్లి తర్వాత దీపాదాస్ రాజకీయాల్లో అడుగుపెట్టారు. 2006 లో గోలఖ్ పూర్ ఎమ్మెల్యేగా గెలిచారు. 2009 లోక్ సభ ఎన్నికల్లో రాయిగంజ్ ఎంపీగా విజయం సాధించారు. 2012 లో మన్మోహన్ కేబినెట్ లో అర్బన్ డెవలప్ మెంట్ మంత్రి అయ్యారు. అయితే, 2017 లో ప్రియరంజన్ దాస్ మున్షీ మరణం దీపా జీవితంలో తీరని విషాదం.

బాధను దిగమింగి బాధ్యతల్లోకి..

భర్త మరణం కోలుకోలేని దెబ్బ అయినప్పటికీ.. ఆ బాధ నుంచి బయటపడేందుకు రాజకీయాల్లో మరింత బిజీ అయ్యారు. అప్పటినుంచి ఆమెకు పార్టీనే ప్రపంచమైంది. దీనికితగ్గట్టే పలు అవకాశాలిచ్చింది కాంగ్రెస్ అదిష్ఠానం. తాజాగా అత్యంత కీలకమైన తెలంగాణ బాధ్యతలు అప్పగించింది. సంక్లిష్టమైన పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ ను నడిపించే అవకాశం ఆమెకు దక్కింది. దీపా కంటే ముందు తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జిగా మాణిక్యం ఠాగూర్, మాణిక్ రావ్ ఠాక్రే వ్యవహరించిన సంగతి తెలిసిందే.