Begin typing your search above and press return to search.

ఇంతకూ ఎవరీ హరదీప్‌ సింగ్‌ నిజ్జర్‌!

భారత ప్రభుత్వ ఏజెంట్లే తమ దేశ పౌరసత్వం ఉన్న ఖలిస్థాన్‌ టైగర్‌ ఫోర్స్‌ అధినేత హరదీప్‌ సింగ్‌ ను నిజ్జర్‌ ను హతమార్చినట్టు కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ఆరోపించడం

By:  Tupaki Desk   |   19 Sep 2023 1:40 PM GMT
ఇంతకూ ఎవరీ హరదీప్‌ సింగ్‌ నిజ్జర్‌!
X

ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటైన కెనడా.. భారత్‌ పై హత్య ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. భారత ప్రభుత్వ ఏజెంట్లే తమ దేశ పౌరసత్వం ఉన్న ఖలిస్థాన్‌ టైగర్‌ ఫోర్స్‌ అధినేత హరదీప్‌ సింగ్‌ ను నిజ్జర్‌ ను హతమార్చినట్టు కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ఆరోపించడం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారి తీసిన సంగతి తెలిసిందే. కెనడా తమ దేశంలోని భారత రాయబారిని బహిష్కరించగా భారత్‌ కూడా ఇంతే ధీటుగా స్పందించింది. భారత్‌ లో కెనడా రాయబారిని దేశం నుంచి బహిష్కరించింది. ఐదు రోజుల్లో తమ దేశం విడిచిపోవాలని ఆల్టిమేటం జారీ చేసింది.

కాగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగడానికి కారణమైన హరదీప్‌ సింగ్‌ నిజ్జర్‌ ఎవరనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. హరదీప్‌ సింగ్‌ నిజ్జర్‌.. పంజాబ్‌ లోని జలంధర్‌ సమీపంలోని భార్‌ సింగ్‌ పుర గ్రామానికి చెందినవాడని చెబుతున్నారు. అతడు 1997లో కెనడాకు ప్లంబర్‌ గా వలస వెళ్లాడు. ఆ తర్వాత కెనడా పౌరసత్వం పొందాడు. నాటి నుంచి ఖలిస్థానీ వేర్పాటువాదులతో అంటకాగుతూ వచ్చాడు. వారితో బలమైన సంబంధాలు నెరపాడు. అంతేకాకుండా ఖలిస్థాన్‌ టైగర్‌ ఫోర్స్‌ ఏర్పాటు వెనుక మాస్టర్‌ మైండ్‌ కూడా అతడేనని తెలుస్తోంది.

భారత్‌ లోని పంజాబ్, హరియాణా, ఢిల్లీ, రాజస్థాన్‌ లోని కొన్ని ప్రాంతాలతో ప్రత్యేక ఖలిస్తాన్‌ దేశం ఏర్పాటు చేయాలని హరదీప్‌ సింగ్‌ నిజ్జర్‌ ఉద్దేశం. ఈ నేపథ్యంలో ఖలిస్థాన్‌ టైగర్‌ ఫోర్స్‌ పై భారత్‌ నిషేధం విధించింది. కాగా హరదీప్‌ సింగ్‌.. సిక్స్‌ ఫర్‌ జస్టిస్‌లో కూడా సభ్యుడుగా ఉన్నాడు. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో హరదీప్‌ సింగ్‌ ను భారత్‌ ప్రభుత్వం 2020లో ఉగ్రవాదిగా ప్రకటించింది.

కాగా 2007లో పంజాబ్‌ లోని లూథియానాలో జరిగిన బాంబుపేలుడు కేసులో హరదీప్‌ సింగ్‌ నిజ్జర్‌ మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ గా ఉన్నాడు. ఈ దాడిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. 40 మంది గాయాలపాలయ్యారు.

అలాగే 2009లో పంజాబ్‌ లోని పాటియాలాలో రాష్ట్రీయ సిక్‌ సంగత్‌ అధ్యక్షుడు రూల్డా సింగ్‌ హత్యలో కూడా హరదీప్‌ సింగ్‌ నిజ్జర్‌ పాత్ర ఉంది. గతేడాది ఓ హత్యకేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఏఐ) హరదీప్‌ ను పట్టించిన వారికి రూ.10 లక్షలు బహుమతి కూడా ప్రకటించింది. అంతేకాదు.. కెనడా, యూకే, అమెరికాలోని భారత దౌత్య కార్యాలయాలపై దాడుల వెనుక, భారతదేశ వ్యతిరేక కార్యకలాపాల వెనుక అతడి హస్తం ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూన్‌ 18న కెనడాలోని బ్రిటిష్‌ కొలంబియాలోని సర్రే వద్ద ఖలిస్థాన్‌ టైగర్‌ ఫోర్స్‌ అధినేత హరదీప్‌ సింగ్‌ నిజ్జర్‌ ను గురుద్వారాలో ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు కాల్చిచంపారు. అయితే ఈ హత్యను భారత్‌ ప్రభుత్వ ఏజెంట్లే చేశారని ఖలిస్తాన్‌ టైగర్‌ ఫోర్స్‌ ఆరోపిస్తోంది. ఇప్పుడు ఇవే ఆరోపణలను కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో కూడా చేయడం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు కారణమైంది.

ఖలిస్థాన్‌ నేతల ఒత్తిడితోనే కెనడా ప్రభుత్వం... భారత్‌ సైన్యం, పంజాబ్‌ పోలీస్‌ లో పనిచేసి రిటైరైన సిబ్బంది ఎప్పుడైనా కెనడా వెళ్లాలంటే వీసాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతోంది. ముఖ్యంగా జమ్మూకశ్మీర్లో కౌంటర్‌ టెర్రరిజం ఆపరేషన్లలో పాల్గొన్న సిబ్బందికి వీసాలు ఇవ్వడం లేదు. కెనడా వీసా కోసం దరఖాస్తు చేసుకొంటే భద్రతా దళాల సిబ్బంది పనిచేసిన ఆపరేషన్లు, ఇతర సున్నితమైన సమాచారాన్ని ఆ దేశం అడుగుతోందనే విమర్శలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది జూన్‌ 18న హరదీప్‌ సింగ్‌ ని కెనడాలోనే ఎవరో హత్య చేశారు. దాన్ని భారత ప్రభుత్వానికి కెనడా చుడుతోంది. దీంతో ఇరు దేశాల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి.