Begin typing your search above and press return to search.

పీసీసీ 'పీఠ' ముడి !

కర్ణాటకలో డిప్యూటీ సీఎంగా ఉన్న డీకె శివకుమార్ కేపీసీసీ అధ్యక్షుడుగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ తనకు పీసీసీ పీఠం అప్పగించాలని భట్టి విక్రమార్క కోరుతున్నారు.

By:  Tupaki Desk   |   17 May 2024 7:40 AM
పీసీసీ పీఠ ముడి  !
X

తెలంగాణ పీసీసీ నూతన అధ్యక్షుడు ఎవరు ? ముఖ్యమంత్రిగా, పీసీసీ అధ్యక్షుడుగా జోడు పదవులు నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డిని తప్పించి పీసీసీ పీఠాన్ని కొత్త వ్యక్తికి అప్పగిస్తారా ? అంటే ఢిల్లీ స్థాయిలో జరుగుతున్న లాబీయింగ్ లు చూస్తే నిజమేనని అనిపిస్తుంది. పీసీసీ పీఠం కొరకు రేవంత్, మల్లు భట్టివిక్రమార్క వర్గాలు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నాయి. సీనియర్ నాయకులు ఒక వైపు. రేవంత్ వర్గం ఒకవైపు మోహరించారు.

కర్ణాటకలో డిప్యూటీ సీఎంగా ఉన్న డీకె శివకుమార్ కేపీసీసీ అధ్యక్షుడుగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ తనకు పీసీసీ పీఠం అప్పగించాలని భట్టి విక్రమార్క కోరుతున్నారు. ఇటీవల ఖమ్మం లోక్ సభ సీటు తన భార్యకు ఇవ్వాలని తీవ్ర ప్రయత్నాలు చేసిన భట్టి ఇప్పుడు పీసీసీ పీఠం డిమాండ్ చేస్తున్నాడు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత టీపీసీసీకి కొత్త అధ్యక్షుడు వస్తాడని అధిష్టానం సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో రాహుల్ కు సన్నిహితులుగా ఉన్న వారితో ఆయనకు చెప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇటీవల మంత్రి శ్రీధర్ బాబును కలిసిన భట్టి రాయ్ బరేలీలో రాహుల్ కు మద్దతుగా ప్రచారం పేరుతో రాహుల్ ను ఒప్పించుకుని పీసీసీ పీఠం దక్కించుకునేందుకు వెళ్లారని ప్రచారం నడుస్తున్నది. ఇటీవల పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గేతో బెంగళూరులో సమావేశమైన సందర్భంగా కూడా తనకు పీసీసీ అధ్యక్ష పదవిని ఇవ్వాలని భట్టి కోరినట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఇప్పటికే భట్టికి హామీ ఇచ్చినట్టు కూడా తెలుస్తున్నది. ఇక మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కూడా భట్టి విక్రమార్క మద్దతు పలుకుతున్నట్లు తెలుస్తుంది.

ముఖ్యమంత్రిగా రెడ్డి, డిప్యూటీ సీఎం, స్పీకర్లుగా ఎస్సీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తులు ఉన్న నేపథ్యంలో పీసీసీ పీఠం బీసీకి అప్పగించాలంటూ రేవంత్ వర్గం తమకు నమ్మకస్తుడయిన ప్రస్తుత పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్‌ ను ముందుకు తీసుకువచ్చింది. అదే సామాజిక వర్గానికి చెందిన మధు యాష్కీ గౌడ్ రేసులో ఉన్నా మహేష్ కుమార్ గౌడ్ కే రేవంత్ వర్గం మద్దతు పలుకుతున్నది. పీసీసీ రేసులో రేవంత్, భట్టిలలో ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి.