Begin typing your search above and press return to search.

కౌంటింగ్ డే : ఏపీ అంతా ఇంట్లోనే !

కేవలం ఏపీలో మాత్రమే కాదు తెలంగాణాతో పాటు దేశమంతా ఏపీలో ఏమి జరుగుతుందో చాలా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.

By:  Tupaki Desk   |   30 May 2024 2:30 PM GMT
కౌంటింగ్ డే  :  ఏపీ అంతా ఇంట్లోనే !
X

ఎన్నికల చరిత్రలో ఒక బిగ్ డే రాబోతోంది. ఎండలో రాత్రిలో గంటల తరబడి నిలబడి ఓటెత్తిన కోట్లాది మంది ప్రజానీకం ఎదురు చూసే రోజు కౌంటింగ్ డే. కేవలం ఏపీలో మాత్రమే కాదు తెలంగాణాతో పాటు దేశమంతా ఏపీలో ఏమి జరుగుతుందో చాలా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.

జాతీయ స్థాయిలో చూస్తే ఏపీ ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి వస్తారు అనేది అతి పెద్ద ఇంట్రెస్టింగ్ మ్యాటర్ గా ఉంది. నిజానికి దేశంలో కొత్త ప్రభుత్వం ఏవరిది అన్న చర్చ ఒక వైపు ఉండనే ఉంది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఏపీ ఎన్నికల మీద చర్చ సాగుతోంది. ఒక్క మాటలో చెప్పాలీ అంటే తెలుగు వారు ఎక్కడ ఉన్నా కూడా ఏపీ మీదనే డిస్కషన్ సాగుతోంది.

దాదాపుగా ఇరవై కోట్లు ఉన్న తెలుగు వారు అంతా జూన్ 4న టీవీలకు అతుక్కుపోవడం ఖాయం అని అంటున్నారు. మరి బయట వారికే అంత టెన్షన్ ఉంటే ఏపీలోని వారికి ఎలా ఉంటుంది అన్నదే మరో ఆసక్తికరమైన విషయం.

ఆ రోజున జనం అంతా దాదాపుగా ఇళ్ళకే పరిమితం అవుతారు అని అంటున్నారు. అంటే ఏపీ మొత్తం ఇంట్లోనే అని అంటున్నారు. దానికి ప్రజల ఉత్కంఠ ఒక కారణం అయితే కౌంటింగ్ తరువాత ఏపీలో ఘర్షణలు పెద్ద ఎత్తున జరుగుతాయి అన్న ఆలోచనలలో లా అండ్ ఆర్డర్ కి పదును పెడుతున్న తీరు మరో కారణం.

ఈసీ జూన్ 4 న అత్యంత కఠిన నిబంధనలను అమలు చేయబోతోంది. కౌంటింగ్ ముందు రోజు నుంచి బయట వారిని కొత్త వారికి ఆయా నియోజకవర్గాల్లో అడుగు పెట్టనీయరు. కొత్త వారు అని తెలిస్తే వారికి లాడ్జీలలో కానీ హొటళ్ళలో కానీ గదులు ఇవ్వవద్దు అని ఇప్పటికే నిబంధనలు పెట్టేసారు.

పోలీస్ బలగాలు చూస్తే పెద్ద ఎత్తున ప్రతీ చోటా మోహరించాయి. సమస్యాత్మక ప్రాంతాలలో అయితే భారీ ఎత్తున పోలీసులను దించారు. కౌంటింగ్ ముందు రోజు నుంచి మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్ అవుతున్నాయి. కేంద్ర బలగాలు కీలక ప్రాంతాలలో ప్రత్యేక పర్యవేక్షణ చేయనున్నాయి.

ఏపీ మొత్తంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. దాంతో పకడ్బంధీగా బందోబస్తు ఉంది. నిఘా నీడలో ఏపీ మొత్తం వెళ్ళిపోయింది. ఇక కౌంటింగ్ కి ముందు రోజు అంటే జూన్ 3న సున్నితమైన ప్రాంతాలలో కేంద్ర బలగాలతో మార్చ్ ని నిర్వహిస్తున్నారు.

ఆర్టీసీ బస్సుల గమనానికి కూడా ఆంక్షలు పెట్టారు. పట్టణంలోని బస్టాండ్ దాకా వెళ్లకుండా వాటిని వెలపలే ఆపాలని పోలీసుల నుంచి ఆదేశాలు ఉన్నాయి. అలా ఆర్టీసీ డిపోలకు బస్సులు రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లుగా అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ ఆస్తుల ద్వంసం అంటే అందరి చూపూ ఆర్టీసీ బస్సుల మీదనే పడుతుంది కాబట్టే ఈ కఠిన నిర్ణయం అని అంటున్నారు.

మరో వైపు చూస్తే జూన్ 4న అత్యవసరం అయితేనే ప్రయాణాలు చేయాలి తప్ప లేకపోతే మానుకోవాలని సూచనలు కూడా ఉన్నాయి. అంటే ఎక్కడి వారు అక్కడే అన్న పరిస్థితి అన్న మాట. లేని పోని అవాంఛనీయ సంఘటనలు జరిగితే అమాయకులు బలి అవుతారు అన్న ఉద్దేశ్యంతోనే ఈ సూచనలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు.

మద్యం ఎక్కడైనా విక్రయించినట్లు కనిపించినా కఠిన చర్యలు తీసుకుంటామని అంటున్నారు. అలాగే సున్నితమైన ప్రాంతాల్లో జూన్ 4 కౌంటింగ్ రోజున దుకాణాలు అన్నీ మూసివేయాలని కూడా సూచిస్తున్నారు. ఘర్షణలు చోటు చేసుకుంటాయన్న సమాచారంతోనే ఈ ముందు జాగ్రత్త చర్యలు అని అంటున్నారు.

అదే విధంగా పెట్రోల్ బంకులలో ఎవరైనా విడిగా సీసాలలో లూజ్ అమ్మకాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటారని ఈసీ నుంచి హెచ్చరికలు ఉన్నాయి. మొత్తం మీద చూస్తే జూన్ 4 మాత్రం ఏపీలో కర్ఫ్యూ వాతావరణం కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏపీలో కోట్లాది జనం అంతా దాదాపుగా ఇంట్లో లేదా ఆఫీసుల్లోనే కనిపిస్తారు తప్ప రోడ్ల మీదకు ఎవరూ వచ్చే అవకాశాలు లేవు అని అంటున్నారు. మొత్తానికి ఏపీ చరిత్రలోనే అత్యంత కీలకమైన ఎన్నికల ఫలితాలు మరి కొద్ది రోజులలో వెలువడుతున్న వేళ ఏపీ మూడ్ మాత్రం చాలా టెన్షన్ గానే ఉంది అని అంటున్నారు.