Begin typing your search above and press return to search.

గప్పుడు దొర.. గిప్పుడు దొర పేరుతో హోల్ సేల్ కౌంటర్!

ఏది ఏమైనా సరే ఈసారి ఎన్నికల్లో సత్తా చాటాలని డిసైడ్ అయ్యాక పరిస్థితి ఎలా ఉంటుందన్నది కాంగ్రెస్ తాజా ప్రచార వ్యూహాల్ని చూస్తే అర్థమవుతుంది.

By:  Tupaki Desk   |   27 Nov 2023 7:01 AM GMT
గప్పుడు దొర.. గిప్పుడు దొర పేరుతో హోల్ సేల్ కౌంటర్!
X

అందుకే అంటారు.. నాలుగు దెబ్బలు అవతలోడు వేసినప్పుడు రెండు దెబ్బలు ఇవతలోడు వేయడా అని. విమర్శకు ప్రతి విమర్శ ఉంటుంది. అది కూడా కూసింత ఘాటుగానే. తెలివి ఏ ఒక్కరి సొత్తు కాదు. నిందలతో దాడికి దిగితే ప్రతి నిందతో ఎదురుదాడి చేసే ఇంగితం ఇవాల్టి రోజున సామాన్యుడికైనా ఉన్న పరిస్థితి. అలాంటిది రాజకీయ పార్టీకి ఉండదా? అందునా.. గాలి బలంగా వీస్తుందన్న ఉత్సాహం ఒకటి తోడైన రోజున... ఏది ఏమైనా సరే ఈసారి ఎన్నికల్లో సత్తా చాటాలని డిసైడ్ అయ్యాక పరిస్థితి ఎలా ఉంటుందన్నది కాంగ్రెస్ తాజా ప్రచార వ్యూహాల్ని చూస్తే అర్థమవుతుంది.


అధికార పక్షంగా పదేళ్లు తమ ప్రభుత్వం ఏమేం చేసిందన్న విషయాల్ని.. విజయాల్ని ప్రచారం చేసుకోవటం తప్పేం కాదు. అయితే.. అందుకు భిన్నంగా పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న పార్టీని వేలెత్తి చూపించేందుకు అరవై ఏళ్ల చరిత్రను తవ్వి తీయటం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుంది. మనం మర్చిపోయిన విషయాల్ని సైతం గుర్తుచేసే అవకాశాన్ని ఇచ్చినట్లు అవుతుంది. మామూలుగానే అధికారపక్షం మీద ప్రజల్లో అంతో ఇంతో అసంత్రప్తి ఉంటుంది. ప్రతిపక్షం మీద సానుభూతి ఉంటుంది.

ఈ చిన్న లాజిక్ మర్చిపోయి.. అప్పుడెప్పుడు దశాబ్దాల నాడు జరిగిపోయిన వాటిని తవ్వితీసి.. సరికొత్త ప్రచారాస్త్రాలుగా మార్చుకున్న బీఆర్ఎస్ కు తాజాగా హోల్ సేల్ కౌంటర్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. నాడు -నేడు.. రక్తచరిత్ర.. ఇలా నెగిటివ్ ప్రచారంతో ప్రత్యర్థుల మీద నిందలేస్తున్న ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ ‘‘గప్పుడు దొర.. గిప్పుడు దొర’’ పేరుతో సిద్ధం చేసిన ప్రచారఅస్త్రం ఇప్పుడువైరల్ గా మారింది.

గప్పుడు దొర అంటూ కేసీఆర్ ను.. గిప్పుడు దొర అంటూ అదే కేసీఆర్ నెత్తిన పింక్ కిరీటం పెట్టి.. ఊసరవెల్లి మాటలతో ప్రజల్ని మభ్య పెట్టారని.. పదేళ్ల పాలనలో 15 అబద్ధాల్ని ఎంత అందంగా చెప్పారో చూశారా.. అన్న విషయాన్ని కళ్లకు కట్టినట్లుగా తయారు చేశారు. ఈ ప్రచార చిత్రాన్ని జాకెట్ యాడ్ గా మార్చేసి పత్రికల్లో ప్రచురించటం ద్వారా.. గులాబీ పార్టీకి హోల్ సేల్ కౌంటర్ ఇచ్చారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

దళిత నాయకుడ్ని ముఖ్యమంత్రిని చేస్తానని.. ఇంటికో ఉద్యోగం ఇస్తానని.. చివరి గింజ వరకు ధాన్యాన్ని కొంటానని.. కుర్చీ వేసుకొని పోడు పట్టాలిస్తానని.. అల్లుడొస్తే ఏడ పండుకోవాలె అంటూ డబుల్ బెడ్రూం.. దళితులకు మూడెకరాలు ఇస్తానని.. అందరికి కేజీ టు పీజీ ఉచిత విద్య అని.. జాబ్ నోటిఫికేషన్ అని.. ఆడపిల్లవైపు చూస్తే గుడ్లు పీకేస్తానని.. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తామని.. 100శాతం నిరుద్యోగ భ్రతి ఇస్తామని.. తెలంగాణ వస్తే కాంట్రాక్టు ఉద్యోగాలు ఉండవని.. ఇలా ప్రతి అంశాన్ని ప్రస్తావించటం ఒక ఎత్తు అయితే..చివర్లో సోనియాగాంధీ గారి వల్లే తెలంగాణ సాకారం అయిందన్న ఆయన మాటకు.. మరొకరుమధ్యలో ఉండి ‘‘అబ్బ ఈ ఒక్క మాట నిజం చెప్పినవ్ దొర’’ అంటూ ముగించారు. ఈ ప్రచార చిత్రం వైరల్ కావటమే కాదు.. బీఆర్ఎస్ నేతల విమర్శలకు హోల్ సేల్ కౌంటర్ ఇచ్చినట్లుగా మారిందన్న మాట వినిపిస్తోంది. మరి.. దీనికి ఎలాంటి కౌంటర్ ఇస్తారో చూడాలి.