అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. భారతీయ అమెరికన్ల మద్దతు ఎవరికి?
కాగా దక్షిణ కాలిఫోర్నియా గవర్నర్, అమెరికా రాయబారి నిక్కీ హేలీకి 33 శాతం మంది భారతీయ–అమెరికన్లు మాత్రమే మద్దతు ఇచ్చారు.
By: Tupaki Desk | 11 July 2024 2:30 PM GMTఈ ఏడాది నవంబర్ లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. మనకులాగా ఐదేళ్లకోసారి కాకుండా ప్రతి నాలుగేళ్లకోసారి అమెరికాలో అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఈ నేపథ్యంలో డెమోక్రటిక్ పార్టీ తరఫున మరోసారి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, రిపబ్లికన్ పార్టీ తరఫున డోనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికల బరిలో తలపడుతున్నారు. వీరిద్దరూ జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇద్దరి మధ్య డిబేట్లు, సవాళ్లు, ప్రతి సవాళ్లు చోటు చేసుకుంటున్నాయి.
కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ అమెరికన్లది కీలక పాత్ర. అమెరికాలో 5 మిలియన్లకు పైగా భారతీయులు ఉన్నారు. అమెరికాలో ఉన్న మొత్తం 55 లక్షల మంది భారతీయుల్లో అత్యధికం ఆ దేశ పౌరసత్వాన్ని కూడా పొందారు. ఈ నేపథ్యంలో వారి ఓట్లు కీలకం కానున్నాయి.
మరోవైపు అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ భారత సంతతికి చెందిన వ్యక్తే కావడం గమనార్హం. ఆమే కాకుండా దక్షిణ కాలిఫోర్నియా గవర్నర్ గా ఉన్న నిక్కీ హేలీ కూడా భారత సంతతి వ్యక్తే. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ అమెరికన్ల మద్దతు ఎవరికి లభిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
గత ఎన్నికల్లో భారతీయ అమెరికన్లలో అత్యధిక శాతం డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ కు మద్దతు ఇచ్చారు. ట్రంప్ కు తక్కువ మద్దతు లభించింది. అయితే ఈసారి ట్రంప్ కు కొంత మద్దతు పెరిగింది. ఇదే క్రమంలో జో బైడెన్ కు మద్దతిచ్చే భారతీయ అమెరికన్ల శాతం తగ్గింది. ఈ మేరకు ఆసియన్ అమెరికన్ ఓటర్ సర్వే (ఏఏవీఎస్) వెల్లడించింది.
ప్రతి రెండేళ్లకోసారి ఆసియన్ అమెరికన్ ఓటర్ సర్వేను నిర్వహిస్తారు. ఈ సర్వే వివరాల ప్రకారం.. ఈ నాలుగేళ్లలో జో బైడెన్ కు మద్దతునిచ్చే భారతీయ–అమెరికన్ మద్దతుదారులలో 19 శాతం మంది తగ్గిపోయారు. 2020 ఎన్నికల్లో బైడెన్ కు 68 శాతం మంది భారతీయ అమెరికన్లు మద్దతు ఇచ్చారు. ఈసారి వీరిలో 49 శాతం మందే మద్దతు ఇవ్వవచ్చని ఏఏవీఎస్ సర్వే తేల్చింది.
ఇక రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న డోనాల్డ్ ట్రంప్ కు 30 శాతం మంది భారతీయ అమెరికన్లు మద్దతిచ్చే అవకాశం ఉందని సర్వే తేల్చింది.
అలాగే ఇంకో సర్వే.. ఆసియా అండ్ పసిఫిక్ ఐలాండర్ అమెరికన్ వోట్, ఆసియన్ అమెరికన్స్ అడ్వాన్సింగ్ జస్టిస్ సర్వే ప్రకారం.. 49 శాతం మంది భారతీయ–అమెరికన్లు ఈ ఏడాది జో బైడెన్‌కు ఓటు వేసే అవకాశం ఉందని తెలిపింది.
గత రెండు దశాబ్దాలుగా అమెరికాలో ఆసియా అమెరికన్ ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది ఈ సర్వే తేల్చింది. గత నాలుగేళ్లలో ఆసియా అమెరికన్ ఓటర్లలో 15 శాతం వృద్ధి నమోదైందని పేర్కొంది. మరోవైపు భారతీయ–అమెరికన్ ఓటర్ల సంఖ్య తగ్గడం ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ కు ఇబ్బంది కలిగించే అంశమని సర్వే వ్యాఖ్యానించింది. డొనాల్డ్ ట్రంప్ నకు రెండు పాయింట్ల మేరకు ప్రయోజనం ఉండబోతోందని ఈ సర్వే తెలిపింది.
కాగా దక్షిణ కాలిఫోర్నియా గవర్నర్, అమెరికా రాయబారి నిక్కీ హేలీకి 33 శాతం మంది భారతీయ–అమెరికన్లు మాత్రమే మద్దతు ఇచ్చారు. మరో 11 శాతం మంది ఆమె ఎవరో తమకు తెలియదని పేర్కొనడం విశేషం.