Begin typing your search above and press return to search.

జగన్ మౌనాన్ని భగ్నం చేస్తున్నదెవరు ?

అయితే కొన్ని చోట్ల జరుగుతున్న దాడులు అయితే జగన్ మౌనాన్ని కూడా భగ్నం చేసే విధంగా సాగుతున్నాయి. ఆయన్ని మళ్లీ రమ్మంటూ పిలిచేలా ఉన్నాయి.

By:  Tupaki Desk   |   18 July 2024 1:12 PM GMT
జగన్ మౌనాన్ని భగ్నం చేస్తున్నదెవరు ?
X

వైసీపీ దారుణంగా ఓడిన పార్టీ. వైసీపీకి టీడీపీ మాదిరిగా సంస్థాగతంగా పూర్తి స్థాయిలో నిర్మాణం లేదు అని అంటారు. నాయకులు అంతా అధికారం పోయాక ఎవరికి వారుగా సైలెంట్ గా ఉంటున్నారు. తమ పని తాము చేసుకుంటున్నారు. చాలా మంది అయితే పక్క చూపులు చూస్తున్నారు అని విమర్శలు ఉన్నాయి.

ఇక అధినేత జగన్ అయితే టీడీపీ కూటమికి కనీసంగా ఆరు నెలల నుంచి ఏడాది పాటు హానీమూన్ పీరియడ్ ఇచ్చేయాలని డిసైడ్ అయ్యారు. ప్రజలు అతి పెద్ద తీర్పుని ఇచ్చారు కాబట్టి దానిని గౌరవించాలని ఆయన పార్టీ వారికి చెప్పినట్లుగా ప్రచారం జరిగింది.

మరో వైపు చూస్తే పూర్తిగా తగ్గి ఉండాలని కూటమికే అంతా చాన్స్ ఇవ్వాలని వైసీపీ డిసైడ్ కావడం అంటే అది ఆ పార్టీ వ్యూహంగా చూసుకున్నా జనాలకు దూరంగా సైలెన్స్ గా పార్టీ ఉండడం ఆత్మహత్యా సదృశ్యమే అని కూడా కామెంట్స్ వినిపించాయి.

అయితే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక వైసీపీని పూర్తిగా మరపిస్తుందని ఆ ఊసు ధ్యాసా లేకుండా చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ దానిని భిన్నంగా వైసీపీని బదనాం చేయాలన్న ఉద్దేశ్యంతోనో లేక వైసీపీని ముందు పెట్టి ఏపీ నష్టపోయిందని చెప్పాలనో తరచూ ఆ పార్టీ గురించే అంతా మాట్లాడుతున్నారు.

దానికి వైసీపీ నుంచి వస్తున్న కౌంటర్లు కూడా చాలా పేలవంగా బేలంగా ఉంటున్నాయి. మరీ చెప్పాలంటే అసలు వైసీపీ వాయిస్ కూడా ఎక్కడా వినిపించడం లేదు. ఇంకో వైపు చూస్తే వైసీపీ వారి మీద దాడులు జరగడం, ఈ విషయంలోనూ వైసీపీ నుంచి కార్యకర్తలు ఆశించినంతగా స్పందన కనిపించడం లేదు అన్న ఆవేదన ఆక్రందన అయితే నిండుగా ఉంది.

మరో వైపు చూస్తే వైసీపీ క్యాడర్ కూడా అధినాయకత్వం మీద గుస్సాగా ఉంటూ ఓటమి తరువాత తమ దోవ తమది అన్నట్లుగా ఉంది. అయితే క్యాడర్ ని తట్టి లేపి రెచ్చగొట్టి వారి మీద దాడులు చేయడం అనేది కొన్ని చోట్ల జరుగుతోంది అని అంటున్నారు. దాంతో వారు వైసీపీ వైపు నుంచి గట్టిగా గ్రౌండ్ లెవెల్ లో పోరాడాల్సి వస్తోంది.

ఇంకో వైపు జగన్ కూడా కొంత విరామం ఇస్తూ తాడేపల్లి టూ బెంగళూరు ఇలా చేస్తూ వస్తున్నారు. అయితే కొన్ని చోట్ల జరుగుతున్న దాడులు అయితే జగన్ మౌనాన్ని కూడా భగ్నం చేసే విధంగా సాగుతున్నాయి. ఆయన్ని మళ్లీ రమ్మంటూ పిలిచేలా ఉన్నాయి.

లేకపోతే వారం రోజుల పాటు బెంగళూరు పర్యటనకు వెళ్ళిన జగన్ అర్ధాంతరంగా తన టూర్ ని విరమించుకుని రావడం అంటే ఆలోచించాల్సిందే. మొత్తానికి ఫలితాలు వచ్చిన తరువాత వైసీపీ అధినాయకత్వం తో సహా టాప్ టూ బాటమ్ అంతా డీలా పడి బేజారెత్తిన వేళ ఒక విధంగా అన్నీ లైట్ తీసుకుంటూ ముందుకు సాగుతున్న వేళ ఏపీలో రాజకీయం మాత్రం వారిని అలా ఉండనీయడం లేదు అని అంటున్నారు.

దాంతో జగన్ సైతం రీ యాక్టివ్ అవుతున్నారు. క్యాడర్ కూడా చురుకు అవుతున్నారు. ఈ పరిణామాల వల్ల వైసీపీ మళ్లీ జనంలోకి వెళ్ళే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అధికార కూటమి పెద్దల వ్యూహాలు ఎలా ఉన్నా కొంతమంది క్యాడర్ ఆ వైపు నుంచి చేస్తున్న రెచ్చగొట్టుడు వైఖరి వల్లనే తిరిగి వైసీపీకి ఊపిరి అందుతోంది అన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి.

ఏది ఏమైనా వైసీపీ మళ్లీ దూకుడు చేస్తే ఘోరమైన ఫలితాలు తరువాత చాలా తొందరగా కోలుకున్నట్లే. అయితే దానికి కారణం సొంత పార్టీ వారి వ్యూహాలు ఏ మాత్రం కాదు అని కూడా అంటున్నారు. ఆ విధంగా వారికి అనివార్య పరిస్థితి కల్పించి ముగ్గులోకి లాగుతున్న ప్రత్యర్ధుల పుణ్యమే ఇదంతా అని అనుకోవాలి.

దానికి వైసీపీ మనసారా థాంక్స్ చెప్పుకోవాల్సిందే అని అంటున్నారు. వైసీపీ అధినేత జగన్ సహా పార్టీ పెద్దలకు ఎలా జనంలోకి రావాలి అన్నది ఆలోచిస్తున్న వేళ రూట్ మ్యాప్ ఇస్తూ ముందుకు తోస్తున్న వ్యక్తులు శక్తులు ఎవరైనా కూడా వారికి ధన్యవాదాలు వైసీపీ చెప్పి తీరాల్సిందే. ఏది ఏమైనా ఏపీ రాజకీయం ఇలాగే ఉంటుందని మరో సారి రుజువు అవుతోంది. అదే సమయంలో గిఫ్టులు రిటర్న్ గిఫ్టుల కల్చర్ కూడా అలాగే కొనసాగుతుందని చెప్పాల్సి ఉంటుంది.