Begin typing your search above and press return to search.

కొత్త రచ్చ: ఢిల్లీ టెర్మినల్ పాపం ఎవరిది?

కూలిన పైకప్పు పనులు కాంగ్రెస్ హయాంలో జరిగినట్లుగా కేంద్ర మంత్రి ప్రకటించిన నేపథ్యంలో అందులో ఎలాంటి వాస్తవం లేదని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   28 Jun 2024 2:30 PM GMT
కొత్త  రచ్చ: ఢిల్లీ టెర్మినల్ పాపం ఎవరిది?
X

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడైన నాటి నుంచి బీజేపీ వర్సెస్ ఇండియా కూటమి అన్నట్లుగా మారింది. 370 సీట్లు కాయమని.. కూటమితో 400 ప్లస్ సీట్లు వచ్చేస్తాయన్న ధీమాతో ఉన్న బీజేపీకి.. ఓటర్లు ఇచ్చిన షాక్ తో కంగుతిన్న పరిస్థితి. అదే సమయంలో.. ఇండియా కూటమికి కొత్త శక్తి వచ్చినట్లైంది. గతంతో పోలిస్తే ఇటీవల కాలంలో వారి వాయిస్ పెరిగింది. మోడీ సర్కారు మీద విమర్శలు గుప్పించేందుకు అస్సలు వెనుకాడటం లేదు. ఇలాంటి వేళ.. ఢిల్లీ ఎయిర్ పోర్టు టెర్మినల్ 1 పైకప్పు ఈ తెల్లవారుజామున కూలిపోవటంతో కొత్త రచ్చ షురూ అయ్యింది.

ఈ పాపం ఎవరిది? అన్నదిప్పుడు ప్రశ్న. దీనికి కారణం లేకపోలేదు. ఇప్పటికే ఈ దుర్ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదుగురి పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు చెబుతున్నారు. భారీ వర్షాల కారణంగా టెర్మినల్ 1 పైకప్పు కూలిందని చెబుతున్నా.. నిర్మాణ లోపమే కారణమన్న మాట పలువురి నోట వస్తోంది. ఇదిలా ఉంటే.. ప్రమాదానికి కారణం ఏమిటన్న విషయాన్ని తాము తెలుసుకుంటామని పౌర విమానయాన శాఖా మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. సహాయక చర్యల్ని దగ్గరుండి ఆయన పర్యవేక్షించారు.

ఈ టెర్మినల్ ను ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభించినట్లు ప్రతిపక్ష నేతలు చెబుతున్నా.. అందులో నిజం లేదన్న కేంద్ర మంత్రి "2009లో టెర్మినల్ నిర్మాణం జరిగింది" అంటూ కొత్త చర్చకు తనదైన సమాధానం ఇచ్చారు. ఈ ఘటనలో మరణించిన వారికి రూ.20 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి రూ.3 లక్షల సాయాన్ని ప్రకటించారు. గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని రామ్మోహన్ నాయుడు పరామర్శించారు.

కూలిన పైకప్పు పనులు కాంగ్రెస్ హయాంలో జరిగినట్లుగా కేంద్ర మంత్రి ప్రకటించిన నేపథ్యంలో అందులో ఎలాంటి వాస్తవం లేదని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే.. ప్రియాంక గాంధీలు స్పందిస్తూ.. మోడీనే ఈ టెర్మినల్ ను ప్రారంభించినట్లుగా పేర్కొన్నారు. పదేళ్ల మోడీ హయాంలో నిర్మించిన నిర్మాణాలు కూలిపోతున్నట్లుగా మండిపడుతున్నారు. కాంగ్రెస్.. ఎన్డీయే నేతలు ఎవరికి వారు తమది బాధ్యత కాదన్నట్లుగా చేస్తున్న వ్యాఖ్యలతో.. ఈ పైకప్పు నిర్మాణం ఎవరి హయాంలో జరిగింది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.