Begin typing your search above and press return to search.

వర్గీ'కారణం'.. టీపీసీసీ అధ్యక్షుడిగా అనూహ్య ఎంపిక?

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవీ కాలం గత నెలలోనే పూర్తయింది.

By:  Tupaki Desk   |   16 Aug 2024 6:14 AM GMT
వర్గీకారణం.. టీపీసీసీ అధ్యక్షుడిగా అనూహ్య ఎంపిక?
X

రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంటే ముఖ్యమంత్రికి సమాన పదవి పీసీసీ అధ్యక్షుడు. పార్టీ రాష్ట్ర సారథిగా కాంగ్రెస్ లో ఆ పదవిలోని వ్యక్తికి దక్కే గౌరవమే వేరు. ఉమ్మడి ఏపీలో వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు డీఎస్, కేశవరావు, కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో బొత్స సత్యనారాయణ వంటి కీలక నాయకులు పీసీసీ సారథులుగా కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన పదేళ్లు కాంగ్రెస్ ప్రతిపక్షంలోనే ఉంది. ఆ సమయంలోనూ టీపీసీసీ సారథులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి పనిచేశారు. నేటి టీపీసీసీ చీఫ్ రేపటి ముఖ్యమంత్రి అనే అభిప్రాయం కాంగ్రెస్ వర్గాల్లో ఉంటుంది.

రేవంత్ తర్వాత ఎవరు?

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవీ కాలం గత నెలలోనే పూర్తయింది. ప్రభుత్వ సారథిగా పెద్ద బాధ్యతలు మోయాల్సి ఉన్న నేపథ్యంలో రేవంత్ స్థానంలో టీపీసీసీ అధ్యక్షుడి నియామకం కోసం కాంగ్రెస్ అధిష్ఠానం తీవ్ర మంతనాలు సాగించింది. అయితే, అవి ఒక కొలిక్కిరాలేదు. మధ్యలో ఆషాఢమూ అడ్డు వచ్చింది. ఇప్పుడు ఆషాఢం పోయి మంచి రోజులు వచ్చిన నేపథ్యంలో ప్రదేశ్ కాంగ్రెస్ కొత్త సారథి ఎంపిక తెరమీదకు వచ్చింది.

ఖమ్మం టు ఢిల్లీ..

రేవంత్ గురువారం ఉమ్మడి ఖమ్మంలో పర్యటించారు. అటునుంచి వచ్చాక ఢిల్లీ వెళ్లారు. అధినాయకత్వంతో సమావేశం కానున్నారు. కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తున్న టీపీసీసీ అధ్యక్షుడి నియామకాన్ని తేల్చేయనున్నారు. దీంతోపాటు అత్యంత కీలకమైన మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీపై చర్చించనున్నారు. అయితే, టీపీసీసీ చీఫ్ గా ఎవరిని నియమించాలో కూడా నిర్ణయించేశారని సమాచారం. రాష్ట్రంలోని పరిస్థితుల నేపథ్యంలో రేవంత్ అబిప్రాయం కీలకం కానుంది.

అడ్లూరి రేసులో ముందుకు..

టీపీసీసీ అధ్యక్షుడి ఖరారులో కీలక పరిణామలు జరిగాయి. సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యం ఇస్తూ ముఖ్యుల పేర్లు తెర మీదకు వచ్చాయి. మొన్నటివరకు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ కు ఖాయమైందని భావిస్తుండగా, అంతలోనే మహబూబాబాద్‌ ఎంపీ బలరాం నాయక్‌ పేరు గట్టిగా వినిపించింది. ఈ మేరకు ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర అధ్యక్ష పదవిని గిరిజన వర్గానికి ఇవ్వాలనే డిమాండ్ దీనివెనుక బలంగా వినిపిస్తోంది. అయితే, ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ పేరు ఇంకా బలంగా తెరపైకి వచ్చింది. దీనికి కారణం.. వర్గీకరణ.

ఎస్సీల వర్గీకరణ తెలంగాణలో ప్రధానాంశంగా ఉంది. సుప్రీం కోర్టు ఇటీవల వర్గీకరణకు అనుకూలంగా తీర్పునిచ్చింది. మరోవైపు ఈ ఘనతను బీజేపీ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. తెలంగాణలో మాదిగలు అధికం. వీటన్నిటి నేపథ్యంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన లక్ష్మణ్‌ కు పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే మంచిదని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. అంతేకాదు.. లక్ష్మణ్ ఎన్ఎస్ యూఐ నుంచి ఎదిగారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినా.. పార్టీనే మొదటినుంచి నమ్ముకుని ఉన్నారు. దీంతోనే ఆయన పేరును గట్టిగా ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తున్నది. మాజీ ఎంసీ మధు యాస్కీ కూడా రేసులో ఉన్నారు.

20 నామినేటెడ్ పోస్టులు..

రేవంత్‌ తన పర్యటనలో 20 నామినేటెడ్‌ పోస్టుల భర్తీకి ఆమోదం లభించే అవకాశం కనిపిస్తోంది. పార్టీ విభాగాలకు అధ్యక్షుల నియామకం, మంత్రి పదవుల విస్తరణ వంటివి సరేసరి. ఢిల్లీలో ఫాక్స్‌ కాన్‌ సంస్థ ప్రతినిధులతోనూ సీఎం, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చర్చించనున్నారు. కాగా, రేవంత్ ఢిల్లీ పర్యటనతో ఇన్ని పదవులపై ఒకేసారి స్పష్టత రానుండడం గమనార్హం.