Begin typing your search above and press return to search.

గవర్నర్ పదవుల కోసం ఆ ఇద్దరూ వెయిటింగ్ ?

ఏపీ నుంచి కూటమిలో కీలకమైన టీడీపీకి ఒక గవర్నర్ పదవి ఇవ్వడం ఖాయంగా ఉంది.

By:  Tupaki Desk   |   9 Aug 2024 3:45 AM GMT
గవర్నర్ పదవుల కోసం ఆ ఇద్దరూ వెయిటింగ్ ?
X

కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వానికి ఆక్సిజన్ గా టీడీపీ మద్దతు మారింది. పదహారు మంది ఎంపీలు ఏపీ నుంచి టీడీపీ తరఫున గెలిచి వచ్చారు. వారంతా ఎన్డీయేకు మద్దతు ఇవ్వడం వల్లనే మోడీ మళ్ళీ ప్రధాని అయ్యారు. దాంతో ఈసారి టీడీపీకి కేంద్రంలో విలువ బాగా పెరిగింది. పదవులు అడగాలే కానీ ఇవ్వడానికి సిద్ధంగా కేంద్రం ఉంది.

ఇటీవల వివిధ రాష్ట్రాలకు గవర్నర్ పదవులను ఎన్డీయే ప్రభుత్వం భర్తీ చేసింది. అలా బీజేపీ కోటాలో గవర్నర్ పదవులకు సీనియర్లకు అవకాశం ఇచ్చారు. మరో విడత కూడా ఉంటుందని అంటున్నారు. అపుడు కచ్చితంగా మిత్రులకు ఇస్తారని అంటున్నారు.

ఏపీ నుంచి కూటమిలో కీలకమైన టీడీపీకి ఒక గవర్నర్ పదవి ఇవ్వడం ఖాయంగా ఉంది. ఆ పదవి కోసం టీడీపీలో ఇద్దరు సీనియర్లు కాచుకుని కూర్చున్నారు. ఆ ఇద్దరూ టీడీపీ అధినేత చంద్రబాబుకు బాగా కావాల్సిన వారే కావడం విశేషం. ఒకరు విజయనగరం సంస్థానాధీశుడు కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు.

అలాగే మరొకరు ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా ఆర్ధిక మంత్రిగా పనిచేసిన యనమల రామక్రిష్ణుడుగా చెబుతున్నారు. ఈ ఇద్దరిలో ఒకరికి గవర్నర్ గిరీ ఖాయం అని అంటున్నారు. అయిదేళ్ళ పాటు రాజ్ భవన్ లో గవర్నర్ హోదాను అందుకోవడం అంటే గ్రేట్ అనే చెప్పాలి.ఆ పదవికి ఉన్న ప్రోటోకాల్ ని కూడా చూసుకుంటే ఈ పోస్ట్ కోసం ఇద్దరు సీనియర్లూ మక్కువ చూపిస్తున్నారు అని అంటున్నారు.

అయితే చంద్రబాబు మదిలో ఎవరి పేరు ఉందో తెలియదు అని అంటున్నారు. ఇద్దరూ బాబుకు అత్యంత సన్నిహితులు అన్నది అందరికీ తెలిసిందే. ఇటీవల టీటీడీ చైర్మన్ పదవిని ఇవ్వాలని చూసినా అశోక్ గజపతిరాజు సున్నితంగా నో చెప్పారని అంటున్నారు. ఆయనకు గవర్నర్ పదవి మీద మక్కువ ఉందని అందుకే కాదని అన్నారని అంటున్నారు.

అదే విధంగా చూస్తే యనమల రామక్రిష్ణుడు సైతం 2025 మార్చితో ఎమ్మెల్సీ పదవి నుంచి రిటైర్ కానున్నారు. దాంతో ఆయన కూడా గవర్నర్ పోస్టు ఈ మధ్యలోనే వస్తే అదే మహా భాగ్యం అనుకుంటున్నారు అని అంటున్నారు. అయితే ఒకరికి గవర్నర్ పదవి ఇచ్చి మరొకరికి రాజ్యసభ సీటు కట్టబెట్టాలని బాబు చూస్తున్నారు.

అయితే రాజ్యసభ పదవి కంటే గవర్నర్ పదవే అన్ని విధాలుగా మేలు అని తలుస్తున్న ఈ సీనియర్ల నుంచి ఒకరిని ఎంచుకోవడం మాత్రం బహు కష్టమే అని అంటున్నారు. అయితే ఈ ఇద్దరూ మనసులో ఏమనుకున్నా ఎలా ఆలోచించినా బాబు మాటకు గౌరవం ఇస్తారు కాబట్టి ఆయనే గవర్నర్ గా ఒకరిని చేస్తారని అంటున్నారు. మరి కాబోయే గవర్నర్ ఎవరో చూడాల్సి ఉంది.